
మంచి చేయాలంటే అందుకోసం డ్రామాలు ఆడక్కర్లేదని సీఎం వైఎస్ జగన్..
సాక్షి, కోనసీమ: వరద బాధితులందరికీ అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది.
ఈ సందర్భంగా.. అరిగెలవారి పేటలో పర్యటిస్తున్న ఆయన.. బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. ‘‘ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలి. వరదల్లో నేను వచ్చి ఉంటే అధికారులు నా చుట్టూ తిరిగేవాళ్లు. అందుకే అధికారులకు వారం టైం ఇచ్చి నేను ఇక్కడికి వచ్చా. మీ అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది’’ అని ఆయన బాధితులతో పేర్కొన్నారు.
అంతేకాదు జి. పేదపూడి లంక వద్ద వంతెన నిర్మిస్తామని సీఎం జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సీజన్ ముగియక ముందే వరద నష్టం అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఇదిలా ఉంటే.. వర్షంలోనూ సీఎం జగన్ ఆగకుండా తన పర్యటనను కొనసాగిస్తుండడం విశేషం. బాధితులందరికీ సాయం ఎలా అందుతోంది?.. అధికారులు, వలంటీర్ల పని తీరుపై స్వయంగా ఆయనే అడిగి తెలుసుకుంటూ కాలినడకనే ముందుకెళ్తున్నారు.