YS Jagan Plan to Distribute Laptops Replace of Moeny Under Amma Vodi Scheme - Sakshi
Sakshi News home page

9–12 విద్యార్థులకు ‘అమ్మ ఒడి’ నగదు బదులు ల్యాప్‌ టాప్‌లు

Published Thu, Apr 1 2021 3:50 AM | Last Updated on Thu, Apr 1 2021 12:59 PM

CM YS Jagan Letter To Mothers of students about Amma Vodi - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద 2021–22 విద్యా సంవత్సరం నుంచి అర్హులైన 9–12 తరగతుల విద్యార్థుల తల్లులు కోరుకున్నట్లయితే వారి పిల్లల విద్యా వికాసం కోసం నగదు బదులు ల్యాప్‌టాప్‌లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అర్హులైన తల్లులందరికీ తెలియచేసి, వారి ఆమోదం మేరకు నగదు లేదా ల్యాప్‌టాప్స్‌ను అందించనున్నారు. తల్లుల అభీష్టం తెలుసుకొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా బుధవారం వారికి లేఖ రాశారు. ఈ లేఖను 9–12 తరగతుల విద్యార్థుల తల్లులందరికీ అందించి వారి అభీష్టం తెలుసుకొని తిరిగి ప్రభుత్వానికి తెలియ చేయాలని పాఠశాల విద్యా శాఖ ప్రాంతీయ విద్యాశాఖాధికారులు, జిల్లా విద్యాధికారులకు విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. సీఎం రాసిన లేఖ ప్రతి కాపీని వారందరికీ పంపించి, తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకునేందుకు స్పష్టమైన విధానాన్ని సూచించింది.

► సీఎం రాసిన లేఖను డీసీఈబీల ద్వారా ఏప్రిల్‌ 10వ తేదీలోపు ముద్రించాలి.
► ఆ లేఖను మండల విద్యాధికారుల ద్వారా ప్రభుత్వ, ప్రయివేటు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, కళాశాలల ప్రిన్సిపాళ్లకు విద్యార్థుల సంఖ్య మేరకు ఏప్రిల్‌ 15లోపు అందించాలి.
► ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు 9–12 తరగతుల విద్యార్థులతో ఏప్రిల్‌ 19న సమావేశమై సీఎం లేఖలోని అంశాలను వివరించాలి. విద్యార్థులు ఆ లేఖను ఇళ్లకు తీసుకువెళ్లి తమ తల్లులు లేదా సంరక్షకులకు చూపించి వారి అభీష్టాన్ని లేఖపైన రాయించాలి. తిరిగి ఆ లేఖను ఏప్రిల్‌ 22న ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు అందించాలి.
► విద్యార్థులు అందించిన అంగీకార పత్రంలోని అంశాలను ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ఏప్రిల్‌ 26వ తేదీలోగా ‘అమ్మ ఒడి’ వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. అనంతరం ఆ అంగీకార పత్రాలను పాఠశాల, కళాశాలల రికార్డుల్లో భద్ర పరచాలి.

అక్కచెల్లెమ్మలకు నమస్కారం..
‘జగనన్న అమ్మఒడి’ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుకున్న, అందుకోనున్న ప్రతి అక్క, చెల్లెమ్మకు హృదయ పూర్వకంగా నమస్కరిస్తూ ఈ ఉత్తరం రాస్తున్నాను.
మన రాష్ట్రంలో నిరుపేద తల్లులు పిల్లలను చదివించుకోడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం నేరుగా అందజేస్తే కష్టాలు కొంత వరకైనా తీరతాయని, మీ కలలు నెరవేరుతాయని భావించాను. అందుకోసం నవరత్నాలులో భాగంగా ‘అమ్మఒడి’ పథకం ప్రారంభించి ఆదుకుంటానని మాట ఇచ్చాను. ఆ మాట నిలుపుకుంటూ గత రెండు సంవత్సరాలుగా ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు అర్హులైన, చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.15,000 చొప్పున ఎలాంటి ఆటంకం లేకుండా నేరుగా బదిలీ చేసిన సంగతి మీకు తెలుసు. ఈ పథకం రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశంలోనూ అందరి దృష్టిని ఆకర్షించింది.

పుట్టిన ప్రతి బిడ్డకు అమ్మ ఒడి శ్రీరామరక్ష అయితే చదువులమ్మ బడిలో ఎదిగే పిల్లలకు ‘అమ్మఒడి’ పథకం శ్రీరామరక్ష లాంటిది. అమ్మఒడి ఒక్కటే కాకుండా ‘జగనన్న గోరుముద్ద’, ‘మనబడి నాడు – నేడు’, ‘జగనన్న విద్యా కానుక’ వంటి వినూత్న పథకాలు ప్రవేశ పెట్టి రాష్ట్రంలో ప్రతి పేదబిడ్డ తలరాత మార్చే దిశగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న సంగతి కూడా మీకు తెలుసు.

అయితే, కోవిడ్‌ మహమ్మారి లాంటి సమయంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తే, ప్రభుత్వ బడులలో చదివే పేదింటి పిల్లలు చదువుకు దూరం కావడాన్ని మనమంతా చూస్తున్నాం. ఈ పరిస్థితి మారాలని, ఈ తరం పిల్లలు ఇంగ్లిష్‌ మీడియం, కంప్యూటర్ల వాడకానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో వచ్చే ఏడాది నుంచి 9 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మీరు కోరుకుంటే నగదు బదులు ల్యాప్‌టాప్‌ ఇవ్వాలని నిర్ణయించాం. దీంతో పాటు గ్రామ గ్రామానికి ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తున్నాం. పదేళ్ల తర్వాత ప్రపంచం మరింత ముందుకు పోనున్నది. మారబోయే ప్రపంచంలో ఈ పిల్లలు వెనక బడకూడదనే బాధ్యతతో మీ పిల్లలకు మేనమామగా మీకు ఈ సూచన చేస్తున్నాను.

బ్రాండెడ్‌ ల్యాప్‌టాప్స్‌ డ్యూయెల్‌ కోర్‌ (దానికి సమానమైన ప్రాసెసర్‌), 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 ఇంచుల తెర (స్క్రీన్‌), విండోస్‌ 10 (ఎస్‌టీఎఫ్‌), మైక్రోసాఫ్ట్‌ ఓపెన్‌ ఆఫీస్, 3 సంవత్సరాల వారంటీతో ఉంటుంది. అవసరమైతే 7 రోజులలోనే రీప్లేస్‌మెంట్‌ లేదా రిపేర్‌ బాధ్యత గ్రామ సచివాలయం ద్వారా సంబంధిత కంపెనీ వారే చేస్తారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ (మొబైల్‌ డివైస్‌ మేనేజ్‌మెంట్‌) ఇన్‌స్టాల్‌ చేసి ఇవ్వడం ద్వారా చెడు / హానికర వెబ్‌సైట్స్‌ను నిరోధించి వాటి ప్రభావం పిల్లలపై పడకుండా ఉండేలా చేయడం జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో ల్యాప్‌ టాప్స్‌ కొనుగోలు చేస్తున్నందున మార్కెట్లో దాదాపు రూ.25 వేలు – రూ.27 వేలు ఉన్న బ్రాండెడ్‌ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.18,500కే అందించడం జరుగుతుంది.

ఈ బ్రాండెడ్‌ ల్యాప్‌ టాప్స్‌తో మీ పిల్లలు ఈ కింది విధమైన పనులు చేసుకోవచ్చు.
► ఆన్‌లైన్‌లో పాఠాలు వినొచ్చు.
► ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో చదువుకు సంబంధించి వీడియోలు చూసుకోవచ్చు.
► డిజిటల్‌ రూపంలో ఉన్న పుస్తకాలు చదువుకోవచ్చు.
► ఇంటర్నెట్‌లో చదువుకు సంబంధించి అపారంగా సమాచారాన్ని వెతకొచ్చు.
► ఈ మెయిల్‌ ఇవ్వవచ్చు. పొందవచ్చు.
► మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ వంటి వాటితో ప్రాజెక్టు పనులు చేయవచ్చు. 
కాబట్టి మీ బిడ్డకు ‘అమ్మఒడి’ పథకంలో నగదు బదులు ల్యాప్‌టాప్‌ కోరుకున్నట్లయితే మీ అంగీకారాన్ని ప్రధానోపాధ్యాయుల ద్వారా తెలియజేయవలసినదిగా కోరుతున్నాను. 
- మీ ఆత్మీయ వైఎస్‌ జగన్‌ (వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి) ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement