వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, తిరుపతి: వరద ముంపు బాధితులకు తక్షణ ఆర్థిక సాయంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, వరదలకు గురైన వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని ప్రాంతాల్లో శనివారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉదయం 10.32 గంటలకు కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి.. సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నేవీ సిబ్బందిని కలుసుకున్నారు. వరద పరిస్థితులపై స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు. కలెక్టర్ విజయరామరాజు, ప్రత్యేక అధికారి శశిభూషణ్‌కుమార్‌లు వైఎస్సార్ జిల్లాలో పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇరు జిల్లాల్లో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత రేణిగుంట ఎయిర్‌పోర్టులో చిత్తూరు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.
రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు
ఉదారంగా వ్యవహరించండి
► వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఉదారంగా ఆదుకోవాలి. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల సాయం అందజేయాలి. ఊహించని వరదలతో పంటలు, పంట పొలాలు, ఇళ్లు నష్టపోయిన వారికి అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
► చెయ్యేరు ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలి. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికే కాకుండా ఇళ్లల్లోకి నీరు చేరిన ప్రతి కుటుంబానికి రూ.2 వేల ఆర్థిక సాయం తక్షణమే అందించాలి.
► అన్నమయ్య, పింఛా ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ఇందుకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం చేయాలి. కడప నగరంలో బుగ్గవంక పరిధిలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి. కడప నగరాన్ని ముంపు నుంచి రక్షించేందుకు రూ.68 కోట్లతో స్వామ్ వాటర్ డ్రైయిన్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి. విద్యుత్, తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి.
► వివిధ మునిసిపాల్టీల నుంచి ఇప్పటికే రప్పించిన 500 మంది సిబ్బందితో కలిసి తిరుపతి పట్టణంలో వెంటనే పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి. వీధుల్లో, డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించాలి.
► తిరుపతిలో డ్రైనేజి వ్యవస్థపై మాస్టర్ ప్లాన్ రూపొందించి తగిన చర్యలు తీసుకోవాలి. వరద తగ్గగానే పంట నష్టంపై అంచనాలు రూపొందించి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. సహాయక శిబిరాలకు రాకున్నా.. ముంపునకు గురైన ఇళ్లకు వెంటనే ఆర్థిక సహాయం చేయాలి. శిబిరాల నుంచి తిరిగి ఇంటికి వెళ్లే సందర్భంలో అధికారులు, యంత్రాంగం వారికి తోడుగా నిలవాలి.
► ఈ పర్యటనలో హోంమంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం వెంట వచ్చారు. డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
వరద ప్రభావిత ప్రాంతం ఏరియల్ వ్యూ
సీఎం ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రాంతాలు
► బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన ప్రాంతాలు.
► పొంగి పొర్లుతున్న పాపాఘ్ని, పెన్నా నదుల కారణంగా ప్రభావితమైన ప్రాంతాలు.
► వెలిగల్లు, తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు, ముంపునకు గురైన గ్రామాలు.
► పింఛ ప్రాజెక్టు, చెయ్యేరు నది కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలు.
► రేణిగుంట, తిరుపతి, పేరూరు ప్రాజెక్టు, స్వర్ణముఖీ నదీ ప్రాంతాలు.
Comments
Please login to add a commentAdd a comment