CM Jagan Launches 4G Services, 100 Jio Towers By Virtually - Sakshi
Sakshi News home page

మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, జియో టవర్లను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్‌

Published Thu, Jun 15 2023 1:15 PM | Last Updated on Fri, Jun 16 2023 6:35 AM

CM Jagan Launched 4g Service 100 Jio Towers By Virtually - Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, ఒకేసారి 100 జియో టవర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.  క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. దీని ద్వారా 209 మారుమూల గ్రామాలకు సేవలు అందనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైయస్సార్‌ జిల్లాలో 2 టవర్లను సీఎం ప్రారంభించారు.

టవర్లను ఏర్పాటు చేసిన రిలయన్స్‌ జియో సంస్థ.. భవిష్యత్తులో 5జీ సేవలను అప్‌గ్రేడ్‌ చేయనుంది. కొత్తగా ప్రారంభించిన సెల్‌టవర్ల వల్ల మారుమూల ప్రాంతాలనుంచి ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో సీఎం జగన్‌ ఇంటరాక్ట్‌ అయ్యారు. ఈ ప్రాజెక్టు కింద కొత్తగా 2,704 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే 2,363 చోట్ల స్థలాలు ప్రభుత్వం అప్పగించింది.  

టవర్లతో మరింత మెరుగ్గా సేవలు 
టవర్ల ఏర్పాటు కారణంగా ఏపీలో మారుమూల ప్రాంతాల్లో మరింతగా మెరుగుపడనున్నాయి ప్రభుత్వ సేవలు. ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ మరింత కనెక్టివిటీ, మెరుగైన నాణ్యతతో సేవలు అందుతాయి. అలాగే విద్యార్థులకు ఇ– లెర్నింగ్‌ అందనుంది. మరింత మెరుగ్గా అందనున్నాయి ఆరోగ్య సేవలు. ఆర్థికంగానూ ఆయా ప్రాంతాలకు మరింత లబ్ధి చేకూరనుంది.



మారుమూల ప్రాంతాలకు..
రాష్ట్రంలో సెల్‌ సర్వీసులు లేని 5,459 ఆవాసాలకు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.  మొబైల్, ఇంటర్నెట్‌ సర్వీసులు ద్వారా  మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకూ వారి ముంగిటకే సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా యూనివర్సిల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌) ద్వారా సెల్‌టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం. ప్రస్తుతం ఏర్పాటు చేసిన సెల్‌ టవర్ల పరిధిలో 150 ఎంబీపీఎస్‌ డౌన్లోడ్, 50 ఎంబీపీఎస్‌ అప్‌లోడ్‌ చేసుకునేందుకు ఇప్పుడు అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలతో మాట్లాడుకుని.. మార్గదర్శకాలను సులభతరం చేసుకుని.. సెల్‌టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేసుకుంది ఏపీ ప్రభుత్వం.

ఇక అవరసమైన మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసింది ప్రభుత్వం. డిసెంబర్‌ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటునకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.

పెద్ద ఎత్తున మార్పులు రాబోతున్నాయ్‌: సీఎం జగన్‌
టవర్లను ప్రారంభించిన అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘అందరికీ అభినందనలు. కేంద్ర ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్స్‌ విభాగానికి, జియోకు, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిరికీ ధన్యవాదాలు. డిసెంబరు నాటికి రాష్ట్రంలో సెల్‌ సర్వీసులు లేని ఆవాసాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీతో పాటు పెద్ద ఎత్తున మార్పులు రానున్నాయి.  దీంతో అన్ని సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, స్కూళ్లకూ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లభిస్తుంది. రేషన్‌ పంపిణీ, ఇ–క్రాప్‌ బుకింగ్‌ కూడా సులభమవుతుంది. మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును అత్యంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా అక్కచెల్లెమ్మలకు అందించగలుగుతాం.  

అదే విధంగా వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా హాజరైన ప్రజాప్రతినిధులకు, అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ టవర్స్‌ ఏర్పాటు వల్ల మీ అందరికీ ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి చేసే పరిస్థితులు  రావాలని మనసారా కోరుకుంటున్నా అని తెలిపారు సీఎం జగన్‌.


చదవండి: పోలవరం అడవిలో అరుదైన జాతికి చెందిన బంగారు బల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement