సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
రెండు మూడు నెలల్లో మూడేళ్లు గడిచి పోతాయి. రాబోయే రెండేళ్లు పరీక్షా సమయం. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతే అది మీ వ్యక్తిగత తప్పిదమే అవుతుంది. ఈ విషయాన్ని ఎవరూ తేలిగ్గా తీసుకోకూడదు. ఎవరి పనితీరు సరిగా లేకున్నా ఉపేక్షించేది లేదు. పనితీరు సరిగ్గా లేకపోతే.. సర్వేల్లో పేర్లు రాక పోతే కచ్చితంగా మార్పులుంటాయి. ఆ పరిస్థితి కల్పించకూడదని కోరుతున్నా. మీకు తగిన సమయం ఇస్తున్నా. ఇప్పటివరకూ ఎలా ఉన్నా.. ఇకపై ముందుకు కదలాలి. అది మీరు కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోండి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో కూర్చోవాలంటే గడప గడపకూ వెళ్లి ప్రజల ఆశీర్వాదం తీసుకోవడం కంటే ప్రభావవంతమైన కార్యక్రమం మరొకటి లేదు. నా అనుభవంతో చెబు తున్నా. నియోజకవర్గంలోని ప్రతి గడపకూ మూడు సార్లు వెళ్లండి. కనీసం రెండుసార్లయినా వెళ్లండి. అప్పుడే సత్ఫలితం వస్తుంది. లేదంటే ఎంత మంచి ఎమ్యెల్యే అయినా గెలవడం అన్నది ప్రశ్నార్థకమవు తుంది’ అని వైఎస్సార్‌సీపీ శాసన సభ్యులకు సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడ్డాక కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించి సమావేశాన్ని సీఎం ప్రారంభించారు. సమావేశం ప్రారంభంలోనే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి వైఎస్సార్‌ఎల్పీ ఘనంగా నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
ఇంట్లో కాదు... ఎమ్మెల్యేలంతా ప్రజల్లోనే ఉండాలి
ప్రభుత్వం ఏర్పాటై మరో రెండు మూడు నెలల్లో మూడేళ్లు పూర్తి కావస్తోంది. ఇక నుంచి పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. ఆ దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. అధికారం చేపట్టిన మొట్టమొదటి రోజు నేను చెప్పిన కొన్ని అంశాలను మళ్లీ గుర్తు చేస్తున్నా. ఎమ్మెల్యేలు అంతా ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇవాళ ఈ ఎల్పీ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. మన ఇళ్ల దగ్గర మనం కూర్చోవడం.. ప్రజలు మన ఇళ్ల దగ్గరికి వచ్చి మనల్ని కలవడం అన్నదానికి ఇకపై స్వస్తి పలకాలి. గ్రామాల్లోకి వెళ్లాల్సిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.
వలంటీర్లకు సన్మానాల్లో పాల్గొనాలి
ఏప్రిల్‌లో ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానాలు చేస్తున్నాం. బాగా పనిచేసిన వలంటీర్లకు సేవావజ్ర, సేవామిత్ర, సేవారత్న అవార్డులు ఇస్తున్నాం. ప్రభుత్వం వైపు నుంచి పారితోషికం, మెడల్ కూడా అందజేస్తున్నాం. గతేడాది కూడా మనం నిర్వహించాం. ఏప్రిల్ 2న ఉగాది నాడు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం నెల రోజులపాటు సాగుతుంది. కచ్చితంగా ప్రతి ఊరికీ వెళ్లి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. రోజూ మూడు నాలుగు గ్రామాలకు వెళ్లి వలంటీర్లను సన్మానించే కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇది చాలా ముఖ్యం.
మే నుంచి గడప గడపకూ...
మే నుంచి నెలకు 10 సచివాలయాల వద్దకు నెలలో 20 రోజులపాటు గ్రామాల్లో ఎమ్మెల్యేలు తిరగాలి. ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు రోజులు వెళ్లాలి. ఆ సచివాలయం పరిధిలో ప్రతి ఇంటివద్దకూ వెళ్లాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల ఫలాలను వివరించాలి. ఆ ఇంటికి ఏం మేలు చేశామనే అంశంపై నేను రాసిన లేఖను అందించాలి. మీరే స్వయంగా ఆ లేఖను ఇచ్చి ఆ మేలును గుర్తు చేయాలి. వారి ఆశీస్సులను పొందాలి.
క్యాడర్‌తో కలసి మెలసి..
గ్రామాల్లో మీరు పర్యటించినప్పుడు క్యాడర్‌తో మమేకమవ్వండి. వారిని ప్రజలకు చేరువ చేయండి. మళ్లీ మూలాల్లోకి వెళ్లి బూత్ కమిటీల ఏర్పాటు కూడా జరగాలి. ఈ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలి. ఈ మూడు పనులు ఏకకాలంలో జరగాలి. ఆ తర్వాత వేరే సచివాలయానికి వెళ్లే ముందు.. ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి. నెలకు పది సచివాలయాలు మాత్రమే కేటాయించాం. మిగిలిన 10 రోజులు ఇతర కార్యక్రమాలు చేపట్టవచ్చు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 80 సచివాలయాలు ఉంటాయి అనుకుంటే గడప గడపకూ కార్యక్రమం పూర్తి కావడానికి కనీసం 8 నెలలు పడుతుంది. 8 నెలలు పూర్తయ్యే సరికి ప్రతి ఇంటికీ ఎమ్మెల్యే వెళ్లి ఆ కుటుంబాల ఆశీర్వాదాలు తీసుకుంటారు.
జిల్లా, మండల, గ్రామ కమిటీలు..
మే నెలలో సచివాలయాల సందర్శన ప్రారంభమయ్యేసరికి జిల్లా, మండల, గ్రామ పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఇందులో రీజనల్ కో–ఆర్డినేటర్లు చురుగ్గా వ్యవహరిస్తారు. కొత్తగా 26 జిల్లాల నేపథ్యంలో 3–4 జిల్లాలకు ఒక రీజనల్ కో–ఆర్డినేటర్ ఉంటారు. రీజనల్ కో–ఆర్డినేటర్లు సుమారు 8 మంది వరకు పెరుగుతారు. జిల్లా కమిటీలు పూర్తి చేసుకుని జూలై 8న వైఎస్సార్ సీపీ ప్లీనరీ నిర్వహిస్తాం.
భవిష్యత్తు తరాలు చెప్పుకునేలా పనులు
కాలర్ ఎగరేసి మనం ఇది చేశాం అని చెప్పుకునే పరిస్థితి ఉంది. పారదర్శకంగా, సోషల్ ఆడిట్ ద్వారా సచివాలయంలో జాబితా ప్రదర్శించి అర్హత ఉన్న ఏ ఒక్కరికీ మిస్ కాకుండా సంతృప్త స్థాయిలో పథకాలు అందించాం. ఇదీ వాస్తవం. చిరునవ్వుతో, ఆనందంగా ప్రజల దగ్గరకు వెళదాం. ఇంతమంది ప్రజల జీవితాలను మార్చగలిగామనే తృప్తి మనకు ఉంది. భవిష్యత్ తరాలు మన గురించి కచ్చితంగా చెప్పుకునేలా పని చేశాం. రాజకీయ నాయకులుగా మనకు కావాల్సింది ఇలాంటి తృప్తే. సంతృప్తికర స్థాయిలో ప్రజలకు మేలు చేయడంలో నాన్న ఒక అడుగు ముందుకేస్తే.. మనం నాలుగు అడుగులు ముందుకేశాం. కులమతాలు, పార్టీలను చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలను అందించాం. 31 లక్షల ఇళ్లు జగనన్న కాలనీల పేరుతో ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. గర్వంగా ప్రజల దగ్గరకు వెళ్లి ఇవే విషయాలను చెప్పాలి.
సర్వేలలో పేరు లేకుంటే టికెట్ రాదు..
ఒకమాట స్పష్టంగా చెబుతున్నా. గడప గడపకూ కార్యక్రమాన్ని సక్రమంగా చేయకపోతే సర్వేల్లో మీ పేర్లు రావు. సర్వేలలో మీ పేరు లేకపోతే మొహమాటం లేకుండా టికెట్లు నిరాకరిస్తా. మనం గెలవాలి.. అది మరిచిపోవద్దు. ఎందుకంటే... జుత్తు ఉంటేనే ముడి వేసుకోవచ్చు.. అదే లేకపోతే.. ఎలా? గెలవదగ్గ పరిస్థితుల్లోకి ప్రతి ఒక్కరూ రావాలి. ఇన్నాళ్లూ కోవిడ్ వల్ల ప్రజలకు కాస్త దూరంగా గడిపి ఉండవచ్చు. ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లాలి.
సలహాలు, సూచనలపై ప్రత్యేక వ్యవస్థ
సచివాలయాలు మరింత మెరుగ్గా పనిచేసేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు అందితే మీ దగ్గర నుంచి నా వరకు తీసుకురావడానికి ఒక వ్యవస్థను కూడా రూపొందిస్తాం. మీరు వెళ్లేటప్పటికి ఆ వ్యవస్ధ కూడా తయారవుతుంది. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లగా బాధ్యతలు తీసుకునే వారంతా బూత్ కమిటీలు, గడప గడపకూ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తారు.
సీఎం ప్రత్యేక నిధితో ప్రతి ఎమ్మెల్యేకూ రూ.2 కోట్లు
ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి కింద ప్రతి ఎమ్మెల్యేకూ రూ.2 కోట్లు అందజేస్తాం. ఈ నిధితో ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించండి. ఏప్రిల్ 1 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment