ఉదయం ఎండ.. సాయంత్రం వాన.. తగ్గని జనజోరు
పల్నాడు నుంచి ఏటుకూరు దాకా పోటెత్తిన జనప్రవాహం
తడిసి ముద్దయిన సభా ప్రాంగణం.. చెక్కు చెదరని
జనసందోహం.. భోజన విరామం లేకుండా
9 గంటల పాటు సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ‘సుర్రుమంటున్న ఎండలో బిడ్డను చంకనెత్తుకుని పరుగెడుతున్న ఓ తల్లి.. చిన్నారిని భుజాలపై ఎక్కించుకుని అదిగో జగన్ అంటున్న ఓ తండ్రి.. ఊతకర్ర సాయంతో ఉత్సాహంగా అడుగులేస్తున్న ఓ తాత.. మనస్సున్న మనవడిని కళ్లారా చూసేందుకు క్యారేజీ కట్టుకుని రోడ్డుపై నిరీక్షిస్తున్న ఓ అవ్వ.. మా భవిష్యత్తు నీతోనేనంటూ ఉరలేస్తున్న యువత.. అన్నొచ్చాడన్న ఆనందంలో డీజే స్టెప్పులేస్తున్న అక్కచెల్లెమ్మలు’.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉదయం పూట కనిపించిన దృశ్యాలివి.
ఇక మధ్యాహ్నం వేళ ఆకాశమంత అభిమానాన్ని వరుణుడు తన జల్లులతో అభిషేకించడంతో ప్రతి హృదయం పులకించింది. ఎండైనా, వానైనా.. పగలైనా, రాత్రయినా.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర కోట్లాది ప్రజల హృదయాలను స్పృశిస్తూ జన జాతరను తలపిస్తోంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతున్న పాలనకు అశేష జనవాహిని బ్రహ్మరథం పడుతోంది.
వేకువజాము నుంచే జనజాతర
మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర 13వ రోజు పల్నాడు జిల్లా వాసుల అపూర్వ ఆదరాభిమానాల మధ్య గుంటూరు జిల్లాలోకి ప్రవేశించి జైత్రయాత్రను తలపించింది. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ధూళిపాళ్లలోని రాత్రి బస శిబిరం నుంచి శుక్రవారం ఉదయం 10.15 గంటలకు ముఖ్యమంత్రి జగన్ బస్సుయాత్ర ప్రారంభమైంది.
జననేత కోసం వేకువ జామునుంచే తరలివచ్చిన జన సందోహంతో ధూళిపాళ్ల శిబిరం కోలాహలంగా మారింది. సాయం కోరుతూ తనను కలిసేందుకు వచ్చిన అనారోగ్య బాధితులను అక్కున చేర్చుకున్న సీఎం జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. భాగ్యనగర్ కాలనీ, జంగంగుంట్లపాలెం, కంకణాలపల్లిలో మహిళలు భారీ ఎత్తున సీఎం జగన్‌కు యాత్రకు స్వాగతం పలికారు.
సత్తా చూపిన సత్తెనపల్లి
సీఎం జగన్‌కు సత్తెనపల్లి జనతోరణాలతో ఘన స్వాగతం పలికింది. ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. భారీ గజమాలలు, పూల వర్షంతో బస్సు యాత్రగా వస్తున్న సీఎం జగన్‌ను మనసారా ఆశీర్వదించింది. ప్రతి సెంటర్‌లో మహిళలు భారీగా తరలివచ్చి గుమ్మడి కాయలతో దిష్టి తీసి హారతులు పట్టారు. సీఎం జగన్ బస్సుపైకి చేరుకుని అందరికీ అభివాదం చేశారు. మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు రోడ్‌షో ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. లా నేస్తం, సంక్షేమ నిధికి సాయం అందించి తమకు అండగా నిచిలిన సీఎం జగన్‌కు యువ న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.
గర్జించిన గుంటూరు..
మేడికొండూరు మండలం కంటెపూడి అడ్డరోడ్డు వద్ద మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం లభించింది. విద్యార్థులు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో తాము పొందిన లబ్ధిని వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఎక్కడ చూసినా బస్సుయాత్ర వెంట భారీ జనసందోహం ఉరకలెత్తింది. కొర్రపాడులో గజమాలలు, బంతిపూలతో బస్సుయాత్రను ఆహా్వనించారు. మహిళలు రోడ్లకు ఇరువైపు నిలబడి జెండాలు చేత పట్టుకుని రెపరెపలాడించారు. జంగంగుంట్లపాలెంలో మేళతాళాలతో స్టార్ క్యాంపెయినర్లు కదం తొక్కారు. మేడికొండూరు జెండాచెట్టు సెంటర్‌లో మహిళలు గుమ్మడి కాయలతో దిష్టి తీసి జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆకాంక్షించారు.
16 కి.మీ. జనప్రవాహం..
పేరేచర్ల నుంచి ఏటుకూరు బైపాస్‌లోని బహిరంగ సభ ప్రాంగణం వరకు రహదారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. సుమారు 16 కిలోమీటర్లకుపైగా జనప్రవాహం బస్సుయాత్ర వెంట కదలి వచ్చింది. షెడ్యూల్ కంటే నాలుగు గంటలకుపైగా బస్సుయాత్ర ఆలస్యమైంది. ఉదయం నుంచి రోడ్‌షో, ఆత్మీయ పలకరింపులతో ముఖ్యమంత్రి జగన్ భోజన విరామాన్ని సైతం పట్టించుకోలేదు. గుంటూరులోని హౌసింగ్ బోర్డులో భోజన విరామ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
అశేష జన వాహినిని దాటుకుని అక్కడకు చేరుకునే సరికి సాయంత్రం ఆరు గంటలు అయింది. అప్పటికే సభా ప్రాంగణం వద్ద జన సందోహం తనకోసం నిరీక్షిస్తుండటంతో సీఎం జగన్ భోజన విరామం కోసం ఆగకుండా ముందుకు కదిలారు. మిర్చియార్డు నుంచి ఏటుకూరి వరకు దారిపొడవునా జనం బారులు తీరారు. భవనాలు, వీధులు నిండిపోయాయి. సీఎం జగన్ బస్సుపైకి ఎక్కి రెండు చేతులు జోడించి అభివాదం చేస్తూ సాయంత్రం ఏడు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
జోరు వానను సైతం లెక్కచేయకుండా జనవాహిని సీఎం రాక కోసం వేచి చూసింది. సభ అనంతరం రాత్రి 7.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి బుడంపాడు బైపాస్, తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళరావునగర్ మీదుగా రోడ్ షోలో అభిమానులను పలకరిస్తూ పెదకాకాని మండలం నంబూరు బైపాస్‌లో ఏర్పాటు చేసిన రాత్రి బస కేంద్రానికి 8.15 గంటలకు చేరుకున్నారు.
ఘాటు మిర్చి గజమాల
సిరిపురం అడ్డరోడ్డు, భీమనేనివారిపాలెంలో అక్కచెల్లెమ్మలను పలుకరిస్తూ మధ్యాహ్నం 3.30 గంటలకు మేడికొండూరు సెంటర్‌లోకి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. అనంతరం 4 గంటలకు పేరేచర్ల సెంటర్‌కు చేరుకున్న యాత్ర జనసంద్రం నడుమ సాయంత్రం 5 గంటలకు నల్లపాడుకు చేరుకుంది. ప్రతి చోటా పోటెత్తిన జనవాహినితో నిర్దేశిత షెడ్యూల్ కంటే బస్సుయాత్ర ఆలస్యమైంది. నల్లపాడు శ్రీనివాస కాలనీ వద్ద అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని కోరుతూ యాత్ర ముందుకు సాగింది. చుట్టుగుంట సెంటర్‌లో గుంటూరు ఘాటు మిర్చి గజమాలతో సంక్షేమ సారథి పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కరుణించిన వరుణుడు
అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న సీఎం జగన్ యాత్రను స్వాగతిస్తూ వరుణుడు చిరు జల్లులతో ఆశీర్వదించాడు. అప్పటి వరకు వేడి వాతావరణంలో కొనసాగుతున్న బస్సుయాత్ర మేడికొండూరులోకి ప్రవేశించగానే చిరుజల్లులు కురిశాయి. వర్షంలోనూ మేమంతా సిద్ధమంటూ ప్రజలు రోడ్లపై బారులు తీరారు.
సీఎం జగన్ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు తేలికపాటి వర్షం కురిసింది. అంతకుముందు శిబిరం వద్ద సత్తెనపల్లి, నరసరావుపేట, పెదకూరపాడు, గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల యోగక్షేమాలను తెలుసుకుని ఎన్నికల సమాయత్తంపై దిశానిర్దేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment