![CM Jagans Vision Is The Compass Of AP Progress Industrialists - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/4/ys-jagan.jpg.webp?itok=ho6j6JZs)
(గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 ’ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): దేశీయ, అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలు అంతా ఒకే వేదికపైకి వచ్చిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. అంతకుమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికత, కార్యదక్షతకు నిదర్శనంగా నిలిచింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, సరళతర వాణిజ్య విధానాలు ఎంతటి సత్ఫలితాలను అందిస్తున్నాయో ప్రపంచానికి చాటి చెప్పింది. సదస్సులో తొలి రోజు శుక్రవారం దాదాపు 20 మంది పారిశ్రామికవేత్తలు ప్రసంగించారు.
సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌లో సృష్టించిన పారిశ్రామిక అనుకూల వాతావరణం గురించి దిగ్గజ పారిశ్రామికవేత్తలు ప్రముఖంగా ప్రస్తావించారు. సీఎం వైఎస్ జగన్ యువ నాయకత్వం, దార్శనికతతోనే వృద్ధి రేటు, సులభతర వాణిజ్యంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కొనియాడటం విశేషం. దక్షిణ భారత దేశంలో నిర్వహించిన ఓ పెట్టుబడుల సదస్సుకు ఆయన హాజరుకావడం ఇదే తొలిసారి. పారిశ్రామికాభివృద్ధిపట్ల సీఎం జగన్ స్పష్టమైన దృక్పథానికి ఆకర్షితుడయ్యే ఆయన ఈ సదస్సుకు హాజరయ్యారు.
సహజ వనరులు, భౌగోళిక అనుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకత అని ఆదానీ పోర్ట్ – సెజ్ సీఈవో కరణ్ అదానీ చెప్పారు. దేశంలోనే రెండో అతిపెద్ద తీరరేఖ కలిగిన ఏపీలో పోర్టుల అభివృద్ధికి జగన్ ప్రణాళికలు ఇందుకు నిదర్శనమన్నారు. పారిశ్రామిక విధానం, పరిశ్రమల అనుకూల ఎకోసిస్టమ్ కల్పించేందుకు సమర్థంగా అమలు చేస్తున్న సింగిల్ విండో పాలసీ గురించి జేఎస్‌పీఎల్ గ్రూప్ చైర్మన్ నవీన్ జిందాల్ ప్రధానంగా ప్రస్తావించారు. సీఎం జగన్ దార్శనిక విధానాల ఫలితంగానే తమ గ్రూప్ ఏపీలో రూ.10 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే అగ్రగామిగా నిలిపి సీఎం జగన్ ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చారన్నారు.
సమర్థ నాయకుడు
సంక్షోభం తలెత్తినప్పుడు సమర్థంగా వ్యవహరించడమే నాయకత్వ లక్షణమని కియా మోటార్స్‌కు చెందిన కబ్ డాంగ్‌లీ చెప్పారు. అలాంటి నాయకుడు జగన్ అని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులు, ముడి సరుకును సురక్షితంగా తరలించడానికి సీఎం జగన్ సత్వరం సహకారం అందించడం ఇందుకు తార్కాణమన్నారు. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధే ఆర్థికాభివృద్ధికి చోదక శక్తి అనే వాస్తవాన్ని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి కొనియాడారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, వైద్య–ఆరోగ్య రంగాలపై ఏపీ ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తుండటం దేశానికే ఆదర్శమన్నారు.
గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎంవోయూల పేరుతో చేసిన కనికట్టు అందరికీ తెలిసిందే. ఛోటామోటా నేతలకు సూట్లు వేసి మరీ ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు ప్రజల్ని మోసం చేశారు. అందుకే చంద్రబాబు ప్రభుత్వంలో చేసుకున్న ఎంవోయూలలో 10 శాతం కూడా కార్యరూపం దాల్చలేదు. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరిస్తూ పరిశ్రమల ఏర్పాటును స్వయంగా పర్యవేక్షిస్తుండటం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదే విషయాన్ని కెనాఫ్ సంస్థ సీఈవో సుమిత్ బిదానీ జీఐఎస్ సభా వేదిక మీదే చెప్పారు. 40 మిలియన్ డాలర్ల ప్రాథమిక పెట్టుబడితో దేశంలోనే అతి పెద్ద ప్లాంట్‌ను తాము ఏర్పాటు చేయడం కేవలం సీఎం జగన్ సహకారంతోనే సాధ్యమైందని ఆయన అన్నారు. ఒప్పందం జరిగిన 18 నెలల్లోనే ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఇంతటి పారిశ్రామిక అనుకూలత అరుదు
సీఎం జగన్ నిబద్ధత గురించి జపాన్‌కు చెందిన టోరే ఇండస్ట్రీస్ ఎండీ మసహిరో యమగుచి చెప్పిన విషయం అబ్బురపరిచింది. శ్రీ సిటీలో రూ.200 కోట్లతో తాము త్వరగా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం 132 కేవీ విద్యుత్ లైన్‌ను ప్రత్యేకంగా వేయడాన్ని ఆయన ఉదహరించారు. ఇంతటి పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం ఉండటం చాలా అరుదని వ్యాఖ్యానించారు.
సంప్రదాయేతర ఇంధన వనరులకు సీఎం జగన్ పెద్దపీట వేస్తుండటం ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ పారిశ్రామిక పరిణామాలపై ఆయనకున్న ముందు చూపునకు నిదర్శనమని టెస్లా కంపెనీ కో ఫౌండర్ మార్టిన్ ఎబర్‌హార్డ్ తెలిపారు. శ్రీ సిమెంట్ చైర్మన్ హరిమోహన్ బంగర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిమెంట్ రంగంలో తాము ఈ కారణంగానే ఏపీలో పెట్టుబడులు పెడుతున్నామన్నాఉ. ఇప్పటికే రూ.3,000 కోట్లతో గుంటూరులో తాము ఏర్పాటు చేస్తున్న దేశంలోనే మొదటి గ్రీన్ సిమెంట్ ప్లాంట్ పనులు నడుస్తున్నాయని, త్వరలో మరో రూ.5,000 కోట్లు పెట్టుబడులతో 5 వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు.
అపారమైన సహజ వనరులు.. నైపుణ్యమైన మానవ వనరులు అభివృద్ధికి మూలం. కీలకమైన ఆ రెండింటినీ గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసుకునే సమర్థ నాయకత్వం ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో అటువంటి సమర్థ నాయకత్వం లభించిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలవడం ఖాయం. వైఎస్ జగన్ దార్శనికతే ఏపీ ప్రగతికి దిక్సూచి.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 వేదికపై దిగ్గజ పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయమిది.
సీఎం జగన్‌ను చూసి గర్వపడుతున్నా..
పరిశ్రమల ఏర్పాటుకు సీఎం జగన్ ఎంత వేగంగా స్పందిస్తారో చెబుతూ సెంచురీ ప్లై చైర్మన్ సజ్జన్ భజాంకా చెప్పిన ఉదాహరణ ఆకట్టుకుంది. ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలి, అందుకోసం నోడల్ ఆఫీసర్ల నియామకంతోపాటు మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ఏఏ మోడల్స్ ఉత్పత్తి చేయాలి తదితర అంశాలన్నీ ఒక్క సమావేశంలోనే కొలిక్కి వచ్చేశాయన్నారు. తాను పుట్టిన నేలకు దేశ, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలను తెచ్చిన సీఎం జగన్‌ను చూసి గర్విస్తున్నానని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు చెప్పారు. జె ఫర్ జగన్ కాస్త జె ఫర్ జోష్‌గా మారిందని దాల్మియా భారత్ గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment