సాక్షి, అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం దగ్గరపడింది. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కసరత్తు ముమ్మరం చేశారు. సామాజిక కూర్పు, అనుభవం, జిల్లాల అవసరాల ప్రాతిపదికన ప్రస్తుత మంత్రివర్గంలో 7 నుంచి 10 మందిని కొనసాగించే అవకాశముందని తెలిసింది. కొత్తగా 14 నుంచి 17 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక మంత్రివర్గం ఏర్పాటు నుంచి రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లు.. మేయర్లు, మండల పరిషత్ అధ్యక్షులు వరకూ అన్నింటా సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరింత ప్రాధాన్యం ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు.
సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనం
2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు.. 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయాన్ని సాధించింది. 2019, మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్.. 2019, జూన్ 8న 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. నాటి కేబినెట్‌లో ఏడుగురు బీసీలకు, ఐదుగురు ఎస్సీలకు, నలుగురు కాపులకు, నలుగురు రెడ్డి సామాజికవర్గం వారికి అవకాశం కల్పించారు. గిరిజన, మైనార్టీ, క్షత్రియ, వైశ్య, కమ్మ వర్గాల నుంచి ఒక్కొక్కొరికి స్థానం కల్పించారు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో 60 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చి సామాజిక న్యాయానికి సిసలైన నిర్వచనం ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రులుగా ఐదుగురికి అవకాశం ఇస్తే.. అందులో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మహిళలను హోంశాఖ మంత్రిగా సీఎం జగన్ నియమించారు. రాజ్యాధికారంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా.. సంక్షేమాభివృద్ధి పథకాలను ఆ వర్గాల్లో అట్టడుగున ఉన్న వారికి చేర్చి.. అభివృద్ధి పథంలోకి తేవాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరింత ప్రాధాన్యం
ఇక రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్పుచేసి.. కొత్త వారితో ఏర్పాటు చేస్తానని.. పాత వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని మొదట్లోనే సీఎం వైఎస్ జగన్ చెప్పారు. కానీ, కరోనా కారణంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జాప్యం చోటుచేసుకుంది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో కొత్త కేబినెట్ కూర్పుకు సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. తొలుత మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యం కంటే.. ఇప్పుడు మరింత అధికంగా ప్రాధాన్యత దక్కుతుందని తెలిసింది. సామాజిక కూర్పు, జిల్లాల అవసరాలు ప్రాతిపదికన మంత్రివర్గం ఏర్పాటుచేస్తారని చెబుతున్నారు.
ఆశావహులు వీరే..
► బీసీ వర్గం నుంచి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, బూడి ముత్యాలనాయుడు, పొన్నాడ సతీష్‌కుమార్, విడదల రజని, జోగి రమేష్, కొలుసు పార్థసారధి, బుర్రా మధుసూదన్ యాదవ్, కరణం ధర్మశ్రీ, ఉషాశ్రీ చరణ్..
► ఎస్సీ సామాజికవర్గం నుంచి కొండేటి చిట్టబ్బాయ్, తలారి వెంకట్రావు, ఎలీజా, రక్షణనిధి, మేరుగ నాగార్జున, కిలివేటి సంజీవయ్య, కోరుముట్ల శ్రీనివాసులు, జొన్నలగడ్డ పద్మావతి..
► ఎస్టీ సామాజికవర్గం నుంచి కళావతి, పీడిక రాజన్నదొర, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి..
► ఓసీ సామాజికవర్గాల నుంచి ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్ధన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి
► మైనార్టీ వర్గం నుంచి హఫీజ్ ఖాన్, ముస్తఫా తదితరులు మంత్రివర్గంలో ఆశావహులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment