
సాక్షి, అమరావతి: విమర్శలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. లేని అవినీతిని ఉన్నట్లుగా సృష్టిస్తూ ఎల్లో మీడియా వికృతరాతలు రాస్తూ దుష్ఫ్రచారం చేస్తోందంటూ ఆక్షేపించారు. మంగళవారం తాత్కాలిక సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం సమకాలీన రాజకీయ పరిణామాలపై ఆయన మంత్రులతో చర్చించారు.
రాష్ట్రంలో అత్యంత పారదర్శకమైన పారిశ్రామిక విధానాలను అనుసరిస్తుండటం వల్లే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అత్యంత పారదర్శకంగా చేపడుతున్నామని.. కానీ సన్నిహితులకే ఎనర్జీ ప్రాజెక్టులను కట్టబెడుతున్నట్లు ఎల్లో మీడియా వికృత ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికే ఇలా దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు.
వాస్తవాలను ప్రజలకు వివరించి.. దుష్టచతుష్టయం దుష్ఫ్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని మార్గ నిర్దేశం చేశారు. ఎల్లో మీడియా వికృత చేష్టల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు ఉద్బోధించారు. చేసిన మంచిని ప్రజలకు వివరించి.. వారి సమస్యలు విని.. వాటిని పరిష్కరించి.. ప్రజల ఆశీర్వాదం పొందడానికి చేపట్టిన బృహత్తర కార్యక్రమమే గడప గడపకూ మన ప్రభుత్వమని చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని మీ నియోజకవర్గాల్లో మరింత ప్రభావవంతంగా నిర్వహించడంతోపాటు మీ జిల్లా.. మీరు ఇన్‌చార్జ్ మంత్రిగా వ్యవహరించే జిల్లాలోనూ ఆ కార్యక్రమాన్ని మరింత ప్రభావ వంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
8వ తరగతి చదవుతున్న పిల్లలకు ఈనెల 21న ట్యాబ్‌లు, బైజూస్ ఈ–కంటెంట్‌ను అందజేసే కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.2,750కి పెంచుతున్న తరుణంలో జనవరి 1 నుంచి 7 వరకు నిర్వహించే వారోత్సవాల్లో పాల్గొని, పెన్షన్ పెంపు మంజూరు పత్రాలను అందజేసి, వారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పారు.