సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలు, విధానాలు అంతర్జాతీయ సంస్థల అధిపతుల ప్రశంసలు అందుకుంటున్నాయి. పరిశ్రమ ఏర్పాటుకు దరఖాస్తు నుంచి పరిశ్రమ ప్రారంభోత్సవం వరకు పారిశ్రామికవేత్తలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండదండగా నిలుస్తోంది. వేగంగా అన్ని అనుమతులూ ఇస్తోంది. దీంతో రాష్ట్రంలో శరవేగంతో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. జర్మనీకి చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ కూడా సీఎం వైఎస్ జగన్ విధానాలకు ప్రశంసలందించారు.
ఈ సంస్థ విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీకి రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్ ఏర్పాటు చేస్తోంది. రూ.4,640 కోట్లతో చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద 800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ యూనిట్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనుంది. ఈ యూనిట్ ద్వారా 8,100 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లకు ఉపాధి లభిస్తుంది. పెప్పెర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే పెప్పర్ మోషన్ యూనిట్ వివరాలను వివరించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ బస్సులు ట్రక్కుల క్లస్టర్ ఏర్పాటుకు వేగంగా అనుమతులు మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో సీఎం వైఎస్ జగన్ విధానాలను కొనియాడారు. ఏడాదికి 30,000 విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సామర్ధ్యంతో ఇక్కడి యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ వర్టికల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, 20 జీడబ్ల్యూహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీల తయారీ, అంతర్జాతీయ ప్రమాణాలతో యూనిట్ ఏర్పాటు, డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఏపీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి దేశాల్లోని పెప్పర్ భాగస్వాములకు కూడా ఇక్కడి నుంచే సేవలు అందిస్తామని చెప్పారు. మూడు దశల్లో ఏర్పాటు చేసే ఈ యూనిట్ తొలి దశ 2025 మూడో త్రైమాసికానికి అందుబాటులోకి వస్తుందన్నారు. 2027 మూడో త్రైమాసికానికి మూడో దశలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఏపీలో గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్ విండో అనుమతులు, అమలు చేస్తున్న పారదర్శక విధానాలను సీఎం జగన్ పెప్పర్ మోషన్ ప్రతిని«దులకు వివరించారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెప్పర్ మోషన్ సీటీవో డాక్టర్ మథియాస్ కెర్లర్, ఫైనాన్స్ డైరెక్టర్ ఉవే స్టెల్టర్, సీఐవో రాజశేఖర్‌రెడ్డి నల్లపరెడ్డి, సీఎస్‌వో సత్య బులుసు, సీసీవో రవిశంకర్, అసోసియేట్ శ్రీధర్ కిలారు, ఉర్త్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ హర్ష ఆద్య పాల్గొన్నారు.
సీఎం విజనరీ థింకింగ్ మమ్మల్ని ఆకట్టుకుంది: ఆండ్రియాస్ హేగర్
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజనరీ థింకింగ్, అమలు చేస్తున్న పాలసీలు తమను ఆకట్టుకున్నాయని, ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మరువలేమంటూ పెప్పర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ కొనియాడారు. సీఎంను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఏపీలో వరల్డ్ క్లాస్ యూనిట్ ఏర్పాటు చేయడంపై చాలా సంతోషంగా ఉన్నాం.
అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మా యూనిట్ ఏర్పాటుచేస్తున్నాం. ప్రజా రవాణాకు అవసరమైన విధంగా డీకార్బొనైజ్డ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ తీసుకువచ్చేలా మా యూనిట్ నుంచి వాహనాల ఉత్పత్తి జరుగుతుంది. ఏపీలో యూనిట్ ఏర్పాటు చేయడం సరైన నిర్ణయంగా భావిస్తున్నాం. బెంగళూరు, చెన్నై నగరాలకు దగ్గరగా మా యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నాం. మాకు సహాయ సహకారాలు అందించిన సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment