బెంజిసర్కిల్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి బొత్స, తలశిల రఘురాం, కలెక్టర్ నివాస్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడలోని బెంజి సర్కిల్‌లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌తో కలిసి ఈ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత, చెత్త రహితంగా తీర్చిదిద్దడమే క్లాప్–జగనన్న స్వచ్ఛ సంకల్పం లక్ష్యమని చెప్పారు.
రాష్ట్రంలో ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన, ఆరోగ్యకర పరిసరాలు కల్పించి తద్వారా జీవన ప్రమాణాలు పెంచాలనే ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా మునిసిపాలిటీల పరిధిలో జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1,500 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించనున్నట్లు తెలిపారు. తడి, పొడిచెత్తను వేరుచేసి సేకరించేందుకు వీలుగా పట్టణాల్లో ప్రతి ఇంటికి మూడు వంతున మొత్తం 1.20 కోట్ల నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగు చెత్తబుట్టలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని చెప్పారు. కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ క్లాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి 2,600 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. స్థానిక శాసనసభ్యుడు మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫైబర్‌గ్రిడ్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, కేడీసీసీబీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఎండీ సంపత్ కుమార్, సీపీ బత్తిన శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
క్లాప్ అమలుపై నేడు కలెక్టర్లతో మంత్రి పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలతో పాటు అన్ని గ్రామాల్లోను మెరుగైన పారిశుధ్యంæ ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం నినాదంతో అక్టోబరు 2వ తేదీ నుంచి ప్రభుత్వం ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనుంది. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ఇళ్ల వద్ద పోగయ్యే చెత్తను ఇష్టానుసారం పడవేయకుండా పరిశుభ్రత ప్రతి ఒక్కరి అలవాటుగా మార్పు తెచ్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీగా పారిశుధ్య కార్యక్రమాల ప్రణాళికను అమలు చేయనుంది. గాంధీ జయంతి రోజునే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కార్యక్రమం అమలుకు సంబంధించి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment