సాక్షి, మచిలీపట్నం: గ్రామాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కృష్ణా జిల్లా పెడనలో లాంఛనంగా ప్రారంభించారు. పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా గ్రామదర్శిని కార్యక్రమాన్ని రూపొందించినట్లు కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. వారంలో ఒకరోజు ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు పర్యటించి సమస్యలను నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించనున్నారు.
పెడనకు పండుగ
జగనన్న రాకతో పెడన నియోజకవర్గానికి ఈ రోజు పండుగ వచ్చింది. మాది పేదలుండే తీర ప్రాంత నియోజకవర్గం. చినగొల్లపాలెంలో వంతెన కడతామంటే ఎవరూ నమ్మలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు బ్రిడ్జిలు కట్టించటమే కాకుండా మెగా వాటర్ స్కీంతో దాహార్తిని తీర్చారు. వైఎస్సార్ హయాంలో రెండు పంటలకు నీరిస్తే చంద్రబాబు ఒక పంటకు కూడా ఇవ్వలేకపోయారు.
– జోగి రమేష్, గృహ నిర్మాణశాఖ మంత్రి
మల్లన్నకు పాగా.. అమ్మవారికి చీర
15 ఏళ్లుగా చేనేత వృత్తిలో ఉన్నా. శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి పాగా నేసి స్వయంగా అందజేస్తాం. అమ్మవారి ఉత్సవాలకు కూడా మా నేతన్న చీరలే అందచేస్తాం. నేతన్న నేస్తమే కాకుండా అమ్మఒడి, సున్నావడ్డీ కూడా అందాయి.
– సజ్జా కుమారి, లబ్ధిదారు, బ్రహ్మపురం, పెడన
రూ.100 కోట్లు వ్యాపారం లక్ష్యం
నేతన్నలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పాదయాత్ర హామీకి కట్టుబడి సీఎం జగన్ నేతన్నలను ఆదుకుంటున్నారు. ఈ– కామర్స్, ఆప్కో ద్వారా ఈ ఆర్థ్ధిక సంవత్సరంలో రూ.100 కోట్లు వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్ణయించాం.
– గుడివాడ అమర్‌నాథ్, చేనేత, జౌళి, పరిశ్రమలశాఖ మంత్రి
మగ్గాన్ని ఆధునికీకరించుకున్నా
20 ఏళ్లుగా చేనేత వృత్తిలో ఉన్నా. నేతన్న నేస్తం డబ్బులతో గోతిలో ఉన్న మగ్గాన్ని స్టాండ్ మగ్గంగా మార్చుకోవటమే కాకుండా మరింత ఆధునికీకరించుకున్నా. నాకు ఇద్దరు పిల్లలున్నారు. అమ్మఒడి, విద్యా కానుక కిట్లు అందాయి. ఇంగ్లీష్ మీడియం విద్యతో మా పిల్లలకు ఎంతో మేలు చేస్తున్నారు.
– కొసనం వాసు, లబ్ధిదారు, పోలవరం, గూడూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment