సాక్షి, అమరావతి: విద్యార్థి నాయకుడు స్థాయి నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, సీఎం, గవర్నర్ వరకూ సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగిన మాజీ గవర్నర్, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అందరికీ ఆదర్శమని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రోశయ్య మృతికి నివాళిగా గురువారం ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంపై సీఎం జగన్ మాట్లాడుతూ.. రోశయ్య ఏ బాధ్యత నిర్వర్తించినా అందరికీ ఆదర్శంగా, అందరూ మెచ్చుకునే మనిషిగానే మెలిగారన్నారు. ఉమ్మడి ఏపీలో ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోను ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారని, వారిద్దరి మధ్య మంచి సంబంధాలుండేవని.. ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారన్నారు. అలాంటి రోశయ్య ఇవాళ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నానని సీఎం అన్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఇటీవల మృతిచెందిన శాసనసభ మాజీ సభ్యులు వల్లూరి నారాయణమూర్తి, వీవీఎస్‌ఎస్ చౌదరి, కడప ప్రభాకర్‌రెడ్డి, మంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి, గారపాటి సాంబశివరావు, టీఎన్ అనసూయమ్మ, పి. వేణుగోపాలరెడ్డి, ఎల్లసిరి శ్రీనివాసులరెడ్డి, యడ్లపాటి వెంకట్రావుల ఆత్మకు శాంతి చేకూరాల ని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు సీఎం తెలిపారు. సభ్యు లు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
మేటి రాజకీయ నాయకుడు
డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ.. రోశయ్య తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని మహా మనిషిలా ఎదిగారన్నారు. ఆర్థిక మంత్రి హోదాలో వరుసగా ఏడుసార్లు.. మొత్తంమీద 16సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మంత్రిగా, సీఎంగా రోశయ్య రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారన్నారు. ఆయన సేవలకు గుర్తుగా ఒంగోలులో రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారన్నారు. మాజీ సీఎం రోశయ్య మరణం అత్యంత బాధాకరమని.. ఆయన తెలుగు ప్రజలందరికీ మంచి జరిగేలా అనేక కార్యక్రమాలు చేశారని మంత్రి వెలంపల్లి కొనియాడారు. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్పందిస్తూ.. రోశయ్య ప్రసంగాలు సభ్యులందరికీ మార్గదర్శకమని చెప్పారు. అంతటి మహనీయుడు మరణిస్తే, సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టడంపై రాజకీయం చేయడం సబబు కాదన్నారు. నిబంధనలు, ఆనవాయితీలకు అనుగుణంగా సభ నడుస్తుందన్నారు.
‘మండలి’లోనూ నివాళి
రాజకీయాల్లో తనదైన రీతిలో రాణించిన కొణిజేటి రోశయ్య ఆదర్శప్రాయుడని సభ్యు లు కొనియాడారు. ఆయన మృతికి సంతాప తీర్మానాన్ని గురువారం శాసనమండలిలో మంత్రి కె. కన్నబాబు ప్రవేశపెట్టారు. అజాత శత్రువుగా అందరి మన్ననలు ఆయన అందుకున్నారన్నారు. విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ రోశయ్య వంటి మహనీయుల ఉపన్యాసాలు నేటి తరానికి దిక్సూచిగా ఉపయోగపడతాయన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ, వైఎస్సార్‌సీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు జోక్యం చేసుకుని సభ్యులు సంతాపం వరకే పరిమితమై మాట్లాడాలని, అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే రికార్డు నుంచి తొలగిస్తామని రూలింగ్ ఇచ్చారు. అనంతరం, మంత్రి ముత్తంశెట్టి, ఉమ్మారెడ్డి, యనమల, కల్పలతారెడ్డి, పోతుల సునీత, మాధవ్, చిక్కాల, అంగర రామ్మెహనరావు, వాకాటి నారాయణరెడ్డి, కేఎస్ లక్ష్మణరావు తదితరులు మాట్లాడి రోశయ్య కుటుంబానికి సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment