సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో ఇక కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. అందువల్ల వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్‌కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదిం చాలని అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా కరోనా తిరిగి ఉధృతం అవుతోందని, మళ్లీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల ప్రక్రియను త్వరగా ముగించి వ్యాక్సి నేషన్‌ను వేగవంతం చేయడం అత్యవసరమని సీఎం స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియ వ్యాక్సినేషన్‌కు భంగకరంగా మారిందన్నారు. ఎన్నికలు పూర్తయితే వ్యాక్సినేషన్‌పై అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు వీలుంటుందన్నారు. కోవిడ్ వ్యాప్తి తిరిగి పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల సంఖ్య పెంచా లన్నా ఎన్నికల ప్రక్రియ అడ్డంకిగా మారే అవకాశం ఉందన్నారు.
ఎక్కువ కేసులు వెలుగులోకి వచ్చిన చోట్ల రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తే ప్రజలు ఎన్నికల ప్రక్రియకు దూరమై ఓటు వేసే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కోవిడ్‌పై ప్రధాని మోదీ బుధవారం ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంపై సీఎం జగన్ సమీక్షించారు. డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, హోంమంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిష నర్ భాస్కర్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించడంతో పాటు మహారాష్ట్రలో కరోనా నియంత్రణకు టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానాన్ని సక్రమంగా పాటించకపోవడంతో సెకండ్ వేవ్ ముప్పు ముంగిట నిలిచిందనే విషయం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రులు ఆళ్ల నాని, సుచరిత తదితరులు
జాప్యం జరుగుతోంది...
అధికార యంత్రాంగం అంతా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో నిమగ్నం కావడం వ్యాక్సినేషన్ ప్రక్రియకు అవరోధంగా మారిందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. గతేడాది మధ్యలో ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను కేవలం ఆరు రోజుల్లో ముగించవచ్చని, వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇవి కూడా నిర్వహించి ఉంటే బాగుండేదని, కానీ అలా జరగలేదని, జాప్యం జరుగుతూ వస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న కరోనా కేసులను, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిషత్ ఎన్నికల్లో మిగిలిపోయిన ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తైతే వ్యాక్సినేషన్‌ను ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లవచ్చన్నారు. లేదంటే వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ చేయడం, పరీక్షలు నిర్వహించడం కష్టం అవుతుందన్నారు.
సచివాలయాలు యూనిట్‌గా వాక్సినేషన్..
వ్యాక్సినేషన్‌ను ఉద్ధృతంగా చేపట్టేందుకు గ్రామ సచివాలయాలను యూనిట్‌గా తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. సంబంధిత సచివాలయం పరిధిలో ఉన్న వారికి వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయడంపై దృష్టిపెట్టి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. 45 ఏళ్లకు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్లు సత్వరమే అందించాలన్నారు. వ్యాక్సినేషన్‌పై సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. పూర్తిస్థాయిలో నూటికి నూరుశాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment