ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి సీఎం అండ | CM Jagan support to the frontline staff in this covid times | Sakshi
Sakshi News home page

ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి సీఎం అండ

Published Sun, Jun 6 2021 5:35 AM | Last Updated on Sun, Jun 6 2021 3:39 PM

CM Jagan support to the frontline staff in this covid times - Sakshi

‘వైద్యులు, వైద్య సిబ్బంది విపత్తు సమయంలో చేస్తున్న సేవలను ఈ ప్రభుత్వం మరచిపోదు. కరోనా కష్టకాలంలో ధైర్యంగా ప్రజలకు సేవలందిస్తున్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు ఎప్పుడూ అండగా ఉంటుంది’ అని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలను ఆచరణలో నిలుపుకొన్నారు. 

సాక్షి, అమరావతి: ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా వారి సేవలను మెచ్చుకోవడంతోనే సరిపెట్టుకోకుండా, కష్టం వచ్చిన సందర్భంలో ఎంత ఖర్చుకైనా వెనుకాడమని నిరూపించారు. ప్రకాశం జిల్లా కారంచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా పనిచేస్తూ కోవిడ్‌ బారిన పడ్డ డా.ఎన్‌.భాస్కర్‌రావు వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇతని ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బ తిన్నాయని, వైద్య ఖర్చులకు కోటిన్నర రూపాయల వ్యయం అవుతుందని అంచనా. దీంతో తక్షణం సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ.50 లక్షలు మంజూరు చేశారు. మిగతా మొత్తాన్ని ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. డా.ఎన్‌.భాస్కర్‌రావుకు ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స కొనసాగుతోంది. 

రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం
ఒక పీహెచ్‌సీలో పని చేస్తున్న డాక్టర్‌ వైద్యానికి రూ.కోటిన్నర వ్యయం చేస్తామని సీఎం ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కష్టకాలంలో సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి సీఎం జగన్‌ భరోసా ఇచ్చారని పలు వర్గాలు అభినందిస్తున్నాయి. శనివారం జరిగిన మీడియా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖలో కోవిడ్‌ బారిన పడిన సిబ్బంది ఎవరికైనా వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. దీంతో వైద్యులతో పాటు వైద్యేతర సిబ్బంది కూడా ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, కరోనా సమయంలో ఆరోగ్య సిబ్బంది పట్ల ఇంత శ్రద్ధ తీసుకోవడం ద్వారా తమపై మరింత బాధ్యత పెరిగిందని పలువురు అభినందిస్తున్నారు.


ఇది గొప్ప నిర్ణయం
ఒక వైద్యుడికి వైద్యం చేయాలంటే కోటిన్నర అవుతుందంటే దాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం గొప్ప విషయం. గతంలో ఏ సీఎం  ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆరోగ్య శాఖ సిబ్బంది పట్ల సీఎంకి ఉన్న చిత్తశుద్ధి ఏంటన్నది దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇందుకు వైద్యుల సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– డా.జయధీర్, ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్‌ 

మా బాధ్యత మరింత పెరిగింది
కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు చేస్తున్న నిరంతర పోరాటానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నుదన్నుగా నిలిచారు. కారంచేడు వైద్యుడికి చేసిన సాయం వల్ల మాలో భరోసా పెరిగింది. వైద్యులకు గుండె నిబ్బరం కలిగేలా సీఎం నిర్ణయం ఉంది. మా బాధ్యత పెరిగింది. 
– డా.పిడకాల శ్యాంసుందర్, ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement