ఒక్కో అక్క చెల్లెమ్మకు రూ. 5 లక్షల నుంచి 15 లక్షల ఆస్తి: సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan Launched YSR Jagananna Colonies Project Works | Sakshi
Sakshi News home page

ఒక్కో అక్క చెల్లెమ్మకు రూ. 5 లక్షల నుంచి 15 లక్షల ఆస్తి: సీఎం వైఎస్‌ జగన్‌

Published Thu, Jun 3 2021 11:33 AM | Last Updated on Fri, Jun 4 2021 3:06 AM

CM YS Jagan Launched YSR Jagananna Colonies Project Works - Sakshi

ప్రతి పేదవాడికి మామూలు ఇల్లు కాకుండా మంచి వసతులతో ఇంటిని ఇవ్వడం కోసం అడుగులు ముందుకు వేస్తున్నాం. తద్వారా నిరుపేదలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు.. అగ్ర కులాల్లో ఉన్న పేద అక్క చెల్లెమ్మలందరి సొంతింటి కల నెరవేరుస్తున్నాం. ప్రతి ఇంటికి మౌలిక సదుపాయాల కోసం రూ.1.5 లక్షలు, ఇంటి నిర్మాణ వ్యయం రూ.1.80 లక్షలు, స్థలం రేటు ప్రాంతాన్ని బట్టి రూ.2 లక్షలు మొదలు దాదాపు రూ.7 లక్షల వరకు ఉంది. ఆ విధంగా ఒక్కో అక్క చెల్లెమ్మకు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తిని ఇంటి రూపంలో ఇస్తున్నాం.    – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఒక్క నిరుపేద కూడా ఉండకూడదు.. ఒక కోటి 24 లక్షల మంది పేదలు నివసించేందుకు వీలుగా ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. తద్వారా ఒక్కో అక్క చెల్లెమ్మ చేతిలో ఐదు లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల విలువగల ఆస్తి పెడుతున్నాం. ఇదివరకెన్నడూ లేని విధంగా రెండు దశల్లో రూ.50,944 కోట్లతో 28 లక్షలకు పైగా ఇళ్లు కట్టిస్తున్నాం. ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డు’ అని  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కింద రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో తొలి దశలో ఒకే సారి రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాలకు గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల సొంతింటి అన్న పేదవాడి కలను నిజం చేస్తున్నామని, 175 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణంలో మొదటి దశ కార్యక్రమానికి ఇవాళ పునాదులు వేస్తున్నామని చెప్పారు. అన్ని కాలనీల్లో రూ.32,909 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పిస్తున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణ ప్రారంభ మహోత్సవం ఒక పండగ వాతావరణంలో ఈ నెల 10వ తేదీ వరకు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు 
ఆప్షన్‌–1 : ఇంటి నిర్మాణ సామగ్రి, లేబర్‌ చార్జీలు ప్రభుత్వం ఇస్తుంది. లబ్ధిదారులే ఇల్లు నిర్మించుకుంటారు.
ఆప్షన్‌–2 : ఇంటి నిర్మాణ సామగ్రి అక్క చెల్లెమ్మలు సొంతంగా తెచ్చుకుంటే దశల వారీగా పనుల పురోగతిని బట్టి ఆ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తాం. ఆ విధంగా స్వయంగా ఇళ్లు నిర్మించుకోవచ్చు.
ఆప్షన్‌–3 : అక్క చెల్లెమ్మలు ఇల్లు కట్టుకోలేమంటే, ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకుని ఇల్లు కట్టిస్తుంది.
– గతంలో ఇల్లు కేవలం 200 అడుగులు మాత్రమే ఉంటే ఇవాళ 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. వరండా, బెడ్రూమ్, హాలు, కిచెన్, బాత్‌రూమ్, రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు, 4 ఎల్‌ఈడీ బల్బులు, ఒక సింటెక్స్‌ ట్యాంక్‌ కూడా ఇస్తున్నాం.
– ప్రతి ఇంటికి అవసరమైన 20 టన్నుల ఇసుకను లబ్ధిదారులకు ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తున్నాం. 

లక్షలాది మందికి పని.. ఎకానమీ బూస్ట్‌ 
– తొలి దశలో కడుతున్న 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను బూస్ట్‌ చేస్తుంది. కోవిడ్‌ వల్ల చాలా రాష్ట్రాల ఆర్థిక స్థితి పడిపోయింది. జీఎస్‌డీపీలు తగ్గిపోయాయి. ఉత్పత్తి రంగం పడిపోయింది. కానీ మన దగ్గర ఈ ఇళ్ల నిర్మాణం వల్ల ఎకనామిక్‌ యాక్టివిటీ బూస్టప్‌ అవుతుంది.  
– ఈ ఇళ్ల నిర్మాణం కోసం 69.70 లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంట్, 7.44 లక్షల మెట్రిక్‌ టన్నుల స్టీల్, 310 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక, 233 కోట్ల ఇటుకలు, 223 లక్షల మెట్రిక్‌ టన్నుల మెటల్‌ వినియోగం ఉంటుంది.
– ఇంకా ఈ ఇళ్ల నిర్మాణం వల్ల కార్మికులకు 21.70 కోట్ల పని దినాలు లభిస్తాయి. ప్రస్తుతం కోవిడ్‌తో పెద్దగా పని లేకుండా పోయిన తాపీ మేస్త్రీలు, రాడ్‌ బెండర్లు, కార్పెంటర్లు కూలీలు, ఇటుకల తయారీదారులు, ఎలక్ట్రీషియన్లు.. ఇలా దాదాపుగా 30 రకాల పనులు చేసే వారికి సొంత ఊళ్లలోనే ఉపాధి లభిస్తుంది.

తక్కువ ధరకే నాణ్యమైన సామగ్రి
– మార్కెట్‌ కంటే నాణ్యమైన ధరకు నిర్మాణ సామగ్రిని అందించేలా చర్యలు తీసుకున్నాం. అందు కోసం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాం. సిమెంట్‌ ధర తగ్గించి బస్తా కేవలం రూ.225కే అందిస్తున్నాం. స్టీల్‌ కూడా తక్కువ ధరకు, క్వాలిటీ సామగ్రి ఇచ్చేలా చూశాం. 
– ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ రోజు ప్రతి జిల్లాలో నాలుగవ జేసీని నియమిస్తున్నాం. వీరు ఈ కార్యక్రమాన్ని ఓన్‌ చేసుకుని, ప్రతిదీ పర్యవేక్షిస్తారు. 

వారికి కూడా న్యాయం చేస్తాం
– రాష్ట్రంలో 3.74 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు సంబంధించిన స్థలాలపై కొందరు దుర్బుద్దితో కోర్టుల్లో కేసులు వేశారు. ప్రస్తుతం కోర్టులకు సెలవులు. ఈనెల 13న కోర్టులు తెరుస్తారు. అప్పుడు దీన్ని ప్రాధాన్యతగా తీసుకుని, ఈ అక్క చెల్లెమ్మలందరికీ న్యాయం చేయడానికి మీ తమ్ముడు, మీ అన్న జగన్‌ ప్రయత్నిస్తాడని తెలియజేస్తున్నాను.
– ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

 

గృహ ప్రవేశానికి మీరు రావాలన్నా..
నేను పుంగనూరులో 15 ఏళ్లుగా అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నా. నా జీవితంలో సొంతింట్లో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. మీ వల్ల నా సొంతింటి కల నెరవేరుతోంది. నా పిల్లలు మా మేనమామ ఇల్లు ఇచ్చాడు అని సంతోషంగా ఉన్నారు. నాకు ఇచ్చిన స్థలం విలువ రూ.4 లక్షలు అవుతుందన్నా.. నిర్మాణం కోసం నాణ్యమైన సామగ్రి ఇస్తున్నారు. నాది ఒక చిన్న కోరిక అన్నా.. మీరు మా గృహ ప్రవేశానికి రావాలని కోరుకుంటున్నా అన్నా. 
– అమరావతి, పుంగనూరు, చిత్తూరు జిల్లా


ఎవరి సిఫారసు లేకుండా మంజూరైంది
నేను ఏ నాయకుడి దగ్గరకు వెళ్లలేదు. మా వలంటీర్‌ దగ్గర దరఖాస్తు చేయగానే ఇల్లు మంజూరు అయింది. ఈ కరోనా కాలంలో కూడా మేం తినగలుగుతున్నామంటే మీ వల్లే అన్నా. మాది పేద కుటుంబం అన్నా. అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడేవాళ్లం. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నా, స్థలం ఇవ్వలేదు. మీరు మా పేదల పాలిట దేవుడిలా లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. నేను ఇల్లు స్వయంగా కట్టుకుంటున్నా. 
– అపరంజని, మార్టేరు గ్రామం, ప.గో.జిల్లా 


మౌలిక వసతులకు రూ.33 వేల కోట్లు 
– ప్రణాళిక బద్ధమైన గ్రామాలు, పట్టణాలుగా నిర్మితమవుతున్న ఈ 17,005 వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో దాదాపు రూ.4,128 కోట్ల వ్యయంతో తాగు నీరు సరఫరా చేయబోతున్నాం. రూ.22,587 కోట్ల వ్యయంతో కాలనీల్లో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ.. మరో రూ.4986 కోట్లతో భూగర్భ కేబుళ్లతో విద్యుత్‌ కనెక్షన్లు..  ఇవన్నీ కాకుండా మరో రూ.627 కోట్ల వ్యయంతో భూగర్భ కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించబోతున్నాం.
– పార్కులు, స్కూళ్లు, సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌ల వంటి వాటి కోసం మరో రూ.567 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మొత్తంగా 30 లక్షల ఇళ్లకు అన్ని మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు ఖర్చు చేస్తున్నాం.



 

పేదవాడి కల నిజం చేస్తున్నాం
– తొలి దశ కింద రూ.28,084 కోట్ల వ్యయంతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ఇవాళ మొదలు పెడుతున్నాం. ఏడాదిలో అంటే జూన్‌ 2022 నాటికి పూర్తి చేసే విధంగా కార్యక్రమం రూపొందించాం. రెండో దశలో 12.70 లక్షల ఇళ్లను రూ.22,860 కోట్లతో వచ్చే ఏడాది జూన్‌లో మొదలు పెడతాం. 
– ఆ విధంగా మొత్తం రూ.50,944 కోట్ల వ్యయంతో 28.30 లక్షల ఇళ్లు జూన్‌ 2023 నాటికి పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నాం. 30 లక్షల ఇళ్ల స్థలాలు సేకరించడమే కాకుండా, పీఎంఏవైతో వాటిని అనుసంధానం చేసి, ఇళ్ల నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తున్నాం.

ఇళ్లు కాదు.. ఊళ్లు, పట్టణాలు 
– మనం కడుతోంది కేవలం ఇళ్లు కాదు.. ఊళ్లు, పట్టణాలు అని చెప్పొచ్చు. ఏకంగా 17 వేల కాలనీలు ఇప్పుడు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. 
– ఇవి కాక సొంత స్థలాలు, పొజిషన్‌ సర్టిఫికెట్లు ఉన్న లబ్ధిదారులు మరో 4.33 లక్షల మందిని కలుపుకుని మొదటి దశలో మొత్తం 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి నాంది పలికాం. 
– 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా దాదాపు 4.95 కోట్లు. ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కూడా కట్టిస్తోంది. ఒక్కో ఇంట్లో నలుగురు ఉంటారనుకుంటే, మొత్తం 1.24 కోట్ల మందికి మనం ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. ఈ లెక్కన రాష్ట్రంలో పెద్దవైన 3 లేక 4 జిల్లాల్లో ఉన్నంత జనాభాకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు, ఇళ్లు కట్టిస్తున్నాం. 
 

చదవండి: సీఎం జగన్‌కు ప్రవాసాంధ్రుల కృతజ్ఞతలు
వచ్చే ఖరీఫ్‌కు పోలవరం నీళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement