సోమవారం సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో రక్తదానం చేస్తున్న యువత
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రక్తదాన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఏకంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్‌లో చోటు దక్కించుకుంది. తొలుత దీన్ని పార్టీ కార్యక్రమంగా భావించారు. కానీ, కేవలం 8 గంటల్లోనే ప్రజలు వెల్లువలా వచ్చి రక్తదానం చేయటంతో ఇది ప్రజా కార్యక్రమంగా మారిపోయింది. ఒకే రోజు ఒకే సమయంలో 175 నియోజకవర్గాల్లో ముమ్మరంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 278 కేంద్రాల్లో ఇది జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య–ఆరోగ్య శాఖ, రోటరీ క్లబ్, రెడ్‌క్రాస్, లయన్స్ క్లబ్ ఇతర స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. రాత్రి 7గంటల సమయానికి 34,723 యూనిట్లతో 12,153 లీటర్ల రక్తాన్ని సేకరించారు.
కర్నూలు ఎస్టీబీసీ కళాశాలలో రక్తదానం చేస్తున్న యువకులు
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేంద్ర గౌడ్, రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ విజయలక్ష్మిలు మాట్లాడుతూ.. ఈ రక్తదాన సేకరణ ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇంత పెద్దఎత్తున రక్తదాన కార్యక్రమం నిర్వహించటం ఇదే తొలిసారి అని అన్నారు. లండన్ కేంద్రంగా తమ సంస్థ పనిచేస్తుందని చెప్పారు.
ప్రపంచంలోనే ఇది అత్యధికం : సజ్జల
పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఇది అత్యధికమన్నారు. గతంలో 10,500 యూనిట్ల సేకరణే రికార్డు అని.. కానీ ఇక్కడ కేవలం 8, 9 గంటల్లో దానికి మూడున్నర రెట్లు అధికంగా రక్తదానం చేశారన్నారు. కోవిడ్ వల్ల రక్తం దొరక్క చాలా ఆస్పత్రుల్లో ఆపరేషన్లకు ఆటంకం ఏర్పడిందన్నారు. తమ అధినేత పుట్టిన రోజున ఆరోగ్య రంగానికి బాసటగా నిలిచిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు సజ్జల అభినందనలు చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు బొత్స, వెలంపల్లి, ఎమ్మెల్యే ఉషాచరణ్, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు లేళ్ల అప్పిరెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నార్త్ అమెరికా ప్రతినిధి రత్నాకర్, డాక్టర్ పి. ఈశ్వర్, డాక్టర్ డి. భండారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment