AP: సామాజిక అధికారం | CM Jagan Stands For Social Justice Over AP Cabinet Reshuffle | Sakshi
Sakshi News home page

AP: సామాజిక అధికారం

Published Sat, Apr 9 2022 4:34 AM | Last Updated on Sat, Apr 9 2022 11:44 AM

CM Jagan Stands For Social Justice Over AP Cabinet Reshuffle - Sakshi

సాక్షి, అమరావతి : సామాజిక న్యాయం అంటే ఎలా ఉంటుందో రాష్ట్రంలో దాదాపు మూడేళ్లుగా సాగుతున్న పాలన స్పష్టం చేస్తోంది. పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించినప్పుడే.. సంక్షేమాభివృద్ధి పథకాల ఫలాలు ఆ వర్గాల్లో అట్టడుగున ఉన్న నిరుపేదలకు చేరుతాయన్నది సీఎం వైఎస్‌ జగన్‌ నమ్మకం. అప్పుడే వారు పురోభివృద్ధిలోకి వస్తారని.. ఇది సమసమాజ స్థాపనకు దోహదం చేస్తుందన్నది ఆయన విశ్వాసం.

ఇందుకోసం అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే  నడుం బిగించారు. మంత్రివర్గం ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 60 శాతం పదవులు ఇస్తూ తొలి అడుగులోనే సరి కొత్త సామాజిక రాజకీయ విప్లవాన్ని సృష్టించారు. 34 నెలల్లో ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌లు, మండల పరిషత్‌ చైర్మన్‌లు, కార్పొరేషన్‌ మేయర్‌లు, మున్సిపల్‌ చైర్మన్‌ పదవులనూ సింహ భాగం ఆ వర్గాలకే కేటాయిస్తూ ఎప్పటికప్పుడు సామాజిక న్యాయానికి సరి కొత్త నిర్వచనం ఇచ్చారు. నామినేటెడ్‌ పదవుల్లోనూ 50 శాతం ఆ వర్గాలకు రిజర్వ్‌ చేస్తూ చట్టం చేశారు.

అందులోనూ సరిగ్గా సగం... అంటే 50 శాతం మహిళలకు రిజర్వ్‌ చేస్తూ మరో చట్టం తీసుకొచ్చారు. వాటిని నిక్కచ్చిగా అమలు చేసి సామాజిక న్యాయమంటే ఇదేనని దేశానికి చాటి చెబుతున్నారని వివిధ రంగాల్లోని ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. తాజాగా మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించడాన్ని అభినందిస్తున్నారు. 

నాడు మాటల్లో..
– రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో జనసేన, బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ.. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చింది. టీడీపీకి బీసీలే వెన్నెముక అని చెప్పే చంద్రబాబు.. అది ఓట్ల కోసమేనని అనేక సార్లు బయటపడిపోయారు.
– 2014 జూన్‌ 8న చంద్రబాబు తొలిసారిగా 19 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేస్తే.. అందులో కేవలం ఇద్దరు ఎస్సీలు, ఆరుగురు బీసీలకు స్థానం కల్పించారు. ఏకంగా 11 స్థానాలను అగ్రవర్ణాలకు ఇచ్చారు. అధికారం నుంచి దిగిపోయే వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల వారికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు.
– ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అని ఎస్సీలను.. సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకోవడానికి వచ్చిన నాయి బ్రాహ్మణులను తోలుతీస్తానంటూ బెదిరించిన చంద్రబాబు.. సామాజిక న్యాయం పట్ల తనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందన్నది తానే బహిర్గతం చేసుకున్నారు.

నేడు చేతల్లో..
– దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు (86 శాతం), 22 లోక్‌సభ స్థానాల (88 శాతం)ను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుని ఆఖండ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. 
– ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 60 శాతం మంత్రి పదవులు ఇస్తూ 2019 జూన్‌ 8న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే కేటాయించారు. హోం శాఖ మంత్రిగా తొలిసారి ఎస్సీ మహిళను నియమించారు.  
– అత్యంత కీలకమైన హోం, రెవెన్యూ, జల వనరులు, విద్య, రహదారులు భవనాలు వంటి కీలక శాఖలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించి, వారికి పరిపాలనలో ప్రాధాన భాగస్వామ్యం కల్పించారు. 
– శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను నియమించారు. శాసనమండలి చైర్మన్‌గా  రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్‌ రాజును, వైస్‌ చైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళ జకియా ఖానంను నియమించారు.

ఇదీ సామాజిక న్యాయమంటే
– శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి 32 మంది సభ్యులు ఉంటే.. అందులో 18 మంది (56.25) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే.
– వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభలో వైఎస్సార్‌సీపీకి నాలుగు స్థానాలు దక్కితే.. అందులో రెండింటిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారు. 
– జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఆఖండ విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్‌లనూ క్వీన్‌ స్వీప్‌ చేసింది. 13 జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవుల్లో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. 
– మండల పరిషత్‌ ఎన్నికల్లో.. 648 మండలాలకు గాను వైఎస్సార్‌సీపీ 635 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను దక్కించుకుంటే.. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 67 శాతం పదవులను కేటాయించారు.
– 13 కార్పొరేషన్‌లలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఏడు చోట్ల మేయర్‌ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్‌ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే.. వాటి చైర్‌పర్సన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు.

నామినేటెడ్‌ పదవుల్లోనూ అగ్రాసనం
– రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చారు.
– వివిధ ప్రభుత్వ కార్పొరేషన్‌లలో 137 చైర్మన్‌ పదవుల్లో 53 (39 శాతం) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్‌లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్‌లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.   
– 137 కార్పొరేషన్‌లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్‌ పదవుల్లో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం డైరెక్టర్‌ పదవులు ఇచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్‌లు, మూడు ఎస్సీ కార్పొరేషన్‌లు, ఒక ఎస్టీ కార్పొరేషన్‌లలో 684 డైరెక్టర్‌ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement