అంతరాలను సరిదిద్దుదాం | CM Jagan started distribution of tabs to students at Bapatla district | Sakshi
Sakshi News home page

అంతరాలను సరిదిద్దుదాం

Published Thu, Dec 22 2022 3:17 AM | Last Updated on Thu, Dec 22 2022 7:48 AM

CM Jagan started distribution of tabs to students at Bapatla district - Sakshi

బాపట్ల జిల్లా యడ్లపల్లిలో ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లో సీఎం జగన్‌తో సెల్ఫీ దిగుతున్న విద్యార్థినులు

నేను ఈ రోజు.. నా పుట్టినరోజు గురించి కాదు.. ఈ తరం బిడ్డల గురించి మాట్లాడుతున్నా. ఈ తరంలో పుట్టిన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మాట్లాడుతున్నా. మంచి మేనమామగా, ఆ తల్లులకు ఒక మంచి అన్నగా భావి తరాన్ని ఉన్నత చదువులతో తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నా.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, నరసరావుపేట: తరాలు మారుతున్నా కొన్ని వర్గాల తలరాతలు మాత్రం మారకూడదన్న పెత్తందారుల సంకుచిత ధోరణులను బద్ధలుకొడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ చదువులు, డిజిటల్‌ విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ‘పేదింటి పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదవకూడదని ఆ వర్గం వారు కోర్టులకు వెళ్లారు. డిజిటల్‌ విద్యా బోధన తమ పిల్లలకు మినహా పేదలకు అందకూడదని పెత్తందారీ మనోభావాలున్నవారు ఆరాట పడుతున్నారు.

ఇలాంటి వారిని చూసినప్పుడు బాధేసినా మూడున్నరేళ్లుగా ఎక్కడా ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. పెత్తందారుల  కుట్రలను భగ్నం చేయడానికి చిట్టి పిల్లలకు మంచి మేనమామగా, తల్లులకు మంచి అన్నయ్యగా నేను ఉన్నానని హామీ ఇస్తున్నా’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. బుధవారం బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించి మాట్లాడారు. ఆ వివరాలివీ..
బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో సభకు భారీ ఎత్తున హాజరైన విద్యార్థులు, ప్రజలు 

ఆర్థిక అసమానతలకు చదువులే విరుగుడు
ఆర్థిక అభివృద్ధి, తలసరి ఆదాయాల్లో ప్రపంచ దేశాల మధ్య వ్యత్యాసాలున్నట్లే వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల మధ్య అంతరాలున్నాయి. ధనిక దేశాలైన అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాల్లో సగటు తలసరి ఆదాయం రూ.30 లక్షల నుంచి రూ.80 లక్షలు ఉంటుంది. మన దేశంలో తలసరి ఆదాయం రూ.1.65 లక్షలకు అ­టూ ఇటుగా ఉంటుంది.

మన రాష్ట్రంలో దాదాపు రూ.2.50 లక్షలు ఉంటుంది.లక్ష డాలర్లు సంపాదిస్తున్న ఆ దేశాలు ఎక్కడ? మనం ఎక్కడ? స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఇదీ పరిస్థితి. ఇలాంటి అంతరాలు ఈ రోజు దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్నాయి. వీటన్నింటినీ మనం ఒకేసారి సరిదిద్దలేకపోవచ్చు. ఆర్థిక సమా­నత్వం లేకపోవడానికి ఎన్ని కారణాలున్నా చదువు­ల్లో సమానత్వం తీసుకురాగలిగితే ప్రతి వర్గం, ప్రతి కుటుంబం అభివృద్ధి ఫలాలను అందుకుంటుంది. మంచి చదు­వులు వారి తలరాతలను రాబోయే రోజుల్లో మారుస్తాయి.

ఈ అంతరాలు ఇంకానా...?
మన చుట్టూ ఉన్న మనుషుల్ని చూసినప్పుడు... ఒక కుటుంబాన్ని గమనిస్తే చదువుకోని అన్న – చదువుకున్న తమ్ముడు, చదువుకోలేని అక్క – చదువుకున్న తమ్ముడు మధ్య వ్యత్యాసం వారి జీవితాల్లో తేడా చూపుతుంది. ఇంగ్లీషు మీడియం చదువులను కూడా పరిగణలోకి తీసుకుంటే మరింత తేడా కనిపిస్తుంది. బాగా చదువుకునే అవకాశం.. అందులోనూ ఇంగ్లీష్‌ మీడియం చదువులు మన పిల్లలకు దొరకడంతో వారి తలరాత మార్చే కార్యక్రమం జరుగుతోంది.

మన సమాజంలో కొందరు 21వ శతాబ్దంలో ఉండగా మరికొందరు 19వ శతాబ్దంలోనే బతికే పరిస్థితిలో ఉన్నారు. వీరు ఇలానే జీవించాలా? వీరి బతుకులు మార్చలేమా? అనే ప్రశ్నలే నా ప్రతి అడుగులో, మనసులో కనిపిస్తాయి. సామాజిక అంతరాలను కొనసాగించే విద్యా విధానం, అధికారంలో వాటా ఇవ్వని గత రాజకీయ విధానాలను ఇకపైనా కొనసాగించాల్సిందేనా? అన్న ప్రశ్నకు ఆలోచన పెరగాలి. ఈ వివక్ష ఇంకా కొనసాగాల్సిందేనా? అన్నది ఒక్కసారి అంతా గుండెపై చేయి వేసుకుని ఆలోచన చేయాలి.
ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభించి ప్రసంగిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 

పలకల నుంచి ట్యాబ్‌ల దిశగా..
పలక, బలపం చదువులతోనే కొన్ని కులాల విద్యాభ్యాసం ముగిసిపోతుండగా కొన్ని వర్గాలకు మాత్రమే ట్యాబ్‌లు, డిజిటల్‌ విద్య, ఇంగ్లిష్‌ మీడియం అందుబాటులో ఉన్న సమాజాన్ని మనం ఆమోదించవచ్చా? అన్నది అంతా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఇవాళ రాజకీయ వ్యవస్థలో నెలకొంది. ఈ వ్యవస్థను పూర్తిగా మార్చే తిరుగుబాటులో మీవాడిగా, మీలో ఒకడిగా, మీ బిడ్డగా, మీ మేనమామగా, ప్రతి తల్లికీ అన్నగా నేనున్నానని, తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా.

ఈరోజు రూ.686 కోట్లతో 5,18,740 ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని నా దళిత సోదరుడి నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నా. 9,703 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ 2024–25లో ఇంగ్లిష్‌ మీడియంలో సీబీఎస్‌ఈ విధానంలో టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే 4,59,564 మంది విద్యార్థులతో పాటు 59,176 మంది ఉపాధ్యాయులకు కూడా ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నాం. వారం రోజుల పాటు ప్రతి స్కూల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 
తరగతి గదిలో విద్యార్థులతో సీఎం జగన్‌ 

రేపటి పౌరులకు నేటి అవసరాన్ని తీర్చేలా..
ఇక మీదట ప్రతి ఏటా 8వ తరగతిలోకి వచ్చే ప్రతి బాబు, పాపకు ట్యాబ్‌లు ఇస్తూ వెళతాం.  ఇవన్నీ మల్టీ లింగ్యువల్‌ ట్యాబ్‌లు. బాగా అర్థం కావడానికి ఇంగ్లిష్, తెలుగులోనూ పాఠ్యాంశాలు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ట్యాబ్‌లు అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా పాఠాలు అర్థం అయ్యేలా దోహ­దపడతాయి. రేపటి పౌరుల నేటి అవసరమే ఈ ట్యాబ్‌లు. ట్యాబ్‌లోనే బైజూస్‌ కంటెంట్‌ లభిస్తుంది. క్లాస్‌ టీచర్‌ చెప్పే పాఠాలు మరింత సులభంగా అర్థం చేసుకునేలా ట్యాబ్‌ ఉపయోగపడుతుంది.  టెక్నాలజీ ఎనేబుల్డ్‌ లెర్నింగ్‌లో భాగంగా శ్యాంసంగ్‌ ట్యాబ్‌లు ఇస్తున్నాం. సెక్యూర్డ్‌ డిజిటల్‌ కార్డు కూడా వీటిల్లో ఉంటుంది.

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లోనూ పాఠాలు...
ఇంటర్నెట్‌ లేకపోయినా ఆఫ్‌లైన్‌ లో ట్యాబ్‌లు ద్వారా పాఠాలు వినే అవకాశం ఉంది. ఆన్‌లై­న్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ సబ్జెక్టులు నేర్చుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏమిటంటే వీటికి మూడేళ్ల వారెంటీ ఉంది.  బైజూస్‌ కంటెంట్‌ను 4 నుంచి 10వ తరగతి పిల్లలందరి­కీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. 

టెక్నాలజీతో మంచి మాత్రమే జరిగేలా... 
టెక్నాలజీ వల్ల పిల్లలకు మంచి జరగాలి కానీ చెడు జరగకూడదు. ఇదే ఆలోచనతో ట్యాబ్‌లో సెక్యూర్డ్‌ మొబైల్‌ డివైజ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎండీఎం) సాఫ్ట్‌వేర్‌ పొందుపరిచారు. దీనివల్ల ట్యాబ్‌ల్లో పాఠాలు, బోధనకు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లల­కు నష్టం కలిగించే కంటెంట్‌ను మీ మేనమామ కత్తి­రిస్తు­న్నాడు. తల్లిదండ్రులకు ఎలాంటి భయాలు ఉండకూడ­దు. పిల్లలు ఏం చూశారు? ఏం చదివారు? అన్నది తల్లి­దండ్రులు, టీచర్లకు సాఫ్ట్‌వేర్‌ ద్వారా తెలుస్తుంది కాబట్టి ట్యాబ్‌లు దుర్వినియోగం అయ్యే అవకాశాలు లేవు. 


ఒక్కో విద్యార్థికి రూ.32 వేల లబ్ధి..
ఈరోజు పిల్లల చేతుల్లో పెట్టే ట్యాబ్‌ మార్కెట్‌ విలువ రూ.16,500 ఉంటుంది. బైజూస్‌ కంటెంట్‌ను ఎవరైనా శ్రీమంతుల పిల్లలు డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకుంటే ఏకంగా రూ.15,500 చెల్లించాలి. ఇలా 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్, బైజూస్‌ కంటెంట్‌ను బయట కొనుగోలు చేయాలంటే రూ.32 వేలు ఖర్చవుతుంది. మేనమామగా పిల్లల చదువుల కోసం రూ.32 వేలు చొప్పున వ్యయం చేస్తూ మంచి చదువులు అందుబాటులోకి తెచ్చాం.

ఇక్కడ బైజూస్‌ సంస్థను కూడా ప్రశంసించాలి. కార్పొరేట్‌ సామాజిక బాధ్య­తగా రూ.15,500 విలువైన కంటెంట్‌ను రాష్ట్ర ప్రభు­త్వానికి ఉచితంగా అందించినందుకు బైజూ­స్‌కు కృతజ్ఞతలు. 5,18,740 ట్యాబ్‌ల ఖర్చు రూ.688 కోట్లు కాగా ఇందులో లోడ్‌ చేస్తున్న కంటెంట్‌ విలువ మరో రూ.778 కోట్లు ఉంటుంది. మొత్తంగా రూ.1,466 కోట్ల మేర పిల్లలకు లబ్ధి చేకూరుతోంది.

డిజిటల్‌ క్లాస్‌ రూములు..
ఒకవైపు 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీతో పాటు మరోవైపు స్కూళ్లలో డిజిటల్‌ క్లాసురూమ్‌ల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. నాడు – నేడు దశలవారీగా అమలయ్యే కొద్దీ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి క్లాసులో, ప్రతి సెక్షన్‌లో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ) అంటే డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటు చేస్తాం.నాడు – నేడు మొదటిదశ పనులు పూర్తైన 15,715 స్కూళ్లల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ల ఏర్పాటు వచ్చే జూన్‌ కల్లా పూర్తవుతుంది.

సమూల మార్పులు...
► స్కూళ్లు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యా కానుక కిట్‌. స్కూల్‌ బ్యాగుతో పాటు ద్విబాషా పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్, షూస్, 3 జతల యూనిఫాం, సాక్స్, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ పంపిణీ. గత సర్కారు హయాంలో పాఠ్యపుస్తకాలు సైతం ఇవ్వలేని దుస్థితి. 
► 3వ తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్స్‌. 
► నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్పు. ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ విధానం, డిజిటల్‌ క్లాస్‌ రూములు, ట్యాబ్‌లు, బైజూస్‌ కంటెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, గోరుముద్దతో సహా అనేక పథకాలు అమలు.
► మూడేళ్లలో అమ్మఒడి ద్వారా రూ.19,617 కోట్లు వ్యయం. 44,48,865 మంది తల్లులకు, 80 లక్షల మంది పిల్లలకు పథకంతో లబ్ధి. 
► రూ.9,051 కోట్లతో విద్యాదీవెన ద్వారా 24,74,544 మంది పిల్లలకు ప్రయోజనం.
► వసతి దీవెన కింద మరో రూ.3,349 కోట్లతో 18,77,863 మంది పిల్లలకు మేలు. 
► గోరుముద్ద పథకానికి ఇప్పటివరకూ రూ.3,239 కోట్లు వ్యయం. 43,26,782 మంది పిల్లలకు రోజుకో రకమైన మెనూతో పౌష్టికాహారం.
► విద్యాకానుక కిట్ల కోసం రూ.2,368 కోట్ల వ్యయం. 47,40,420 మంది పిల్లలకు ప్రయోజనం. 
► వైఎస్సార్‌ సంపూర్ణ పోషణం కింద రూ.4,895 కోట్ల వ్యయంతో 35,70,675 మందికి లబ్ధి. 
► మనబడి నాడు నేడు ద్వారా తొలిదశలో రూ.3,669 కోట్లతో 15,715 స్కూళ్ల రూపురేఖలు సమూలంగా మార్పు. రెండో దశలో మరో రూ.8 వేల కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు. 
ట్యాబ్‌ల పంపిణీ అనంతరం విద్యార్థులతో సీఎం జగన్‌. చిత్రంలో ప్రజాప్రతినిధులు, ఇతరులు 

► ‘‘అందరికీ సమానమైన నైపుణ్యం ఉండకపోవచ్చు. కానీ అందరికీ సమాన అవకాశాలు దొరికితీరాలి. అది కల్పించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం’’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీ చెప్పిన మాటలను సీఎం జగన్‌ గుర్తు చేశారు.
► ‘‘నా పుట్టిన రోజు నాడు నాకెంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం చేస్తున్న మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవటాన్ని దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. పిల్లలు బాగుండాలని, తమకన్నా బాగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, ప్రతి తల్లిదండ్రీ మనసారా కోరుకుంటారు. అలా కోరుకునే అనేక హృదయాలు రకరకాల కారణాల వల్ల.. కులం, ఆర్థిక స్థోమత కారణంగా సరిగా చదివించుకోలేకపోతున్నామని భావించినప్పుడు వారి మనసులు తల్లడిల్లటాన్ని నేను స్వయంగా చూశా’’
► ‘‘నా ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు రాజకీయ ప్రయాణంలో ప్రతి సందర్భంలోనూ తల్లులు, తండ్రులు పడుతున్న బాధలు చూశా. బతుకులు మారాలంటే తలరాతలు మారాలి. ఆ తలరాతలు మారాలంటే చదువు అనే ఒకే ఒక్క ఆస్తి ద్వారానే మారుతుంది’’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement