ఐటీసీ హోటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్. చిత్రంలో మంత్రులు, ఐటీసీ చైర్మన్ సంజీవ్ తదితరులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సమూల మార్పులు గమనించవచ్చని, అభివృద్ధి కళ్లెదుట కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. బుధవారం ఆయన గుంటూరు విద్యానగర్‌లో నూతనంగా నిర్మించిన ఐటీసీ వెల్కమ్ హోటల్‌ను ప్రారంభించారు. హోటల్ ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన రిబ్బన్‌ను కత్తిరించి, జ్యోతి వెలిగించారు.
అనంతరం హోటల్‌లోని కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సభలో మాట్లాడుతూ.. గుంటూరు వంటి నగరంలో ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభించటం మంచి పరిణామం అని, చాలా సంతోషంగా ఉందన్నారు. ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజివ్ పూరికి ధన్యవాదాలు తెలిపారు. ఐటీసీతో భాగస్వామ్యం ఒక మంచి అవకాశం అని చెప్పారు. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఐటీసీతో కలిసి ముందుకు వెళుతోందన్నారు.
ఐటీసీ వెల్కమ్ హోటల్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఉన్నాయని, దాదాపు 10,700 ఆర్బీకేలు విత్తనం నుంచి విక్రయం వరకు రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పులే ఆర్బీకేల ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ రంగంలో ప్రాథమిక స్థాయిలో.. ప్రత్యేకించి గ్రామ స్థాయిలో ప్రాసెసింగ్, మౌలిక సౌకర్యాలు కల్పించామని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో సెకండరీ స్థాయిలో ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో ఐటీసీ ముందుకు వచ్చి భాగస్వామ్యం కావడం ద్వారా కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.
కొత్తగా ప్రారంభించిన ఐటీసీ వెల్కమ్ హోటల్
ఐటీసీతో దృఢమైన భాగస్వామ్యం
గుంటూరు పట్టణంలో ఫైవ్ స్టార్ హోటల్ రావడం చాలా మంచి పరిణామమని, దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో తొలి లీడ్ ప్లాటినం సర్టిఫైడ్ ఫైవ్ స్టార్ హోటల్ కావడం సంతోషించదగిన విషయం అన్నారు. ఐటీసీతో మరింత దృఢంగా, పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నామని చెప్పారు. ప్రధానంగా పర్యాటక, వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఐటీసీతో భాగస్వామ్యం దీర్ఘకాలం కొనసాగుతుందని బలంగా నమ్ముతున్నామని వివరించారు. అంతకు ముందు సీఎం.. మంత్రులు మేకతోటి సుచరిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ, జిల్లా కలెక్టరు వివేక్ యాదవ్, ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరితో కలసి హోటల్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప సభాపతి కోన రఘుపతి, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment