
జాతీయస్థాయి అవార్డులు అందుకున్న వారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో 17 అవార్డులు పొందిన రాష్ట్రంలోని పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పురస్కారాలను ప్రదానం చేశారు. ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాగా పనితీరు కనబరిచిన పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నాలుగు కేటగిరీల్లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో అవార్డులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గతేడాది రాష్ట్రానికి 15 అవార్డులు రాగా.. ఈసారి 17 వచ్చాయి. అవార్డుల పరంగా ఏపీ జాతీయ స్థాయిలో నాలుగో స్థానం దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. దక్షిణ భారతదేశంలో ఏపీ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఈ–పంచాయత్ కేటగిరీలో రాష్ట్ర స్థాయి రెండో అవార్డుతోపాటు, జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 4, పంచాయతీ స్థాయిలో 10 జాతీయ అవార్డులు ఈసారి రాష్ట్రానికి దక్కాయి. జిల్లా స్థాయి అవార్డు కింద రూ.50 వేలు, మండల స్థాయి అవార్డు కింద రూ.25 వేలు, పంచాయతీ స్థాయిలో జనాభాను బట్టి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు నగదు బహుమతి అందించారు.
గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభం కావాలి: ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఆ తర్వాత కంప్యూటర్‌లో బటన్ నొక్కి అవార్డులు పొందిన పంచాయతీలు, మండలాలు, జిల్లాల ఖాతాల్లో నగదు బహుమతి జమ చేశారు. అలాగే మరో బటన్ నొక్కి 7 రాష్ట్రాల్లోని 5 వేల గ్రామాల్లో ప్రాపర్టీ కార్డుల జారీని కూడా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. కోవిడ్ కష్టకాలంలోనూ గ్రామ పంచాయతీలు గతేడాది నుంచి చాలా చక్కగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నందువల్ల పంచాయతీలు అదే స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు. కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభమవ్వాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు.
ఈ–పంచాయత్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పురస్కారంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, కమిషనర్ గిరిజా శంకర్
అవార్డులు ప్రదానం చేసిన సీఎం జగన్
అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ స్థాయి అవార్డులను ప్రదానం చేశారు. ఈ–పంచాయత్ కేటగిరీలో రాష్ట్రస్థాయి రెండో అవార్డును పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, జిల్లా స్థాయిలో.. గుంటూరు, కృష్ణా జిల్లాలు పొందిన అవార్డులు (దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారం) ఆ జిల్లాల జెడ్పీ సీఈవోలు డి.చైతన్య, పీఎస్ సూర్యప్రకాశరావు, మండలాల స్థాయిలో.. చిత్తూరు జిల్లా సొడెం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్, కృష్ణా జిల్లా విజయవాడ రూరల్, అనంతపురం జిల్లా పెనుకొండ ఎంపీడీవోలు అవార్డులు అందుకున్నారు. అలాగే పంచాయతీల స్థాయిలో.. కర్నూలు జిల్లా వర్కూరు, విశాఖపట్నం జిల్లా పెదలబూడు, గుంటూరు జిల్లా గుల్లపల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ కండ్రిగ, తాళ్లపాలెం, పార్థవెల్లంటి, పెన్నబర్తి, చిత్తూరు జిల్లా రేణిమాకులపల్లి, తూర్పుగోదావరి జిల్లా జి.రంగంపేట, ప్రకాశం జిల్లా కొడెపల్లి పంచాయతీలకు సీఎం పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ల్యాండ్ రికార్డ్స్ సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ సిద్దార్థజైన్‌తోపాటు వివిధ జిల్లాలు, మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment