
సాక్షి, అమరావతి: వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకాలు అందేలా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చూపించిన చొరవ ఫలితానిచ్చింది. టీకాలపై నియంత్రణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నందున వ్యాక్సినేషన్ బాధ్యతను కూడా కేంద్రమే తీసుకోవాలని, దీనిపై అంతా ఒకే బాటలో నిలుద్దామంటూ సీఎం జగన్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయడం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సీఎంలు ఇదే అంశాన్ని వివరిస్తూ లేఖలు రాయడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 18 ఏళ్లు దాటిన దేశ ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు అందచేస్తామని, ఈ బాధ్యతను తాము తీసుకుంటామని తాజాగా ప్రధాని మోదీ ప్రకటించడం తెలిసిందే. ప్రజలందరికీ ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం సముచిత ప్రాధాన్యం కల్పించిందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
అన్ని మార్గాల్లోనూ అన్వేషణ..
రాష్ట్రాలకు తగినన్ని టీకాలు ఇవ్వకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు మాత్రమే వ్యాక్సిన్లు సరఫరా చేస్తే దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని, వీటిపై నియంత్రణ ప్రభుత్వ పరిధిలోనే ఉంచాలని కోరుతూ కూడా సీఎం జగన్ మరో లేఖను ప్రధానికి రాయడం తెలిసిందే. ఒకవైపు కేంద్రం నుంచి వ్యాక్సిన్లు పొందేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తూనే గ్లోబల్ టెండర్లకు కూడా వెళ్లాలని సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇలా ఏ ఒక్క అవకాశాన్నీ వదలకుండా అన్ని ప్రయత్నాలు చేశారు.
కోటి డోసులు పూర్తి..
కేంద్రం సరఫరా చేసిన ఉచిత వ్యాక్సిన్లను వినియోగించుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేటాయించిన డోసులనూ కొనుగోలు చేసింది. రూ.125 కోట్ల పై చిలుకు విలువైన పర్చేజీ ఆర్డర్లు ఇచ్చింది. ఇందులో ఇప్పటికే రూ.61 కోట్లను సరఫరా అయిన వ్యాక్సిన్లకు చెల్లింపులు చేశారు. మొత్తం 37.60 లక్షల డోసులకు రాష్ట్రం ఆర్డర్లు ఇచ్చింది. జూన్ నెలకు సంబంధించిన కేటాయింపులు రావాల్సి ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల తాజాగా కోటి డోసులు పూర్తి చేయగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment