ఏకీకృత పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు నమూనాను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి కర్నూలు: ప్రకృతి వనరులను ఒడిసిపట్టి చౌకగా, నిరంతరం విద్యుత్ లభ్యమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న సందర్భాల్లో సైతం ఎలాంటి కోతలు లేకుండా సరఫరా చేసేలా రాష్ట్రంలో 33,240 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో గ్రీన్‌కో సంస్థ నిర్మిస్తున్న అతిపెద్ద ఏకీకృత పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు పంప్డ్ స్టోరేజీ పవర్ యూనిట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలు బలపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు అడుగులు ముందే నిలవడం గమనార్హం. గ్రీన్‌కో ప్లాంట్‌లో సౌర, పవన, హైడల్ విధానాల్లో విద్యుదుత్పత్తి జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల ప్రయోజనాలను సీఎం జగన్ వివరించారు. ఈరోజు ఒక అద్భుతమైన, చారిత్రక సన్నివేశం ఆవిష్కృతమవుతోందన్నారు.
శంకుస్థాపన సందర్భంగా తాపీ చేతపట్టి సిమెంట్ వేస్తున్న సీఎం వైఎస్ జగన్
కాలుష్య రహితంగా..
‘పర్యావరణ సమతుల్యతను కాపాడేలా ఏకీకృత పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు (ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్‌ప్లాంటు)ను ‘గ్రీన్‌కో’ చేపడుతోంది. దీని ద్వారా సౌర, పవన, హైడల్ విధానాల్లో 24 గంటలూ క్లీన్ విద్యుత్ అందుతుంది. కాలుష్య రహితంగా, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మిస్తున్న ‘గ్రీన్‌కోకు’ అభినందనలు. దేశానికి ఈ ప్రాజెక్టు దిక్సూచి కావాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
తక్కువ ధరకే అనువైన విద్యుత్తు..
ఈ ప్రాజెక్టు చాలా ప్రత్యేకమైనది. 3 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా 5,230 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరగనుంది. ఇందులో 1,680 మెగావాట్లు పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యం కాగా 3,000 మెగావాట్లు సౌర విద్యుత్తు, 550 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి కానుంది. తద్వారా తక్కువ ధరకే స్థిరమైన, అనువైన నిరంతర విద్యుత్ 24 గంటలు అందుతుంది. ఈ ప్రాజెక్టులో మరో ప్రత్యేకత క్లీన్ ఎనర్జీ.
తగ్గనున్న శిలాజ ఇంధనాల వినియోగం
ఈ ప్రాజెక్టులో పంప్డ్ స్టోరేజ్, పవన, సౌర విద్యుత్‌ల సముదాయం ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్‌ను డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో (నాన్‌పీక్ అవర్స్) సోలార్, విండ్ పవర్‌ను ఉపయోగించుకుని నీటిని రిజర్వాయర్‌లోకి పంప్ చేయవచ్చు. డిమాండ్ ఎక్కువగా (పీక్ అవర్స్) ఉన్నపుడు తిరిగి నీటిని వినియోగించుకుని విద్యుదుత్పత్తి చేసే అవకాశం ప్రాజెక్టులో ఉంది.
రోజంతా పునరుత్పాదక శక్తి కలిగి ఉండటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. రాష్ట్రంలో ఈ రోజు మనం చేపడుతున్న ఇంధన పునరుత్పాదక ప్రక్రియ భవిష్యత్తులో యావత్ దేశానికి మార్గదర్శకం కానుంది. విద్యుదుత్పత్తి రంగంలో శిలాజ ఇంధనాల వినియోగం పూర్తిగా తగ్గిపోయి పునరుత్పాదక శక్తి ఇంధన విభాగం ముందంజలో నిలవనుంది.
గ్రీన్ పవర్‌కు ప్రోత్సాహం
పర్యావరణ సమతుల్యత, కాలుష్య రహితం చాలా కీలకం. ఈ అంశాలకు ప్రాధాన్యమిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడేలా ‘గ్రీన్‌కో’ ప్రాజెక్టును చేపట్టింది. మనం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా గురించి మాట్లాడుకుంటున్నాం. ‘గ్రీన్ పవర్’ (పర్యావరణ హితంగా) విధానాలతో విద్యుదుత్పత్తి ఎలా చేయవచ్చో ఈ ప్రాజెక్టు యావత్ దేశానికి తెలియచేస్తోంది.
గ్రీన్‌పవర్ ఉత్పాదక సంస్థలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాయితీలు, ప్రోత్సాహకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తోంది. ఇక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా అందుకు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. మొత్తం 33 వేల మెగావాట్లకుపైగా విద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. మిట్టల్ కంపెనీ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి అవుతోంది. ఈ సంస్థ 250 మెగావాట్ల విద్యుత్‌లో 100 మెగావాట్లను పునరుత్పాదక శక్తితో ఉత్పత్తి చేస్తుంది. రానున్న రోజుల్లో ఇది ఒక వినూత్న ఒరవడికి దారి తీస్తుంది.
గ్రీన్‌కో సంస్థకు సీఎం అభినందన
ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు రావడంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును సాకారం చేస్తున్న గ్రీన్‌కో సంస్థ ఎండీ అనిల్, బృందానికి ప్రత్యేక అభినందనలు. ‘గ్రీన్‌కో’కు ఎలాంటి సహాయం, సహకారం అవసరమైనా రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తుంది.
పైలాన్ ఆవిష్కరణ
తొలుత ప్రాజెక్టు ప్రాంతం, పనులను పరిశీలించిన అనంతరం సీఎం జగన్ జాతీయజెండాను ఆవిష్కరించారు. ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రాజెక్టు నిర్మాణం, విద్యుదుత్పాదనను వివరిస్తూ రూపొందించిన త్రీడీ నమూనాను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, బాలనాగిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవికిషోర్‌రెడ్డి, ఆర్థర్, కంగాటి శ్రీదేవి, ఎమ్మెల్సీలు చల్లా భగీరథరెడ్డి, ఇషాక్‌బాషా, వెన్నపూస గోపాల్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కలెక్టర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇంధన భద్రత రాష్ట్రంగా ఏపీ
‘పునరుత్పాదక విద్యుత్ పరిష్కారాలను అందించాలన్న అంతర్జాతీయ లక్ష్యాల కంటే ముందుగానే ఆ దిశగా అడుగులు వేయడం ‘గ్రీన్‌కో’కు గర్వకారణం. ముందుచూపు కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం వల్లే ఇది సాధ్యమైంది.
దేశానికి ‘ఎనర్జీ స్టోరేజ్ క్యాపిటల్’గా ఏపీ నిలవనుంది. విస్తృత వ్యాపార అవకాశాలతోపాటు అపార వనరులు, నౌకాశ్రయాలు, భూములు, ఖనిజాలు పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు మన రాష్ట్రంలో ఉన్నాయి. 2023 నుంచి ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి’
– అనిల్ చలమలశెట్టి, ‘గ్రీన్‌కో’ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment