CM YS Jagan Review Meeting With Revenue Earning Departments at Tadepalli - Sakshi
Sakshi News home page

ప్రొఫెషనలిజం ద్వారా ఆదాయాలు పెంచండి.. రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై సమీక్షలో సీఎం జగన్

Published Fri, Jun 10 2022 11:40 AM | Last Updated on Fri, Jun 10 2022 6:59 PM

CM Jagan Review Meeting With Revenue  Earning Departments in Tadepalli - Sakshi

(ఫైల్‌ఫొటో)

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై శుక్రవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి.. పలువురు  మంత్రులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన రెవెన్యూ ఎర్నింగ్‌ శాఖలపై రివ్యూ మీటింగ్‌లో.. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్, రవాణా, భూగర్భగనులు, అటవీ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌. అదే సమయంలో ఆదేశాలు, కీలక సూచనలతో పాటు ప్రొఫెషనలిజం ద్వారా ఆదాయాలు పెంచుకోవాలని అధికారులకు సూచించారాయన.  

ఓటీఎస్‌ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తిచేయాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
► టిడ్కోకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్లను పూర్తిచేయాలి.
గ్రామ, వార్డు సచివాలయాల్లోకి రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చాక.. సిబ్బందికి, ఆపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
► ఎలాంటి సేవలు పొందవచ్చు అనే దానిపైనా అవగాహన కల్పించాలి.
కేవలం ఆస్తుల రిజిస్ట్రేషనే కాకుండా..  రిజిస్ట్రేషన్‌ పరంగా అందించే ఇతర సేవలపైన కూడా పూర్తిస్థాయి సమాచారం, అవగాహన కల్పించాలి.
రిజిస్ట్రేషన్‌ ప్రక్రియతో న్యాయపరంగా ఎలాంటి హక్కులు వస్తాయి, ఎలాంటి భద్రత వస్తుందన్న విషయాలను తెలియజేయాలి.
 అక్టోబరు 2న తొలివిడతగా.. గ్రామాల్లో శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలతో పాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలి అని సీఎం జగన్‌ ఆదేశించారు. 

ఈ సందర్భంగా అధికారులు.. ఇప్పటికే 650 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు, ఈ గ్రామాల సంఖ్యను పెంచడానికి చర్యలు చేపట్టినట్లు అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. అంతేకాదు.. 14వేలమంది గ్రామ, వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్‌పై శిక్షణ కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో.. రిజిస్ట్రేషన్‌ సేవలు, భూ హక్కు–భూ రక్ష కింద పత్రాలు అందించే గ్రామాల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించాలని సీఎం జగన్‌, అధికారులకు సూచించారు.

వెదురు పెంపకాన్ని ప్రోత్సహించండి: సీఎం జగన్‌
వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. అలాగే..  మైనర్‌ మినరల్‌కు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించని క్వారీలు 2,700కుపైగా ఉన్నాయని,  కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని, తద్వారానే ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతాయని సీఎం జగన్‌ చెప్పారు. 

ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. జెన్‌కో సహా.. రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు దీని నుంచి బొగ్గు సరఫరా అయ్యేలా చూసుకోవాలని,  దీనివల్ల జెన్‌కో ఆధ్వర్యంలోని విద్యుత్‌ ప్రాజెక్టులకు మేలు జరుగుతుందన్న సీఎం జగన్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా.. ఈ బొగ్గును మన అవసరాలకు వినియోగించుకునేలా చూడాలని సీఎం జగన్‌ అధికారులతో చెప్పారు.  దీనిపై కార్యాచరణ రూపొందించి తనకు నివేదించాలన్న సీఎం జగన్‌, తదుపరి కూడా బొగ్గుగనుల వేలం ప్రక్రియలో పాల్గొనడంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు.

సమీక్షలో వాణిజ్య పన్నుల శాఖ పునర్‌నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్‌. శాఖలో ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యతలపై స్పష్టతతో పాటు డాటా అనలిటిక్స్‌ విభాగం, లీగల్‌సెల్‌ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే.. బకాయిల వసూలుకు ఓటీఎస్‌ సదుపాయం కల్పించనున్నారు. జూన్‌కల్లా వాణిజ్య పన్నుల శాఖలో ఈ విభాగాల ఏర్పాటు జరగనుంది. వీటితో పాటు అక్రమ మద్యం తయారీ, అక్రమ మద్యం రవాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జగన్‌. 

ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్‌ శాఖ) కె నారాయణ స్వామి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇంధన,అటవీ పర్యావరణ, భూగర్భగనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, అటవీ పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్సు ఎన్‌ ప్రతీప్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement