ఉదారంగా సాయం | CM Jagan meeting with Collectors and SPs and JCs on relief operations of heavy rains | Sakshi
Sakshi News home page

ఉదారంగా సాయం

Published Wed, Oct 21 2020 3:05 AM | Last Updated on Wed, Oct 21 2020 10:36 AM

CM Jagan meeting with Collectors and SPs and JCs on relief operations of heavy rains - Sakshi

పరిహారం పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి. నష్టపోయిన రైతుల పేర్లు రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలి. ఎవరైనా రైతులు తమ పేర్లు లేవని చెబితే సామాజిక తనిఖీ చేయాలి.    
– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: వరద బాధితులను ఆదుకోవడంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఈ విషయంలో కలెక్టర్లు, జేసీలు ఉదారంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పారు. కలెక్టర్లు పంట నష్టం అంచనాలను ఈ నెలాఖరు కల్లా పంపాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలు, సహాయ చర్యల అమలుపై ‘స్పందన’లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జారీ చేసిన ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

వెంటనే ఆదుకోవాలి 
► వరద పీడిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు (ముంపునకు గురైన ఇళ్లు) 25 కేజీల బియ్యం, ఒక కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో ఆలుగడ్డలు తప్పనిసరిగా పంపిణీ చేయాలి.
► సహాయ శిబిరాల్లో ఉన్న వారిని ఇళ్లకు పంపించేటప్పుడు రూ.500 చొప్పున ఇవ్వాలి. ఈ మొత్తం ఆ కుటుంబానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. వారు ఇంటికి వెళ్లగానే ఇబ్బంది ఉండదు.
► మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం వెంటనే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. ఇప్పటి వరకు 19 మంది చనిపోగా, 14 మందికి పరిహారం ఇచ్చారు. మిగతా 5 కుటుంబాలకు కూడా వెంటనే పరిహారం ఇవ్వాలి. 

31లోగా నష్టంపై నివేదికలు 
► పంట నష్టంపై పూర్తి స్థాయిలో అంచనాలు రూపొందించి ఈనెల 31వ తేదీలోగా కలెక్టర్లు నివేదికలు పంపాలి. అందులో బడ్జెట్‌ ప్రతిపాదనలు కూడా ఉండాలి. 
► ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి. ఈ–క్రాపింగ్‌ నమోదు ఆధారంగా సాగు చేస్తున్న రైతులను పక్కాగా గుర్తించాలి.
► వెంటనే రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేయండి. శానిటేషన్, శుభ్రమైన తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టండి.

సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ
► రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక సీజన్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే ఏడాదిలో ఇస్తున్నాం. ఈ ఏడాది ఖరీఫ్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని వైఎస్సార్‌ రైతు భరోసా రెండో విడత చెల్లింపులతో పాటు ఇవ్వబోతున్నాం. 
► అటవీ భూముల పట్టాలు (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) ఇచ్చిన గిరిజనులకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఈనెల 27న రూ.11,500 చొప్పున ఇవ్వబోతున్నాం.
► జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో దెబ్బతిన్న ఖరీఫ్‌ పంటలకు సంబంధించి రూ.113 కోట్లు, ఉద్యాన పంటలకు సంబంధించి రూ.32 కోట్లు, మొత్తం రూ.145 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఈ నెల 27న రైతులకు చెల్లించబోతున్నాం. అక్టోబర్‌ నెలలో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన ఇన్‌పుట్‌ సబ్సిడీపై నవంబర్‌ 15లోగా నివేదిక ఇవ్వాలి.
► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వర్షాలు, వరదలు తగ్గిన తర్వాత అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి కలెక్టర్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. శానిటేషన్, పరిశుభ్రమైన నీటి సరఫరాపై దృష్టి పెట్టాలి. పాముకాటుకు విరుగుడు ఇంజెక్షన్, కుక్క కరిస్తే ఇచ్చే ఇంజెక్షన్లతో సహా అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండాలి. అన్ని మందులు డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలు కలిగి ఉండాలి. 104 నంబరు కేవలం కోవిడ్‌కు మాత్రమే కాకుండా, ఇతర వైద్య సేవలు అందేలా ఉండాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement