తన భార్య వైద్యానికి సాయం చేయాలని సీఎం వైఎస్ జగన్‌ను అభ్యర్థిస్తున్న రవికుమార్ (ఫైల్)
సాక్షి, అమలాపురం: అనారోగ్యంతో బాధపడుతున్న వైద్యాధికారి పట్ల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఔదార్యం చూపింది. దెబ్బతిన్న ఊపిరితిత్తులు, అవయవ మార్పిడి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.30 లక్షలు మంజూరు చేసింది. ఈ విషయాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం విలేకరులకు తెలిపారు.
వివరాల ప్రకారం.. జిల్లాలోని కె.గంగవరం మండలం పేకేరు పీహెచ్‌సీ వైద్యాధికారిగా కాలే యేసు దేవీకుమారి పదేళ్లుగా పని చేస్తున్నారు. ఆమె రెండో దశలో కోవిడ్ బారినపడి కోలుకున్న తర్వాత అరుదైనవ్యాధి సోకడంతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. దీనికి కొంతకాలం నుంచి ఆమె చికిత్స పొందుతున్నారు. కానీ ఊపిరితిత్తులు 85శాతం దెబ్బతినడంతో నెల రోజుల క్రితం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్సలు చేసినా ఫలితం లేకపోవడంతో ఊపిరి తిత్తులు మార్పిడి చేయాలని వైద్యులు చెప్పారు. అదే సమయంలో సీఎం వైఎస్ జగన్ ఈ నెల 7వ తేదీన జిల్లాలోని రాజోలు నియోజకవర్గ పర్యటనకు వచ్చారు.
కలెక్టర్ హిమాన్షు శుక్లా చొరవతో డాక్టర్ యేసు దేవీకుమారి భర్త, కొత్తపేట మండలం అవిడి పీహెచ్‌సీ వైద్యాధికారి పి.రవికుమార్... సీఎం జగన్‌ను కలిసి తన భార్యకు వైద్యం కోసం సహాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రాతిపదికన అవయవ మార్పిడి జరిగిన తర్వాత నేరుగా యశోద ఆస్పత్రికి చెల్లించే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.30 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
సీఎం సాయం మరువలేం
చాలా సంతోషంగా ఉంది. నా భార్య ప్రాణాలు నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సాయం మరువలేం. నా భార్య అనారోగ్య సమస్యను కలెక్టర్ హిమాన్షు శుక్లా దృష్టికి తీసుకువెళ్లాను. డీఎంహెచ్‌వో ద్వారా కలెక్టర్ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సీఎం జగన్ వద్దకు కలెక్టర్ తీసుకువెళ్లి నాతోపాటు ఆయన కూడా సమస్యను వివరించారు. తర్వా త మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ స్వయంగా సీఎం వద్దకు ఫైల్ తీసుకువెళ్లారు. వీరందరి కృషితో నా భార్య ఊపిరితిత్తుల మార్పిడికి ఈ సాయం అందింది.
– డాక్టర్ రవికుమార్, వైద్యాధికారి, అవిడి పీహెచ్‌సీ, కొత్తపేట మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఇది కూడా చదవండి: Andhra Pradesh:భూ చిక్కుముడులకు చెక్
Comments
Please login to add a commentAdd a comment