CM Jagan Workshop On Gadapa Gadapaku Mana Prabhutvam - Sakshi
Sakshi News home page

ప్రతిష్ఠాత్మక కార్యక్రమం.. ఎవరూ అలక్ష్యం చేయొద్దు: సీఎం జగన్‌

Published Fri, Dec 16 2022 5:55 AM | Last Updated on Fri, Dec 16 2022 5:27 PM

CM Jagan Work Shop On Gadapa Gadapaki Mana Prabhutvam - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల జరిగిన మేలును ప్రజలకు వివరించి.. ఆశీస్సులు కోరేందుకు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 32 మంది ఎమ్మెల్యేలు తక్కువ రోజులు పాల్గొన్నారని, రానున్న రోజుల్లో వారు మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం సూచించారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఎవరూ అలక్ష్యం చేయొద్దు. మార్చి నాటికి పూర్తిస్థాయి నివేదికలు తెప్పిస్తానని సీఎం అన్నారు.

సీఎం జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

సచివాలయాల పరిధిలో పార్టీ కన్వీనర్లుగా సమర్థులైన వారే ఉంటారు:
నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న కార్యకర్తలను సచివాలయ కన్వీనర్లుగా నియమించడం జరుగుతుంది. ఆ తర్వాత గృహ సారథుల నియామకం జరుగుతుంది. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమిస్తాం. జనవరిలో ఆసరా మూడో దఫా చెల్లింపు జరగబోతున్నది. రూ.6500 కోట్లు ఇవ్వబోతున్నాం. దానికి సంబంధించి ఇంటింటా ప్రచారం చేస్తూ, వారికి లేఖలు అందిస్తాం. ఆ తర్వాత గృహ సారథుల నియామకానికి సంబంధించి మరో దఫా వెరిఫికేషన్‌ ఉంటుంది.

ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే:
సచివాలయాల కన్వీనర్లుగా ఎమ్మెల్యేలకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చు. వారు సమర్థులై ఉండాలి. వారికి తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ ఉండి తీరాలి. అయితే ఎక్కడా వలంటీర్లు గృహసారథులుగా ఉండకూడదు. అలాగే వారు ఆ 50 ఇళ్లకు సంబంధించిన వారై ఉండాలి.

తప్పనిసరిగా పర్యటించాలి:
డిసెంబర్‌ 21 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యేల ద్వారా ట్యాబ్‌ల పంపిణీ మొదలవుతుంది. పగలు ఆ కార్యక్రమం చేసి, సాయంత్రం గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. అలాగే 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ. ఇక్కడ కూడా వారం రోజుల పాటు ఎమ్మెల్యేలు ఏదో ఒక మండలంలో పర్యటించాలి. సాయంత్రం గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్దేశించిన విధంగా జరగాలి. ప్రతి సచివాలయ పరిధిలో కనీసం రెండు రోజులు.. రోజుకు కనీసం 6 గంటల పాటు తిరగాలి. అలా తిరగని ఎమ్మెల్యేలు.. మరోసారి ఆయా సచివాలయాలు సందర్శించాలి. ప్రతి ఇంటికి వెళ్లాలి. ప్రతి ఇంట్లో కనిసం 5 నిమిషాలు గడిపి, వారికి ప్రభుత్వం వల్ల కలిగిన ప్రయోజనాలు వివరించాలి. 

ప్రతి ఇంటికి వెళ్లాలి:
ఒక వేళ ఒక గ్రామంలో రెండు రోజుల్లో మొత్తం తిరగలేమనుకుంటే, మూడు, నాలుగు రోజుల టైమ్‌ తీసుకొండి. కానీ ప్రతి ఇంటికి వెళ్లండి. ఎక్కడా తొందరపడకూడదు. మొక్కుబడిగా పని చేయొద్దు. ఒక ఊరు తీసుకుంటే కచ్చితంగా పూర్తి చేయండి. లేకపోతే మీరు తమ ఇంటికి రాలేదని, వారు వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంది. వారు మనకు ఓటేయరని తెలిసినా, మీరు పోవడం మానకండి. ఎందుకంటే వారికి ఎంత మంచి చే«శామన్నది మన దగ్గర రికార్డులు ఉన్నాయి. వాటిని చిరునవ్వుతో వివరిస్తే, వారి మనస్సు మారొచ్చు. కాబట్టి ప్రతి గ్రామానికి వెళ్లండి. ప్రతి ఇల్లు సందర్శించండి.

పనుల్లో రాజీ వద్దు:
అలాగే గ్రామాల్లో అత్యధిక ప్రభావం చూపే (హై ఇంప్యాక్ట్‌ వర్క్‌) పనులనే గుర్తించండి. ఎక్కడా స్వప్రయోజనాలు ఆశించకండి. ఎవరినో సంతోషపర్చాలని కూడా ఆలోచించొద్దు. ఆ పనుల కోసం ప్రతి సచివాలయానికి కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. అందువల్ల మీరు పనుల ప్రాధాన్యతను గుర్తించి, అక్కడికక్కడే ప్రతిపాదనలతో అప్‌లోడ్‌ చేస్తే, వెంటనే ఆమోదించడం జరుగుతుంది.

మీరంతా మళ్లీ గెలవాలి:
ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మీ మీద నాకు ప్రేమ ఎక్కువ. మీలో ఎవ్వర్నీ పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. మీ అందరినీ మళ్లీ చట్టసభలో చూడాలి. అదే నా కోరిక. మనం మన బాధ్యత సక్రమంగా నెరవేర్చకపోతే, కోట్ల మంది నష్టపోతారు. ఇవాళ రాష్ట్రంలో కులాల మధ్య కాదు.. క్లాస్‌ల మధ్య యుద్ధం జరుగుతోంది. పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోంది. ప్రతి పేదవాడికి ప్రతినిధి ఎవరంటే మనమే. మనం నష్టపోతే పేదవారు నష్టపోతారు.

మనం పొరపాటున కూడా అధికారంలోకి రాకపోతే, రాష్ట్రంలో ఉన్న ఏ పేదవాడికి కూడా న్యాయం జరగదు. మోసంతో కూడిన రాజకీయాలు. ప్రజలను ఉపయోగించుకుని వదిలేసే రాజకీయాలు. వెన్నుపోటు రాజకీయాలు. అబద్ధాల రాజకీయాలు. ప్రజల మీద ప్రేమ లేని రాజకీయాలు. పేదవాడి మీద అస్సలు ప్రేమ లేని రాజకీయాలు. ఇవీ రాజకీయాలు. అలాంటి రాజకీయాలు వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ ధ్యాస పెట్టండి. ప్రతి ఇంట్లో కనీసం రెండు, మూడు నిమిషాలు గడపండి. మీరు ఆ ఇంటికి కేటాయించే సమయం, మీకు ఎంతో మేలు చేస్తుంది. మీ నియోజకవర్గంలో ప్రతి ఇంటిని మీకు చేరువ చేస్తుంది. 

ఎన్నికలకు ఇంకా 16 నెలలే..
మనకు ఎన్నికలకు ఇంకా 16 నెలల టైమ్‌ మాత్రమే ఉంది. కాబట్టి, ప్రతి ఇంట్లో కనీసం 5 నిమిషాలు గడిపి, ఆ ఇంటికి చేసిన మంచిని వివరించి, వారి ఆశీర్వాదం కోరండి. అప్పుడే వారి నుంచి మనకు సానుభూతి లభిస్తుంది. ఎందుకంటే, ఎన్నికల ముందు మీకు అంత సమయం ఉండదు. అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఎందుకు చేస్తున్నామనేది దయచేసి ఆలోచన చేయండి.

మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే, మనం ప్రజా సేవకులం. అధికారం మన చేతిలో ఉన్నప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది.. మనం అధికారం చలాయించడం కోసం కాదు మనం ఎమ్మెల్యేలుగా ఉండేది. మంత్రులుగా ఉండేది. నేను సీఎంగా ఉండేది. అందుకే ఎదిగేకొద్దీ ఒదగాలి. ఈ అధికారం ఉండేకొద్దీ మనం ఇంకా ఎక్కువ ఒదగాలి. అప్పుడే ప్రజల నుంచి ఇంకా స్పందన లభిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించకపోతే, నష్టపోతాం. అందుకే ప్రతి ఇంట్లో మనం వారితో కనీసం 5 నిమిషాలు గడిపితే, ప్రజల మద్దతు మనకు దక్కుతుంది. మనల్ని ఆదరిస్తారని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

రూ.828 కోట్ల విలువైన పనులు:
గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన అత్యంత ప్రాధాన్యత కలిగిన పనుల (హై ఇంప్యాక్ట్‌ వర్క్స్‌–హెచ్‌ఐడబ్ల్యూ స్‌)కు సంబంధించి చూస్తే.. 23,808 పనులకు సంబంధించి రూ.930.28 కోట్ల పనుల ప్రతిపాదనలు రాగా, వాటిలో 21,275 పనులకు అనుమతి ఇచ్చారు. ఆ పనుల విలువ రూ.828.45 కోట్లు. వాటిలో 17,905 పనులు మొదలు కాగా, ఆ విలువ రూ.662.14 కోట్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement