కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కొత్తగా మరో 1,49,875 మందికి సామాజిక పెన్షన్లు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వచ్చే నెల నుంచి వీరికి పెన్షన్లు అందుతాయని చెప్పారు. అలాగే కొత్తగా 2,00,312 బియ్యం కార్డులు మంజూరు చేశామని, వీరికి వచ్చే నెల నుంచి రేషన్ అందుతుందన్నారు. 4,327 మందికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయడంతో పాటు మరో 12,069 మందికి ఇళ్ల స్థలాలను కూడా ఇస్తున్నామని తెలిపారు. 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని 2,62,169 మంది అర్హులకు లబ్ధి చేకూరుస్తూ గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు ఇవ్వకుండా.. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా.. మనకు ఓటు వేయకపోయిన ఫర్వాలేదు, అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికీ కచ్చితంగా లబ్ధి కలిగించాలని తాపత్రయ పడుతూ అడుగులు ముందుకు వేస్తున్న ప్రభుత్వం మనదని చెప్పారు. అర్హత ఉన్నప్పటికీ ఏ కారణం వల్ల అయినా లబ్ధి కలుగకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మేలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అధికారం అంటే అజమాయిషీ చేయడం కాదని, ప్రజల పట్ల మమకారం చూపడమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
కొత్తగా పింఛన్, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు
► ఈ ఆరు నెలల్లో కొత్తగా పింఛన్, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా కొత్తగా దరఖాస్తు పెట్టుకుంటే.. వెరిఫికేషన్ చేసి మంజూరు చేస్తున్నాం. ఇందులో భాగంగా 1,49,875 మందికి కొత్తగా పెన్షన్‌లు ఇవ్వడంతో.. రాష్ట్రంలో మొత్తం పెన్షన్ల సంఖ్య దాదాపు 64.27 లక్షలకు చేరుకుంది.
► గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు అంటే 2018 అక్టోబర్ వరకు కేవలం 39 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇవాళ ఆ సంఖ్య 64.27 లక్షలకు పెరిగింది. అప్పట్లో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అంటే 4 సంవత్సరాల పది నెలల కాలంలో కేవలం రూ.1,000 పింఛన్ మాత్రమే ఇస్తున్న పరిస్థితి. ఇవాళ రూ.2,750 ఇస్తున్నాం.
► ఇప్పుడు కొత్తగా మంజూరు చేసిన 2,00,312 కార్డులతో కలుపుకుంటే.. మొత్తం 1,48,12,934 బియ్యం కార్డులు ఉన్నాయి. అదే విధంగా కొత్తగా మంజూరు చేస్తున్న 4,327 ఆరోగ్యశ్రీ కార్డులతో కలుపుకుంటే.. మొత్తం వాటి సంఖ్య 1,42,15,820కు చేరింది. ఈ రోజు మంజూరు చేస్తున్న ఇళ్ల పట్టాలు 12,069 కలుపుకుంటే.. మొత్తంగా వాటి సంఖ్య 30,84,935కు చేరింది.
జగన్ మళ్లీ సీఎం కావాల్సిందే
రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని సీఎం జగన్ అనుక్షణం పరితపిస్తున్నారు. ఎక్కడా రూపాయి లంచం లేకుండా శాచురేషన్ మోడ్‌లో పథకాలు అందిస్తున్నారు. మేం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లినప్పుడు ప్రజల్లో జగన్ పట్ల నమ్మకం స్పష్టంగా కనిపించింది. మా మనవడు మాకు మేలు చేస్తున్నారని అవ్వాతాతలు, మా మామ సాయం చేస్తున్నారని చిన్నారులు, మా అన్న వల్ల మేం బాగుపడుతున్నామని అక్కచెల్లెమ్మలు సంతోషంగా చెప్పడం స్వయంగా విన్నాం. ఈ రాష్ట్రానికి జగన్ మళ్లీ సీఎం కావాల్సిందేనని, అప్పుడే ఆనందంగా ఉంటామని ప్రజలు చెబుతున్నారు.
– బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం
పేదల కళ్లలో ఆనందం
పారదర్శకత, కుల మతాలకు.. ప్రాంతాలకు అతీతంగా అర్హులందరికీ లబ్ధి కల్పించడం, జవాబుదారీతనం ప్రతి దశలోనూ కనిపిస్తోంది. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగింది. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా రూ.2.33 లక్షల కోట్లు సాయం చేయడం దేశంలోనే రికార్డు. గత ప్రభుత్వాలు ఎన్నడూ ఇలా చేయలేదు. ఏ పథకాలు ఎవరికి ఇచ్చారో తెలియని పరిస్థితి. ఇప్పుడు అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూరుస్తున్నారు. ప్రతి పేదవాడి కళ్లలో సంతోషం కనిపిస్తోంది. ఇది ప్రతిపక్షాలకు కంటగింపుగా మారింది.
– ఆదిమూలపు సురేష్, మంత్రి
వివిధ పథకాల కింద 2.62 లక్షల మందికి లబ్ధి
► జగనన్న చేదోడు కార్యక్రమం ద్వారా 43,170 మందికి మళ్లీ లబ్ధి కలిగిస్తున్నాం. 207 మందికి వైఎస్సార్ మత్స్యకార భరోసా అందిస్తున్నాం. 1,08,000 మంది రైతులకు సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తున్నాం. జగనన్న విద్యా దీవెన సొమ్మును మరో 32,770 మంది తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం.
► జగనన్న వసతి దీవెన ద్వారా 36,898 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. 8,753 మందికి వైఎస్సార్ ఈబీసీ నేస్తం, 267 మందికి వైఎస్సార్ నేతన్న నేస్తం, 16,717 మందికి జగనన్న అమ్మఒడి.. ఇలా మొత్తంగా 2.62 లక్షల మందికి వివిధ పథకాలను అందిస్తున్నాం.
94,62,184 మందికి సర్టిఫికెట్లు
► రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రతి ఇంటికీ వెళ్లి.. జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. వివిధ పథకాలకు అర్హులైన వారెవరూ మిగిలిపోకూడదన్న తపనతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా 94,62,184 మందికి వివిధ సర్టిఫికెట్లు ఇచ్చాం.
► ఇలా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు 12,405 మంది అర్హులై ఉండి.. వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన వారికి కూడా లబ్ధి చేకూరుస్తున్నాం. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా.. కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన 1,630 మంది కూడా అర్హులని తేలడంతో వారికి కూడా మంచి చేస్తున్నాం.
మళ్లీ మిమ్మల్నే గెలిపించుకుంటాం
నమస్తే సార్.. నేను చేనేత కార్మికుడిని. గతంలో కూలి మగ్గం నేసేవాడిని. ఇప్పుడు సొంత మగ్గం నేస్తున్నాను. గత జూలైలో నేతన్న నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకుని, వెరిఫికేషన్ సమయంలో లేకపోవడంతో రాలేదు. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు అప్రూవ్ అయ్యి డబ్బులు రావడంతో సంతోషంగా ఉంది. ఈ డబ్బుతో పనితనం మరింత మెరుగు పరుచుకుంటాను. మీ వల్ల సొంతింటి కల నెరవేరింది. ఇతర పథకాలు కూడా అందుతున్నాయి. స్కూళ్ల స్వరూపం పూర్తిగా మార్చేశారు. సచివాలయంలోనే అన్ని పనులు జరుగుతున్నాయి. మళ్లీ మిమ్మల్నే గెలిపించుకుంటాం.
– నాగశేషు, ధర్మవరం, శ్రీ సత్యసాయి జిల్లా
ఇలాంటి పాలన చూడలేదు
అన్నా.. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మ ఒడి మూడో విడత రాలేదు. ఎందుకు రాలేదని బాధ పడుతుండగా, వలంటీర్ వచ్చి మీ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ కాలేదన్నారు. లింక్ చేసి వలంటీర్‌కు చెప్పాక అమ్మ ఒడి వచ్చింది. గతంలో ఏదైనా పథకం కోసం మేం ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవాళ్లం. ఇప్పుడు గడప దగ్గరకే అన్నీ వస్తున్నాయి. మా పాలిట మీరు దేవుడు అన్నా. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిపాలన చూడలేదు.
– కళ్యాణి, భీమిలి మండలం, విశాఖపట్నం జిల్లా
డైనమిక్ లీడర్ అంటే మీరే..
అన్నా నమస్కారం.. నేను 15 ఏళ్లుగా టైలరింగ్ వృత్తిలో ఉన్నాను. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల రెండోసారి చేదోడు పథకం కింద లబ్దిపొందలేక పోయాను. తిరిగి దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు మంజూరైంది. మా ఇద్దరు పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించలేకపోయాననే బాధ గతంలో ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ను మార్చారు. ఇంత మార్పు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. అందరూ లీడర్స్ అవుతారు కానీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయే డైనమిక్ లీడర్ మీరే అన్నా..
– నాగరాజ, తిమ్మాయపాలెం, అద్దంకి మండలం, బాపట్ల జిల్లా
Comments
Please login to add a commentAdd a comment