దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టాలకు వేదికగా ‘మేమంతా’ సిద్ధం బస్సు యాత్ర
ఐదేళ్లు తమకు కాపు కాచిన సీఎం జగన్‌కు ఊరూరా.. అడుగడుగునా జనం నీరాజనం
జననేతను చూసేందుకు.. కరచాలనం.. మాట కలిపేందుకు.. ఫొటోల కోసం ఆరాటం
మండుటెండల్లోనూ గంటల తరబడి రోడ్డుపై జననేత కోసం ఓపిగ్గా నిరీక్షణ
చంటి బిడ్డలను చంకనేసుకుని బస్సు వెంట పరుగులు తీస్తున్న తల్లులు
కిలోమీటరు పరిధిలోనే ఐదారు సార్లు బస్సు దిగి ఆత్మీయంగా పలకరిస్తున్న సీఎం జగన్
షెడ్యూలు సమయం కంటే రెండుమూడు గంటలు ఆలస్యంగా సాగుతున్న యాత్ర
మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకూ ప్రజలతో మమేకం
అర్ధరాత్రయినా ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమాన జనసంద్రం
రామగోపాల్ ఆలమూరు – సాక్షి, అమరావతి : ఏప్రిల్ ఒకటో తేదీ మధ్యాహ్నం 12 గంటలు... శ్రీసత్యసాయి జిల్లా బత్తపల్లి మండల కేంద్రానికి సమీపంలో అనంతపురం–కదిరి రోడ్డుపై సీఎం జగన్ బస్సు యాత్ర సాగుతోంది. పొలంలో వేరుశెనగ తొలగిస్తున్న మహిళలు మండుటెండలో పరుగులు తీస్తూ రావటాన్ని గమనించిన సీఎం జగన్ బస్సు ఆపి కిందకు దిగారు. ‘అక్కా బాగున్నారా... పథకాలు అన్నీ అందుతున్నాయా? ఏమైనా ఇబ్బందులున్నాయా?’ అంటూ ఆత్మీయంగా పలకరించారు.
‘అన్ని పథకాలు అందుతున్నాయి.. సంతోషంగా ఉన్నాం.. మళ్లీ నువ్వే రావాలి జగనన్నా’ అంటూ మహిళలు ముక్తకంఠంతో సీఎం జగన్‌ను దీవించారు. ‘మీరు ఇచ్చిన స్ప్రింక్లర్ల వల్ల, ఆసరా, చేయూత, రైతు భరోసా ద్వారా అందించిన ఆర్థిక సాయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేరుశెనగ సాగు చేశాం.. మంచి దిగుబడి వచ్చింది.. ఇదిగో పండిన వేరుశెనగ కాయలు’ అంటూ నాగేంద్రమ్మ అనే మహిళ విరగకాసిన వేరుశెనగ చెట్లను సీఎం జగన్‌కు ఆప్యాయంగా అందించింది. వాటిని సీఎం జగన్ సంతోషంగా తీసుకోవడంతో మురిసిపోయింది.
ఏప్రిల్ మూడో తేదీ.. ఉదయం 11.45 గంటలు.. చిత్తూరు జిల్లా సదుం మండలం మతకువారిపల్లెకు సీఎం జగన్ చేసుకునేసరికి రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. అందరినీ పలకరిస్తూ.. అభివాదం చేస్తూ ముందుకు సాగుతుండగా ‘జగనన్నా.. జగనన్నా’ అంటూ ఓ మహిళ ఏడుస్తూ బిగ్గరగా పిలిచింది. అది చూసి బస్సు ఆపి కిందకు దిగిన సీఎం జగన్ ఆమె వద్దకు చేరుకుని ఏమైంది తల్లీ అంటూ పలుకరించారు.
‘అన్నా.. నా కొడుకు ముఖేష్ పక్షవాతంతో బాధపడుతున్నాడు.. వైద్యానికి రూ.15 లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు.. నువ్వే నా బిడ్డను రక్షించాలి...’ అంటూ రోదిస్తున్న ఆ మహిళ కన్నీళ్లను తుడిచిన సీఎం జగన్.. ‘తల్లీ నేనున్నా.. నీ బిడ్డకు ఎంత ఖర్చనా వైద్యం చేయిస్తా. బాధపడొద్దు తల్లీ’ అంటూ భరోసా ఇచ్చారు. తన ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ హరికృష్ణకు ఆ బాధ్యతలు అప్పగించారు. జగనన్న ఇచ్చిన భరోసాతో ఆ తల్లి గుండె కుదుటపడింది.
ఏప్రిల్ మూడో తేదీ సాయంత్రం 4 గంటలు.. చిత్తూరు జిల్లా కల్లూరులో సీఎం జగన్ రోడ్ షో సందర్భంగా ఓ వ్యక్తి బిడ్డను భుజాన ఎత్తుకుని బస్సు వెంట పరుగులు తీస్తున్నాడు. ఆ చిన్నారి ‘జగన్ మామా.. జగన్ మామా’ అంటూ బిగ్గరగా పిలుస్తోంది. అది చూసిన సీఎం జగన్ బస్సు ఆపి డోర్ తీసి నిలబడ్డారు. సీఎం జగన్ వద్దకు చేరుకున్న ఆ చిన్నారి... మామా అంటూ ముద్దు పెట్టి మురిసిపోయింది. చిన్నారిని అక్కున చేర్చుకున్న సీఎం జగన్.. ‘బాగా చదువుకో తల్లీ’ అంటూ దీవించడంతో పట్టలేని ఆనందంతో కేరింతలు కొట్టింది.
ఏప్రిల్ నాలుగో తేదీ.. మధ్యాహ్నం 12.30 గంటలు.. తిరుపతి జిల్లా ఏర్పేడులో రోడ్ షో ముగించుకుని ముందుకెళ్తున్న సీఎం జగన్ బస్సు వెంట ఓ యువకుడు రొప్పుతూ పరుగెత్తుతున్నాడు.. చెప్పులు తెగిపోవడంతో వాటిని వదిలేసి కాళ్లు కాలిపోతున్నా లెక్క చేయకుండా ఒక్క ఫోటో ప్లీజ్ జగనన్నా అంటూ పరుగులు తీస్తూ వస్తున్నాడు. ఇది గమనించిన సీఎం జగన్ బస్సు ఆపి ఆ యువకుడిని దగ్గరకు పిలవడంతో సెల్ఫీ తీసుకుని జై జగన్ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.
ఏప్రిల్ నాలుగో తేదీ.. మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి జిల్లా చిన్న సింగమలలో టాక్సీ, ఆటో డ్రైవర్‌లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ‘జగనన్నా.. శ్రీకాళహస్తిలో ఏడేళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నా. నాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. నాకు ముగ్గురు పిల్లలు.. మీరు ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇద్దరు పిల్లలను నర్సింగ్, ఒకరిని బీటెక్ చదివించుకోగలుగుతున్నా.
నాలాంటి పేదల బతుకులు గొప్పగా మారాలంటే మళ్లీ నువ్వే రావాలి జగనన్నా.. నిన్నే తెచ్చుకుంటాం జగనన్నా’ అంటూ జ్యోతి అనే టాక్సీ డ్రైవర్ ఆనందంగా చెప్పింది. తనకు సొంత ఆటో లేదని, రుణం సమకూర్చి ఆటో కొనివ్వాలని జ్యోతి కోరడంతో ‘అక్కా.. బ్యాంకులతో టైఅప్ ద్వారా నీలాంటి వారికి పావలా వడ్డీకే రుణం ఇప్పించి సొంత ఆటో, టాక్సీ కొనిచ్చే ఏర్పాటు చేస్తాం’ అంటూ సీఎం భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యాల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. బస్సు యాత్రలో అడుగడుగునా ఇలాంటి ఆత్మీయ దృశ్యాలే సాక్షాత్కారిస్తున్నాయి. అందుకే బస్సు యాత్రను ఆత్మీయానుబంధాల సంగమంగా అభివర్ణిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారానికి శ్రీకారం చుడుతూ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని మహానేత వైఎస్సార్ ఘాట్ వద్ద నుంచి సీఎం జగన్ గత నెల 27న ప్రారంభించిన బస్సు యాత్ర రాయలసీమ (వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి) జిల్లాల్లో పూర్తి చేసుకుని నెల్లూరు జిల్లాకు చేరుకుంది. శనివారం నెల్లూరు జిల్లాలో బస్సు యాత్రను సీఎం జగన్ కొనసాగించనున్నారు.
రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టమిది
సీఎం జగన్‌కు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతుండటంతో బస్సు యాత్ర రోజూ షెడ్యూలు సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా సాగుతోంది. సూరీడు నిప్పులు చిమ్ముతుండటంతో ఎండలు మండిపోతున్నా.. వడగాలులు ఇబ్బంది పెడుతున్నా.. రాత్రి పొద్దుపోయినా ప్రజలు లెక్క చేయకుండా సీఎం జగన్‌ను చూసేందుకు గంటల కొద్దీ రోడ్డుపై నిరీక్షిస్తున్నారు. తమ వద్దకు సీఎం జగన్ చేరుకోగానే ఆ అలసటను మరచిపోయి సంతోషంగా స్వాగతం పలుకుతున్నారు. సీఎం జగన్ ఆత్మీయ పలకరింపులతో జనం పులకించిపోతున్నారు.
‘అవ్వాతాతా బాగున్నారా.. అక్కాచెల్లెమ్మా బాగున్నారా.. అన్నా బాగున్నారా’ అంటూ పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. వైద్యపరంగా ఏవైనా సమస్యలుంటే వెంటనే సహాయం అందిస్తానని భరోసా ఇస్తూ అక్కడికక్కడే తన సహాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. చిన్నారులను ఎత్తుకుని.. నుదిటిపై ముద్దులు పెడుతూ ఆశీర్వదిస్తుండటంతో సంబరపడుతున్నారు. రాజకీయాల్లో ఓ నాయకుడికి, ప్రజలకు మధ్య ఇలాంటి ఆత్మీయ అనుబంధాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకే సీఎం జగన్ బస్సు యాత్ర రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
విశ్వసనీయతను చాటుకోవడం వల్లే
ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా వైఎస్ జగన్ అనుక్షణం ప్రజల పక్షానే నిలబడ్డారు. ఇచ్చిన మాటపై నిలబడి నిబద్ధతతో, నిజాయితీతో పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. కరోనా కష్టకాలంలోనూ ఏ ఒక్క పథకాన్ని నిలుపుదల చేయలేదు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి రాష్ట్రాన్ని ప్రగతిపథాన నిలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి పరిపాలనను వికేంద్రీకరించి ఇంటి గుమ్మం వద్దే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు.
సుపరిపాలనతో ప్రతి ఇంట్లో.. ప్రతి గ్రామంలో.. ప్రతి నియోజకవర్గంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఐదేళ్లు తమకు కాపు కాచిన సీఎం జగన్ కోసం జనం ఆరాటపడుతున్నారు. తమ కోసం నిలబడ్డ నాయకుడిని కళ్లారా చూసేందుకు పరితపిస్తున్నారు. రాష్ట్రం, తమ భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలంటే జగనే మళ్లీ సీఎం కావాలని నినదిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అందరికీ మంచి చేసిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం బలంగా నాటుకుపోయింది. బస్సు యాత్ర పొడవునా ఆత్మీయానుబంధాలను చాటిచెప్పే దృశ్యాలే దానికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎన్నికలకు ముందే కనిపిస్తున్న ప్రభంజనం..
బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు జనం పోటెత్తుతున్నారు. రాత్రి పొద్దుపోయినా పెద్ద ఎత్తున కదిలిస్తున్నారు. వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రాత్రి పొద్దుపోయాక దువ్వూరు, చాగలమర్రి, ఆలూరు, ఆస్పరి, అనంతపురం బైపాస్ తపోవనం, రాప్తాడు, కదిరి, సోమల, చంద్రగిరి క్రాస్, చావలిలో నిర్వహించిన రోడ్‌షోలకు ఇసుకేస్తే రాలనంత స్థాయిలో జనం కిక్కిరిసిపోయారు. మా నమ్మకం నువ్వే జగన్.. జగనన్నే మా భవిష్యత్తు అనే నినాదాలతో బస్సు యాత్ర మారుమోగుతోంది. యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, మదనపల్లె, పూతలపట్టు, నాయుడుపేటలో నిర్వహించిన సభలు జనసంద్రాలను తలపించాయి.
పేదింటి భవిష్యత్తు.. రాష్ట్ర భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా..? అంటూ సీఎం జగన్ పిలుపునివ్వడంతో సెల్‌ఫోన్‌లో టార్చ్‌లైట్ వెలిగించి చేతులు పైకెత్తి మేమంతా సిద్ధం అంటూ జనం నినదిస్తుండటంతో సభా ప్రాంగణం ఆకాశంలో చుక్కలను తలపించింది. వీటిని పరిశీలిస్తే సిద్ధం సభలతోపాటు పోటీపడుతూ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు నీరాజనాలు పలుకుతున్నట్లు స్పష్టమవుతోంది. బస్సు యాత్రను చూస్తుంటే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని తేలిపోయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మానవత్వపు పరిమళాలు..
బస్సు యాత్ర సాగుతున్న రోడ్డుకు ఇరువైపులా చిన్నారులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నారు. పాలనకు మానవీయతను జోడించి సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ తమ వద్దకు చేరుకోగానే బంతిపూల వర్షం కురిపిస్తూ ఆత్మీయ స్వాగతం పలుకుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అక్కచెల్లెమ్మలు సొంత అన్న తమ కోసం వచ్చినట్లుగా భావిస్తూ హారతులు ఇచ్చి నీరాజనాలు పలుకుతున్నారు. అవ్వాతాతలు సీఎం జగన్‌ను సొంత మనవడిలా భావిస్తూ దీవిస్తున్నారు. అన్నదమ్ములైతే జగన్నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
సీఎం జగన్‌ను దగ్గరగా చూడాలని.. కరచాలనం చేయాలని.. మాట కలపాలని.. చిన్నారుల దగ్గర నుంచి అవ్వాతాతల వరకూ ఆరాటపడుతున్నారు. సీఎం జగన్ వారిని అక్కున చేర్చుకుని యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆత్మీయంగా పలకరించడంతో ఆనందపరవశులవుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరుతుండటంతో సీఎం జగన్ కిలోమీటర్ పరిధిలోనే నాలుగైదు సార్లు బస్సు దిగి అందరినీ పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. మధ్యాహ్నం భోజనం సైతం చేయకుండా ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకూ ప్రజలతో మమేకం అవుతూ ప్రజల మధ్యే గడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment