చదువుతో ఎదుగుదాం  | CM YS Jagan Launched Fourth Phase Jagananna Vidya Deevena | Sakshi
Sakshi News home page

చదువుతో ఎదుగుదాం 

Published Fri, May 6 2022 3:47 AM | Last Updated on Fri, May 6 2022 7:18 AM

CM YS Jagan Launched Fourth Phase Jagananna Vidya Deevena - Sakshi

కంప్యూటర్‌ బటన్‌ నొక్కి విద్యాదీవెన సొమ్మును తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, తిరుపతి: పేదరికాన్ని నిర్మూలించే శక్తి చదువులకు మాత్రమే ఉందని, పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి కూడా అదేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆర్థిక కష్టాలు, అవమానాలను తాను పాదయాత్రలో స్వయంగా చూసి పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, విద్యాకానుక, అమ్మ ఒడి లాంటి పథకాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. జగనన్న విద్యాదీవెన 2021–22 నాలుగో త్రైమాసికం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 10,85,225 మంది విద్యార్థులకు మేలు చేకూరుస్తూ రూ.709.20 కోట్లను 9.73 లక్షల మంది తల్లుల ఖాతాల్లో గురువారం తిరుపతిలో బటన్‌ నొక్కి సీఎం జగన్‌ నేరుగా జమ చేశారు. ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం జగన్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. 

నీరుగార్చిన నిర్వాకం చంద్రబాబుదే.. 
పెద్ద చదువులు ఒక మనిషి చరిత్రనే కాకుండా కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశ చరిత్రను మారుస్తాయి. మన తలరాతలను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. అది ఎవరూ దొంగిలించలేని ఆస్తి. గతంలో నాన్న వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తెచ్చి విద్యార్థుల ఉన్నత చదువులకు బాట వేశారు. తర్వాత వచ్చిన పాలకులు పిల్లల చదువుల గురించి, తల్లిదండ్రుల కష్టాల గురించి పట్టించుకోలేదు. ఫీజుల పథకాన్ని చంద్రబాబు పూర్తిగా నీరు గార్చారు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అవస్థ పడటం, ఆ దుస్థితిని చూడలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, ఆ కుటుంబాల దయనీయ పరిస్థితిని నా పాదయాత్రలో స్వయంగా చూశా. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా గత మూడేళ్లుగా వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. 

చదువులకు నాదీ బాధ్యత 
ఈరోజు.. మీబిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఈ పథకాలను ఎలా అమలుæ  చేస్తున్నాడు? ఎలాంటి మార్పులు తెచ్చాడు? అనేది మీరంతా గుండెలపై చేయి వేసుకుని ఆలోచన చేయాలి. ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డలను చదివించాలి. వారికి నేను అండగా ఉంటా. పిల్లల చదువుల బాధ్యతను నేను తీసుకుంటున్నా. ప్రతి  ఇంటి నుంచి గొప్ప ఇంజనీరు, డాక్టరు, కలెక్టర్‌ వస్తారని నమ్ముతున్నా. ఈ మాట నాలో ఎంతో ఉత్తేజాన్ని, సంతోషాన్ని ఇస్తోంది. పేద పిల్లల చదువులకు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించండి. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ప్రతి త్రైమాసికం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. గత సర్కారు అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా సక్రమంగా చెల్లించలేదు. 2017–18, 2018–19లో రూ.1,778 కోట్లు కట్టకుండా ఎగ్గొడితే మీ జగనన్న ప్రభుత్వం వచ్చాక చెల్లించింది.  

నాడు అడుగడుగునా నిర్లక్ష్యం.. 
అధికారంలో ఉండగా ప్రభుత్వ పాఠశాలల మూసివేత లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరించారు. పిల్లల డ్రాపౌట్లకు కారణం ఏమిటో చంద్రబాబు ఒక్కరోజైనా ఆలోచించారా? చదువుల పట్ల అడుగడుగునా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. మధ్యాహ్న భోజనాన్ని నిర్వీర్యం చేసిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. గత సర్కారు దీనికి ఏటా రూ.600 కోట్లు ఖర్చు చేయగా ఇప్పుడు జగనన్న గోరుముద్ద ద్వారా రూ.1,900 కోట్లు చెల్లిస్తున్నాం. 

విద్యారంగంలో సత్ఫలితాలు 
విద్యారంగంపై మన ప్రభుత్వం రూ.వేల కోట్లను వెచ్చిస్తుండటంతో గత మూడేళ్లలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులు, సత్ఫలితాలను మనమంతా చూస్తున్నాం. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో 2018–19లో 37.20 లక్షల మంది మాత్రమే చదువుతుండగా ఇప్పుడు ఆ సంఖ్య 44.39 లక్షలకు పెరిగిందని గర్వంగా చెబుతున్నా. తల్లులకు నమ్మకం కలిగించడం, పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడం లాంటి చర్యల ద్వారా ఈ సత్ఫలితాలు వచ్చాయి. 

గతంలో ఇవన్నీ ఉన్నాయా..? 
► జగనన్న విద్యాదీవెన మాదిరిగా గతంలో వందశాతం ఫీజు రీయింబర్స్‌ ఇచ్చారా? అని సభలో సీఎం ప్రశ్నించగా.. లేదు.. లేదు.. అని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రతిస్పందించారు.  
► పెద్ద చదువులు చదివే వారికి వసతి, భోజనం సదుపాయాలు కల్పించే జగనన్న వసతి దీవెన, అమ్మ ఒడి లాంటి పథకాలు గత సర్కారు హయాంలో ఉన్నాయి? అని ప్రశ్నించగా.. లేదని విద్యార్థులు నినదించారు.  
► ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, సదుపాయాల గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? అని అడగ్గా.. లేదు.. లేదు... అంటూ సభలో నినాదాలు హోరెత్తాయి. 

పిల్లల చదువులకు ఎంత ఖర్చు చేశామంటే.. 
► మనబడి నాడు–నేడు ద్వారా తొలివిడతలో 15,715 పాఠశాలలను రూపురేఖలను  మార్చేందుకు రూ.3,698 కోట్లు వ్యయం. రెండో విడత కింద 26,451 పాఠశాలల్లో రూ.8,122 కోట్లతో మౌలిక వసతుల కల్పన లక్ష్యం.  
► జగనన్న విద్యాకానుక కింద 47.32 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరుస్తూ రూ.1500 కోట్లు వ్యయం. విద్యా దీవెన అమలుకు మరో రూ.900 కోట్లు. 
► జగనన్న గోరుముద్ద ద్వారా 44 లక్షల మంది పిల్లలకు రూ.1,900 కోట్లతో  పౌష్టికాహారం.   
► డాక్టర్‌ వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా 34.20 లక్షల మంది గర్బిణిలు, బాలింతలు, చంటిబిడ్డల కోసం రూ.1,800 కోట్లు వ్యయం. 35 నెలల్లో సంపూర్ణ  పోషణ పథకం కింద రూ.4,900 కోట్లు ఖర్చు.  
► అమ్మఒడి ద్వారా ఇప్పటికే తల్లుల ఖాతాల్లోకి రూ.13,023 కోట్లు జమ. జూన్‌లో మరో రూ.6,400 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం.  
► అధికారంలోకి వచ్చిన 35 నెలల్లోనే వివిధ పథకాల ద్వారా రూ.1,38,894 కోట్లు నేరుగా పారదర్శకంగా ఖాతాల్లోకి జమ చేసి లబ్ధి చేకూర్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే.   

చదువుకు ఎంతో సహకారం
మాది సామాన్య రైతు కుటుంబం. ఇద్దరం ఆడపిల్లలం. ఆర్థిక స్తోమత లేకపోవడంతో మమ్మల్ని చదివించడం అమ్మానాన్నకు కష్టంగా మారింది. ఇంటర్‌ తర్వాత కష్టపడి ఇంజనీరింగ్‌లో చేరా. ఫస్టియర్‌లో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వంలో రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చింది. ఇంకా మూడేళ్లు ఎలా చదవాలా? అని దిగులు చెందుతున్న సమయంలో జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద నాకు రూ.73,900 ఫీజురీయింబర్స్‌మెంట్‌ వచ్చింది. అలాగే జగనన్న వసతి దీవెన కింద మరో 20,000 అందాయి. మా చెల్లికి అమ్మఒడి పథకం కింద రూ.15,000 లబ్ధి చేకూరింది. మా నాన్నకు వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా రూ.13,500 వచ్చింది. మా అవ్వకి ప్రతి నెలా రూ.2,500 పింఛను ఇస్తున్నారు. మా అమ్మ డ్వాక్రా సంఘంలో ఉండటంతో ఆ ప్రయోజనాలు కూడా మా కుటుంబానికి అందుతున్నాయి. ప్రస్తుతం నేను తిరుపతిలో ఫైనల్‌ ఇయర్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నా. ఇటీవల నిర్వహించిన ప్లేస్‌మెంట్స్‌లో మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యాను. ఇంతకన్నా నాకు ఇక ఏంకావాలి.. జగనన్న? మీరు తీసుకొచ్చిన దిశ యాప్‌ మేము బయటకు వెళ్లి జీవించడానికి ధైర్యాన్ని ఇస్తోంది. మేమంతా మీకు జీవితాంతం రుణపడి ఉంటాం అన్నా. 
– ఇందుమతి, ఇంజనీరింగ్‌ విద్యార్థిని 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement