అది పేపరా.. పట్టిన పీడా? | CM YS Jagan Fires On Eenadu And Yellow Media Chandrababu | Sakshi
Sakshi News home page

అది పేపరా.. పట్టిన పీడా?

Published Fri, Dec 22 2023 4:46 AM | Last Updated on Fri, Dec 22 2023 9:25 AM

CM YS Jagan Fires On Eenadu And Yellow Media Chandrababu - Sakshi

తప్పుడు రాతలతో పేద విద్యార్థులపై విషం కక్కుతోందంటూ ఈనాడు కథనాన్ని చూపుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘మీ పిల్లలు, మీ మనవళ్ల చేతిలోనేమో ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఉండొచ్చు! స్మార్ట్‌ ఫోన్లు కూడా ఉండొచ్చు! కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం అవి ఉండకూడదా? ఇది సరైన పోకడేనా?’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీరంతా ఎంత దిగజారి మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ‘పేద పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వనే ఇవ్వకూడదని వారంతా అంటున్నారు. ట్యాబ్‌లు చేతిలో ఉంటే పిల్లలు చెడిపోతున్నారని రాస్తున్నారు.

మన ప్రభుత్వ బడులలో చదువుకునే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలపై తప్పుడు రాతలు రాస్తున్నారు. ఏవేవో వీడియోలు చూస్తున్నారని, ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతున్నారని, చెడిపోతున్నారని పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వొద్దని ప్రతి రోజూ పనిగట్టుకుని నాపై విమర్శలు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. గురువారం అల్లూరి జిల్లా చింతపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్‌ మాట్లాడారు.  

దిక్కుమాలిన మాటలు..
‘‘మీ పిల్లల చేతుల్లో ఇవన్నీ ఉంటే చెడిపోరుగానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబ్‌లు, ల్యాప్‌టాపులు, స్మార్ట్‌ ఫోన్లు ఉంటే చెడిపోతారా? మీ పిల్లలు, మనవళ్లేమో ఇంగ్లిషు మీడియంలోనే చదవాలి! పేద పిల్లలు మాత్రం ఇంగ్లిషు మీడియం బడులకు వెళ్లకూడదు..! ఇంగ్లిషులో చదవకూడదా? పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదివితే తెలుగు భాష అంతరించిపోతుందట! కానీ వాళ్ల పిల్లలు, మనవళ్లు మాత్రం ఇంగ్లిషులోనే చదవాలట! ఇది ధర్మమేనా? ఆలోచన చేయండి. దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి రాజకీయాలతో మీ బిడ్డ యుద్ధం చేస్తున్నాడు’’ 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పేద పిల్లలపై కడుపు మంట.. 
‘‘జగన్‌ బర్త్‌డే బహుమతి.. చెడగొడుతోంది మతి! గాడి తప్పుతున్న బైజూస్‌ ట్యాబ్‌ చదువులు, ఇతర వీడియోలు, ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడుతున్న పిల్లలు, వెనక్కి తీసుకోవాలంటూ తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్‌ సర్కార్‌’ అని ఈనాడులో కథనాలు రాశారు. ఇది పేపరా..! పేపరుకు పట్టిన పీడా?’’ అని సీఎం జగన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి పేపర్‌ను చదవొచ్చా? అని ప్రశ్నిస్తూ ఈనాడు పత్రికని నేలకేసి కొట్టారు. నేను ఆ పత్రిక యాజమాన్యాన్ని, ఆ పత్రికను సమర్ధించే రాజకీయ పార్టీలకు ఒకటే చెబుతున్నా.

ఇంతగా దిగజారి రాతలు రాయకండి.. ఇంతగా దిగజారి మాట్లాడకండి అని చెబుతున్నా. పేద వర్గాల పిల్లల మీద ఇంతగా విషం కక్కకండి అని చెబుతున్నా. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే.. ఇంత కడుపు మంట వద్దండీ! అని చెబుతున్నా. ఈరోజు మీరంతా అన్నీ చూస్తున్నారు. ఒకవైపు జగన్‌ ఫొటోకు పది తలకాయలు పెట్టి రాష్ట్రం అంతా అప్పుల పాలై పోయిందని రాస్తారు. మరోవైపు చంద్రబాబు మేనిఫెస్టో, ఆరు గ్యారంటీలు అంటూ పతాక శీర్షికల్లో ప్రచురిస్తారు. జగన్‌ ఇచ్చే వాటికన్నా వాళ్లు చెబుతున్నవి మూడింతలు ఎక్కువ.

2014 – 19 వరకూ వాళ్లే పరిపాలన చేశారు. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు అప్పుడూ ఉన్నారు. రూ.87,612 కోట్ల రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశారు. పొదుపు సంఘాల మహిళలను దగా చేశారు. ఇంటికో జాబ్‌ లేదంటే రూ.2 వేల నిరుద్యోగ భృతి అంటూ ఒక్కరికీ ఇచ్చిన పాపాన పోలేదు. అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, రైతులు, పిల్లలు.. ఇలా ఎవరినీ వదలకుండా మోసం చేశారు. ఎంత దారుణమంటే ప్రజలు కొడతారేమోననే భయంతో చివరకు మేనిఫెస్టోను సైతం మాయం చేశారు. 

నాడు అసాధ్యం.. నేడు ఎలా సాధ్యమైంది? 
ఈ రోజు మీ బిడ్డ 99.5 శాతం వాగ్దానాలను అమలు చేశాడు. రూ.2.40 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు? గతంలో పరిపాలన చేసిన వాళ్లు మీ బిడ్డలా ఎందుకు చేయలేకపోయారు? ఎందుకంటే.. అప్పట్లో ఓ గజదొంగల ముఠా పరిపాలన చేసింది కాబట్టే! ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, జన్మభూమి కమిటీల నుంచి మొదలుపెడితే ఇసుక, మద్యం, స్కిల్‌ స్కామ్, పైబర్‌ గ్రిడ్‌ దాకా ఏది చూసి­నా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే.

ఇక అప్పుల గురించి విమర్శలు చేస్తున్నారు. గత సర్కారు హయాంతో పోలిస్తే అప్పుల పెరుగుదల ఇవాళ తక్కువగానే ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ బురద జల్లుతారు. ఎవరైతే మీకు మంచి చేశారో వారిని గుర్తు పెట్టుకోండి. ఈ రోజు మీ బిడ్డ మీ కళ్ల ముందు నిలబడి మీ కళ్లలోకి చూసి చెప్పగలుగుతున్నాడు. మీకు మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా, అండగా నిలబడండి.

ప్రజలంతా మీ వెంటే.. 
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లా ఏర్పాటు చేసిన మన సీఎంకు ధన్యవాదాలు. గిరిజన ప్రాంత ప్రజలకు కనీస అవసరాలు తీరుస్తూ మన గిరిజన హక్కులు కాపాడుతున్న మన అభినవ అల్లూరి జగనన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ విజనరీ లీడర్‌షిప్‌లో విద్యా రంగానికి మీరు ఇస్తున్న ప్రాధాన్యతకు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. పోటీ ప్రపంచంలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు కూడా పోటీ పడాలని మీరు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. గ్లోబల్‌ లాంగ్వేజ్‌ ఇంగ్లిష్ ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు.

విద్యతో పాటు వైద్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చి మా గిరిజనులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. చంద్రబాబు బాక్సైట్‌ జీవో 97 తీసుకువస్తే, మీరు గిరిజనుల పక్షాన నిలబడి అధికారంలోకి రాగానే రద్దు చేశారు. నాడు వైఎస్సార్‌ హయాంలో అటవీ హక్కుల చట్టం తీసుకొస్తే.. నేడు మన జగనన్న ఒక్క పాడేరు నియోజకవర్గంలోనే 1,13,000 మందికి 2,27,000 ఎకరాల భూమిపై హక్కు కల్పించి రికార్డు సృష్టించారు. మా నియోజకవర్గంలో రూ.1,251 కోట్లు నేరుగా ప్రజల అకౌంట్‌లో జమ అయ్యాయి. సామాజిక న్యాయానికి సంపూర్ణ అర్థం చెప్పిన జగనన్నను మేం ఎప్పటికీ మరువం. ఏపీ ప్రజలంతా జగనన్న వెంటే ఉన్నారు. 
– కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే

మామయ్యా.. మీ వల్లే చదువుకుంటున్నాం
జగన్‌ మామయ్యా.. హ్యపీ బర్త్‌ డే.. మా నాన్న పేద రైతు కావడం వల్ల మమ్మల్ని చదివించడం ఇబ్బందిగా ఉండేది. మీరు సీఎం అయ్యాక అమ్మ ఒడి ద్వారా ఆదుకున్నారు. నేనే కాదు.. నాలాగ వేల మంది విద్యార్థులు చదువుతున్నారంటే అమ్మ ఒడే కారణం. ఒకప్పుడు మా స్కూల్‌ సరిగా లేదు. మా జగన్‌ మామయ్య సీఎం అవ్వడం వల్లే రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మాకు ఇంగ్లిష్‌ మీడియం తీసుకొచ్చారు. ఒకప్పుడు నాకు ఇంగ్లిష్‌ రాక ఇబ్బంది పడేదాన్ని.

నేను ఇప్పుడు ఇంగ్లిష్ లో చక్కగా మాట్లాడుతున్నాను. బైలింగ్యువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ చాలా బాగున్నాయి. గతంలో స్కూల్‌కు వెళ్లాలంటే ఇష్టం ఉండేది కాదు. మీరు తీసుకొచ్చిన మార్పుల వల్ల, సహాయం వల్ల ఇవాళ ఇష్టంగా స్కూలుకు వెళ్తున్నాం. మంచి పౌష్టికాహారం ఇస్తున్నారు. రోజుకోరకం మంచి ఆహారం ఇస్తున్నారు. మాకు మంచి ట్యాబ్‌లు ఇచ్చారు. ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేశారు. చక్కగా చదువుకుంటున్నాం. ఆణి­ముత్యాలు కార్యక్రమం ద్వారా టాపర్స్‌కు ప్రోత్సాహకం ఇస్తున్నారు. 
మేం బాగా చదువుకుని మంచి జాబ్‌ వచ్చే వరకు మీరే మాకు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను. 
– ధారామణి, ఆశ్రమ పాఠశాల గిరిజన విద్యార్ధిని, చింతపల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement