సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన ‘క్లీన్ ఆంద్రప్రదేశ్ (క్లాప్)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ బెంజి సర్కిల్ వద్ద సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం సీడీని ఆవిష్కరించారు. 4,097 చెత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదంగా గడపాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. క్లాప్‌కార్యక్రమంలో భాగంగా బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే జాతీయస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఉత్తమ ర్యాంక్ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 100 రోజులపాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కొనసాగనుంది.
1.20 కోట్ల డస్ట్ బిన్‌ల పంపిణీ
గృహాల్లోనే తడి, పొడి, ప్రమాదకర (నాప్‌కిన్స్, సూదులు, గ్లౌజ్‌లు, ఎలక్ట్రికల్) చెత్తను వేరు చేసేలా ప్రతి ఇంటికి మూడు డస్ట్ బిన్‌ల చొప్పున క్లాప్ కార్యక్రమంలో భాగంగా మునిసిపాలిటీల్లో ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 123 కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీల్లోని 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల డస్ట్ బిన్‌లు పంపిణీ చేస్తారు. ఇందుకు రూ.100 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తోంది. జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో 1,500 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించనున్నారు. మరింత మెరుగ్గా చెత్త సేకరణ, తరలింపు కోసం 3,097 ఆటో టిప్పర్లు, 1,771 ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయనున్నారు.
ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను 5,868 జీపీఎస్ ఆధారిత గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లకు తరలిస్తారు. 124 మునిసిపాలిటీలలో 231 గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్(జీటీఎస్)లు ఏర్పాటు చేయడంతో పాటు 72 మునిసిపాలిటీలలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఎస్‌డబ్ల్యూఎమ్) ప్రాజెక్టుల కోసం ఏజెన్సీల ఖరారుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. లక్ష పైచిలుకు జనాభా కలిగిన 32 మునిసిపాలిటీలలోని డంప్ సైట్‌లలో వ్యర్థాల నిర్మూలనకు టెండర్లు పిలవాలని మున్సిపాలిటీలను ఆదేశించారు. రాష్ట్రంలోని 65 నాన్ అమృత్ సిటీలలో సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి సేకరించిన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (ఎఫ్‌ఎస్‌టీపీ) ఏర్పాటు చేయనున్నారు.
నిర్వహణకు సిబ్బంది నియామకం..
చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలలో ఎక్కువ భాగం సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ఈ కేంద్రాల వద్ద నలుగురు చొప్పున సిబ్బందిని నియమించి జీతభత్యాలు, నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. కొత్తగా 4,171 చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను నిర్మించనున్నారు.
గ్రామాల్లో 14 వేల త్రిచక్ర వాహనాల పంపిణీ
చెత్త రవాణా కోసం గ్రామ పంచాయతీలకు 14 వేల త్రిచక్ర వాహనాలు పంపిణీ చేస్తారు. చెత్త సేకరణ–రవాణాను మరింత మెరుగుపరిచేందుకు వెయ్యి ఆటోలు సమకూరుస్తారు. వ్యర్థాలను ఉష్ణోగ్రతల వద్ద భస్మం చేసి పర్యావరణ హితంగా మార్చేందుకు 6,417 ఇన్సినరేటర్ పరికరాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ప్రజా మరుగుదొడ్లలో పరిశుభ్రత కోసం 10,731 హై ప్రెజర్ టాయిలెట్ క్లీనర్లు కేటాయించారు. దోమల నివారణకు 10,628 థర్మల్ ఫాగింగ్ మిషన్ల పంపిణీ చేపడతారు. 135 మేజర్ పంచాయతీలలో సమగ్ర ద్రవ వ్యర్థాల నిర్వహణ, 10,645 పంచాయతీలలో వర్మి కంపోస్ట్ నిర్వహణ, నాన్ రీసైక్లింగ్ వ్యర్థాలను సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీలు, సంపద తయారీ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment