రైతన్నకు ‘యంత్రం’ | CM YS Jagan Launched YSR Yantra Seva Scheme For Farmers | Sakshi
Sakshi News home page

రైతన్నకు ‘యంత్రం’

Published Wed, Jun 8 2022 4:03 AM | Last Updated on Wed, Jun 8 2022 8:47 AM

CM YS Jagan Launched YSR Yantra Seva Scheme For Farmers - Sakshi

గుంటూరులో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవంలో ట్రాక్టర్‌ నడుపుతున్న సీఎం జగన్‌

నాడు– నేడు.. తేడా చూడండి
గతానికి, ఇప్పటికి ఎంత తేడా ఉందో గమనించాలని ప్రతి రైతన్ననూ కోరుతున్నా. గతంలో చంద్రబాబు హయాంలో అరకొరగా ట్రాక్టర్లు ఇచ్చారు. అయితే రైతులు ఎవరూ ట్రాక్టర్ల కోసం ఆర్డర్లు ఇవ్వలేదు. నాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు కలసికట్టుగా ట్రాక్టర్ల డీలర్లతో కుమ్మక్కై స్కామ్‌లు చేశారు. 

ఈ రోజు ట్రాక్టర్‌ దగ్గర నుంచి ఏ పనిముట్టు కావాలన్నా నేరుగా రైతుల ఇష్టానికే వదిలిపెట్టాం. రైతు  తనకు నచ్చిన కంపెనీ ట్రాక్టర్, తనకు నచ్చిన పనిముట్టును తానే ఆర్డర్‌ ప్లేస్‌ చేస్తాడు. 175 రకాల ట్రాక్టర్ల మోడళ్లలో రైతు తనకు నచ్చింది కొనుగోలు చేసే అవకాశం కల్పించాం. ప్రభుత్వం రైతుకు సబ్సిడీ ఇస్తుంది. అందులో భాగంగానే ఇవాళ రూ.175 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. అవినీతి లేకుండా వ్యవస్థను ఎలా ప్రక్షాళన చేస్తున్నామో గమనించండి.   
 – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, గుంటూరు: అన్నదాతల సాగు అవసరాలను తీర్చి తక్కువ ధరకే వ్యవసాయ ఉపకరణాలను సమకూర్చే వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం గుంటూరు వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. రాష్ట్ర స్థాయి మెగా పంపిణీలో భాగంగా 3,800 ఆర్బీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 క్లస్టర్‌ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీని సీఎం జగన్‌ జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం 5,260 రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాలకు రూ.175 కోట్ల సబ్సిడీని బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా గుంటూరు చుట్టుగుంట వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. ఆ వివరాలివీ..
ఆర్బీకే పరిధిలో సరసమైన ధరలకే..
విత్తనం నుంచి పంట విక్రయం వరకు ప్రతి దశలోనూ రైతన్నలకు తోడుగా ఉండేందుకు ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలను నిర్మించాం. ఈరోజు మరో గొప్ప కార్యక్రమం మొదలైంది. వ్యవసాయాన్ని ఇంకా మెరుగుపరిచేందుకు రాష్ట్రంలోని 10,750 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలలో అన్నదాతలకు కావాల్సిన పనిముట్లన్నీ తక్కువ ధరకు లభించేలా రైతులతో గ్రూపులు ఏర్పాటు చేసి ప్రభుత్వం తరఫున 40 శాతం రాయితీ ఇస్తున్నాం.

మరో 50 శాతం రుణాలను బ్యాంకులతో మాట్లాడి తక్కువ వడ్డీకే మంజూరు చేయిస్తున్నాం. రైతులు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు చెల్లిస్తే చాలు. వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లతో సహా ఉపకరణాలన్నీ వారికి గ్రామంలోనే ఆర్బీకేల పరిధిలో సరసమైన ధరలకే అందుబాటులో ఉంటాయి. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం.

ఇందులో భాగంగా ఈరోజు రూ.2,016 కోట్లతో ప్రతి ఆర్బీకే స్థాయిలో రూ.15 లక్షలు విలువగల 10,750 వైఎస్సార్‌ యంత్రసేవా కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నాం. ఇవి కాకుండా వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.25 లక్షలు విలువైన కంబైన్‌ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్‌ స్థాయి యంత్రసేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నాం.
వైఎస్సార్‌ యంత్ర సేవా పథకంలో జెండా ఊపి  వాహనాలను ప్రారంభిస్తున్న సీఎం జగన్‌ 

రాబోయే రోజుల్లో 10,750 ఆర్బీకేల్లోనూ సేవలు..    
ఇవాళ ఆర్బీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లను అందజేస్తున్నాం. రాబోయే రోజుల్లో 10,750 ఆర్బీకేలకు ఈ సేవలన్నీ విస్తరిస్తాయి. ఈ రోజు 3,800 ట్రాక్టర్లతో పాటు 1140 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలను  అందిస్తున్నాం. క్లస్టర్‌ స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీ జరుగుతోంది.

5,260 రైతు గ్రూపుల బ్యాంకుల ఖాతాల్లోకి రూ.590 కోట్ల విలువైన ఉపకరణాలకు సంబంధించి రూ.175 కోట్ల సబ్సిడీని కూడా బటన్‌ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా నేడు పంపిణీ చేస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాలతో కలిపి 6,780 ఆర్బీకేలు, 391 క్లస్టర్‌ స్థాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లకు దాదాపు రూ.700 కోట్ల విలువైన ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసినట్లవుతోంది.

సంవత్సరం తిరగక ముందే రూ.2,016 కోట్ల విలువ చేసే వ్యవసాయ పరికరాలను ఆర్బీకేల పరిధిలో రైతుల చేతుల్లో పెట్టబోతున్నాం. ఇవన్నీ దేవుడి దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతోనే సాధ్యమైంది. ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు
ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధనరెడ్డి, అంబటి రాంబాబు, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, విడదల రజని, ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకట రమణారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, కల్పలతారెడ్డి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, మద్దాళి గిరిధర్, నంబూరి శంకరరావు, అన్నాబత్తుని శివకుమార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), మేకతోటి సుచరిత, ఉండవల్లి శ్రీదేవి, ముస్తఫా, కిలారు రోశయ్య, ఉన్నతాధికారులు వై. శ్రీలక్ష్మి, పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, ప్రవీణ్‌కుమార్, హరికిషన్, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు పాల్గొన్నారు.  

హరిత నగరాలు.. జిందాల్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఆ«ధ్వర్యంలో నిర్వహించే జగనన్న హరిత నగరాలు కార్యక్రమం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం కొండవీడులో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్‌ రావి, వేప మొక్కలను నాటారు.

అనంతరం రూ.345 కోట్ల వ్యయంతో నిర్మించిన జిందాల్‌ అర్బన్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పవర్‌ ప్లాంట్‌ను ప్రారంభించి పైలాన్‌ ఆవిష్కరించారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జిందాల్‌ ప్లాంట్‌ నమూనాను పరిశీలించారు. ప్లాంట్‌ నిర్వహణ, చెత్త వినియోగించి విద్యుదుత్పత్తిపై జిందాల్‌ ప్రతినిధుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు
వైఎస్సార్‌ యాంత్రీకరణ పథకంతో రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. ప్రస్తుతం సాగులో కూలీల కొరత అధికంగా ఉంది. రాష్ట్రంలోని ప్రతి రైతుభరోసా కేంద్రానికి యంత్ర పరికరాలు సమకూర్చడం వల్ల వ్యవసాయ పనులు ముమ్మరం చేయవచ్చు. ఇప్పటికే రైతుభరోసా పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అందించారు. రైతుభరోసా డబ్బులు పెట్టుబడికి ఉపయోగపడతాయి. మా గ్రామంలోని ఆర్‌బీకేలో అన్నీ సకాలంలోనే అందుతున్నాయి. సీఎం జగన్‌కు ధన్యవాదాలు.
– అర్చనాల ఉమాశంకర్, బోదనంపాడు గ్రామం, కురిచేడు మండలం, ప్రకాశం జిల్లా 

సీఎంకు రుణపడి ఉంటాం
రైతుల కష్టాలను గుర్తించిన జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మాకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు. రైతుభరోసా పథకం కింద ఏడాదికి రూ.13,500 పెట్టుబడి సాయాన్ని నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లోకి జమచేస్తున్నారు. ఇది ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటోంది. దీంతోపాటు వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద శ్రీరామా సీహెచ్‌సీ గ్రూప్‌ ద్వారా ట్రాక్టర్‌ మంజూరు చేయడం ఆనందంగా ఉంది. ట్రాక్టర్‌ వ్యవసాయానికి చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నా. 
– ఆరాధ్యుల వెంకటేశ్వరరావు, వడ్లమూడి గ్రామం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా

ఆధునిక పరికరాల పంపిణీ బాగుంది
ప్రస్తుత రోజుల్లో వ్యవసాయ యంత్ర పరికరాలను కొనుగోలు చేయాలంటే కష్టతరంగా ఉంటోంది. కానీ వైఎస్‌ జగన్‌ పేద రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేయడం బాగుంది. అది కూడా సబ్సిడీ కింద మంజూరు చేయడం ఎంతో మేలు కలిగిస్తోంది. ఆర్‌బీకేల వద్దే తక్కువ అద్దెకి అందుబాటులోకి తీసుకువచ్చి సాగు వ్యయం తగ్గించి, నికర ఆదాయం పెంచాలనే సమున్నత లక్ష్యంతో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం అమలు చేయడం బాగుంది. 
– జి.శ్రీరామాంజనేయులు, శ్రీనివాస జేఎల్‌సీ గ్రూప్, కంచకోడూరు, గూడూరు మండలం, కృష్ణాజిల్లా

సంతోషంగా ఉంది 
వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులందరూ సంతోషంగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్‌ బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఉచిత బీమా పథకం కింద పూర్తి నష్టపరిహారం అందించడం ఆనందంగా ఉంది. అదేవిధంగా కంబైన్డ్‌ హార్వెస్టర్‌ను రైతులకు మంజూరు చేయించడం బాగుంది. దీనివల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. 
– వీర్ల నాగేశ్వరరావు, శ్రీపైలమ్మ తల్లి గ్రూప్, ప్రత్తిపాడు గ్రామం, పెంటపాడు మండలం, ఏలూరు జిల్లా

పండుగలా వ్యవసాయం
వ్యవసాయం దండగ అంటూ సాగుని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. అన్నదాతలను కడగండ్లపాలు చేసి రైతులను ఇబ్బందులకు గురిచేశారు. గత పాలకుల నాటి దుస్థితిని సీఎం జగన్‌ సమూలంగా మార్చారు. విత్తనం నుంచి పంట విక్రయించేవరకు అన్ని సేవలను రైతుల గడప వద్దనే అందించే వన్‌స్టాప్‌ సెంటర్లుగా వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం శుభపరిణామం. సబ్సిడీ కింద మంజూరు చేసిన ట్రాక్టర్‌ ద్వారా రోజుకి సుమారు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ఆదాయం వస్తుంది. 
– షేక్‌.ఖాసీంషరీఫ్, ఇస్లాం రైతు మిత్ర గ్రూప్, లగడపాడు గ్రామం, పల్నాడు జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement