త్వరగా తేల్చండి: సీఎం జగన్‌ | CM YS Jagan comments in issues to be discussed in Sadaran Council meeting | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: త్వరగా తేల్చండి: సీఎం జగన్‌

Published Thu, Nov 4 2021 2:40 AM | Last Updated on Thu, Nov 4 2021 8:16 AM

CM YS Jagan comments in issues to be discussed in Sadaran Council meeting - Sakshi

సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఈనెల 14వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన తిరుపతిలో జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్ర విభజన హామీలతోపాటు అపరిష్కృత అంశాలు, పెండింగ్‌ బకాయిల గురించి ప్రధానంగా ప్రస్తావించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. సదరన్‌ కౌన్సిల్‌ భేటీలో చర్చకు తేవాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించి 6కిపైగా అంశాలను ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. సమావేశంలో చర్చించాల్సిన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఆ వివరాలివీ..

సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు, ఉన్నతాధికారులు 

రాష్ట్రానికి మేలు జరిగేలా...
సదరన్‌ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చేలా చూడాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. దీనివల్ల సమావేశంలో చర్చ జరిగి రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌ అంశాలను అజెండాలో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. రూ.6,300 కోట్ల విద్యుత్‌ బకాయిలు, రెవెన్యూ లోటు, రేషన్‌ బియ్యంపై హేతుబద్ధతలేని కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ సప్‌లైస్‌ బకాయిలు, పోలవరం రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఎఫ్‌డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ ప్రస్తావించాలని సూచించారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి తమిళనాడు నుంచి రావాల్సిన బకాయిలపై కూడా ప్రస్తావించనున్నారు. 

సర్వ సన్నద్ధంగా ఉండాలి..
నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనల గురించి సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా వీలైనంత త్వరగా సాకారమయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలపై వివరాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. కౌన్సిల్‌ సమావేశంలో ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలుంటే తగిన రీతిలో స్పందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

హాజరు కానున్న సీఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు..
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ సహా కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అండమాన్‌ నికోబార్, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్లు, లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ పాల్గొననున్నారు. 

హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు
ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎక్స్‌ అషీషియో ప్రిన్సిపల్‌ సెక్రటరీ (స్టేట్‌ రీఆర్గనైజేషన్‌) ఎల్‌.ప్రేమచంద్రారెడ్డి, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి జి.విజయ్‌కుమార్, మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, అదనపు డీజీపీ (లా అండ్‌ ఆర్డర్‌) ఏ.రవిశంకర్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement