
కాట్రేనికోన/సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై యడ్ల నవీన్ (7) అనే మూడో తరగతి విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో చిట్టిమేను వివేక్ (3వ తరగతి), తిరుపతి ఘన సతీష్‌కుమార్ (4వ తరగతి)లను అత్యవసర వైద్యం నిమిత్తం అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
స్వల్పంగా గాయపడిన మరో ఇద్దరు 3వ తరగతి విద్యార్థులు మొల్లేటి నిఖిల్, బొంతు మహీధరరెడ్డిలకు దొంతుకుర్రులోనే ప్రాథమిక వైద్యం అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పాఠశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న సచివాలయ భవనం శ్లాబ్ కోసం ఇనుప ఊచలను కట్ చేసేందుకు కటింగ్ మెషీన్ తీసుకొచ్చారు. దాని తీగ ఊచలకు తగలడం.. అదే సమయంలో విద్యార్థులు తాగునీటి కోసం ఆ ఇనుప ఊచలపై నుంచి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ఇక సతీష్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, జిల్లా ఏఎస్పీ కె.లతామాధురి పరామర్శించి, పరిస్థితిని సమీక్షించారు. మృతిచెందిన విద్యార్థి నవీన్ కుటుంబీకులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.
బాధితులకు అండగా ఉండండి : సీఎం
విద్యార్థులకు కరెంట్ షాక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన బాలుడి కుటుంబానికి శుక్రవారం ఆయన రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment