కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు శ్రీవారి చిత్రపటాన్ని అందజేస్తున్న సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు, అభివృద్ధి వికేంద్రీకరణ, విభజన హామీలు తదితర అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలువురు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన రాత్రి వరకు సమావేశాలతో బిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవ్‌దేకర్‌లతో సమావేశమయ్యారు.
పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణం, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళిక, ప్రత్యేక హోదా సహా పలు విభజన హామీలు, వైద్య కళాశాలలకు అనుమతులు తదితర అంశాలపై మంత్రులతో వేర్వేరు సమావేశాల్లో చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఆయన నివాసంలో రాత్రి 9 గంటల నుంచి 10.35 వరకు సమావేశమై, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సుహృద్భావ వాతావరణంలో సాగిన ఈ సమావేశంలో సీఎం జగన్.. అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లిన వినతుల్లోని వివరాలు ఇలా ఉన్నాయి.
కర్నూలులో హైకోర్టుకు రీ నోటిఫికేషన్ ఇవ్వండి
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య సమతుల్యంతో కూడిన అభివృద్ధికి, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగానే రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరిస్తూ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రతిపాదిస్తూ ప్రణాళిక రూపొందించాం. ఆగస్టు 2020న దీనికి సంబంధించి చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. కర్నూలులో హైకోర్టు స్థాపనకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలి. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు అంశాన్ని బీజేపీ కూడా పొందు పరిచింది.
ప్రత్యేక హోదాతోనే అధిక గ్రాంట్లు
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల కారణంగా రాష్ట్రం సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ దశలో రాష్ట్రాన్ని బలోపేతం చేయాలి. అనేక రంగాల్లో స్వయం సమృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి కేంద్ర గ్రాంట్లు అధికంగా వస్తాయి. అప్పుడు ఆర్థిక భారం తగ్గుతుంది. భారీగా పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాల కల్పన జరగాలన్నా ప్రత్యేక హోదా చాలా అవసరం. అందువల్ల ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోమారు విన్నవిస్తున్నాం.
వైద్య కళాశాలల ఏర్పాటుకు సహకరించాలి
రాష్ట్రంలో ప్రజలందరికీ అందుబాటులో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర విభజన తర్వాత, ఏపీలో మహానగరాలు లేవు. అందుకే కొత్తగా 13 వైద్య కళాశాలల నిర్మాణాన్ని మొదలు పెడుతున్నాం. దీంతోపాటు ఇప్పుడున్న వైద్య కళాశాలలను అభివృద్ధి చేస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వ రంగంలో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. గ్రామీణ, సబ్ అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 3 కళాశాలలకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మిగిలిన కాలేజీలకూ అనుమతులు ఇవ్వాలని కోరాం. మెడికల్ కాలేజీలతోపాటు నర్సింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చి, తగిన ఆర్థిక సహాయం చేయాలి.
విద్యుత్ రంగం రుణాలు రీస్ట్రక్చర్ చేయాలి
విద్యుత్ సంస్కరణల్లో రాష్ట్రం ముందంజలో ఉంది. అలాగే సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో కూడా మెరుగైన స్థితిలో ఉంది. అయితే రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి బాగోలేనందున ఏపీకి తగిన సహాయం చేస్తానని కేంద్ర విద్యుత్ శాఖ చెప్పింది. కుడిగి, వల్లూరు థర్మల్ ప్లాంట్ల నుంచి అధిక ధరకు కొనుగోలు చేస్తున్న విద్యుత్‌ను సరెండర్ చేసే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి. ఈ విద్యుత్ ప్లాంట్ల నుంచి కరెంటు కొనుగోలు ధర చాలా అధికంగా ఉంది. 300 మెగావాట్ల కరెంటు కొనుగోలుపై ఏటా రూ.325 కోట్ల ఫిక్స్‌డ్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది.
కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్లకు ఢిల్లీలో జ్ఞాపికను అందజేస్తున్న సీఎం జగన్
ఇప్పటికే ఆర్థిక భారంతో నడుస్తున్న డిస్కంలకు ఇది చాలా భారం. ఏపీ డిస్కంలు ఈ రెండు ప్లాంట్ల నుంచి 40 ఏళ్ల పాటు కరెంటు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో సరెండర్ కోసం తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ డిస్కంల నుంచి రూ.5,541.78 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా వాటికి తగిన రుణ సదుపాయాలను కల్పించి, తద్వారా ఏపీ జెన్‌కోకు కేంద్ర పన్నుల వాటా నుంచి ఆ డబ్బు వచ్చేలా చూడాలి. రాష్ట్ర విద్యుత్ రంగం దాదాపు రూ.50 వేల కోట్ల అప్పుల్లో ఉంది. ఈ రుణాలను రీ స్ట్రక్చర్ చేయాలి. విశాఖ జిల్లా అప్పర్ సీలేరులో రివర్స్ పంప్ స్టోరేజీ విద్యుత్ పాజెక్టుకు ఆర్థిక సహాయం చేయాలి. 1,350 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టుకు రూ.10,445 కోట్లు ఖర్చు అవుతుంది. కేంద్రం 30 శాతం నిధులను సమకూర్చాలి. త్వరతిగతిన పర్యావరణ అనుమతులు వచ్చేలా చూడాలి.
‘ఉపాధి’ నిధులు ఇవ్వండి
► గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.4,652.70 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. వెంటనే ఈ డబ్బును చెల్లించేలా చూడాలి. సంవత్సరంలో పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలి.
► ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా బియ్యం సబ్సిడీ కింద రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.3,229 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఈ మేరకు సంబంధిత శాఖకు సూచించాలి.
► స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ. 529.95 కోట్ల బకాయిలు ఉన్నాయి. అలాగే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి మరో రూ.497 కోట్లు కూడా పెండింగులో ఉన్నాయి. ఇవి వెంటనే విడుదలయ్యేలా చూడాలి.
► దిశ బిల్లుకు వెంటనే ఆమోదం తెలిపేలా చూడాలి.
► ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు–2020కి ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూముల రీ సర్వే ప్రారంభించాం. అన్ని రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నాం. వెంటనే ఈ బిల్లుకు ఆమోదం తెలిపేలా చూడాలి.
► విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో 250 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ దృష్ట్యా వెంటనే యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి.
పోలవరం సత్వర నిర్మాణానికి సహకరించండి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కోరారు. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అంశంపై విస్తృతంగా చర్చించారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల మండలి సిఫార్సులతోపాటు, కేంద్ర జల శాఖకు చెందిన సాంకేతిక సలహా మండలి (టెక్నికల్ అడ్వైజరీ కమిటీ – టీఏసీ) అంగీకరించిన విధంగా 2017–18 ధరల సూచీ ప్రకారం రూ.55,656.87 కోట్ల మేర పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని కోరారు. 2022 జూన్ నాటికి ప్రాజెక్టు పనులతోపాటు, భూసేకరణ, పునరావాస పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ఈ లక్ష్యం నెరవేరేలా అంచనాలకు సత్వర ఆమోదం తెలపాలని నివేదించారు. జాతీయ ప్రాజెక్టుల విషయంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం నీటి సరఫరాను కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా చూడాలని కోరారు. ఇంకా నివేదించిన అంశాలు ఇలా..
► రాష్ట్ర ప్రభుత్వ వనరుల నుంచి పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నాం. జాప్యం లేకుండా ఆ నిధులను రీయింబర్స్ చేయాలి. రీయింబర్స్‌మెంట్‌ను కాంపోనెంట్ వారీ అర్హతకు పరిమితం చేయరాదు.
► భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణంలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం–2013 ప్రకారం పునరావాస పనులకు రీయింబర్స్ చేయాలి.
► పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం తరలించాలి. హైదరాబాద్‌లో ఇప్పుడు సచివాలయ కార్యకలాపాలు లేవు. ప్రాజెక్టు పర్యవేక్షణ, పరిశీలన కోసం సుదూరంలో ఉన్న హైదరాబాద్ నుంచి రావడం కష్టం అవుతోంది. అందుకే పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలి.
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్‌కు ఢిల్లీలో జ్ఞాపికను అందజేస్తున్న సీఎం జగన్. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం కారులో వెళుతున్న సీఎం జగన్
మంత్రి షెకావత్ సానుకూల స్పందన
అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి షెకావత్.. సమావేశం అనంతరం ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి తనతో సమావేశమయ్యారని, జలశక్తి సంబంధిత ప్రాజెక్టుల అమలుపై చర్చించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వంద శాతం ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ఏర్పాటు లక్ష్య సాధనలో సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. వచ్చే వారం కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో భేటీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సుమారు అరగంట పాటు సాగింది. పోలవరం ప్రాజెక్టులో స్టాకింగ్ పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల్లో చిన్న చిన్న అంశాలు మిగిలిపోయాయని, వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఇళ్ల నిర్మాణంలో మౌలిక సదుపాయాల ఖర్చు భరించాలి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్‌తో నీతి ఆయోగ్ కార్యాలయంలో గురువారం సాయంత్రం 5.30 నుంచి సుమారు గంటపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చర్చించారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.76 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, ఇందుకోసం 68,381 ఎకరాలను సేకరించామని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ వల్ల 17,005 కొత్త కాలనీలు ఏర్పడ్డాయన్నారు.
ఈ ఏడాది కొత్తగా 15 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నామని, మొత్తంగా 28.30 లక్షల ఇళ్లు పేదల కోసం నిర్మిస్తున్నామని వివరించారు. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం సజావుగా సాగడానికి ప్రతి జిల్లాకు జాయింట్ కలెక్టర్‌ను నియమించామని చెప్పారు. 17,005 కొత్త కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రూ.34,109 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని చెబుతూ, ఇంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోయడం కష్టసాధ్యమని నివేదించారు. ఇళ్లు కట్టి, కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుంటే లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడతారని, ఇళ్లపట్టాల కోసం, నిర్మాణం కోసం పెట్టిన ఖర్చు ప్రయోజనం ఇవ్వదని తెలిపారు. సంబంధిత మంత్రిత్వ శాఖలతో మాట్లాడి ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలకయ్యే ఖర్చును పీఎంఏవైలో భాగంగా చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైనా చర్చించారు. 2017–18 ధరల సూచీ ప్రకారం రూ.55,656.87 కోట్ల మేర ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని కోరారు. 2022 జూన్ నాటికి ప్రాజెక్టు పనులతోపాటు, భూసేకరణ–పునరావాస పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నందున వెంటనే ఈ అంచనాలకు ఆమోదం తెలపాల్సిన అవసరం ఉందని వివరించారు.
రాష్ట్ర పనితీరును ప్రశంసిస్తూ రాజీవ్ కుమార్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ బహుళ రంగాల్లో అద్భుతమైన పనితీరు కనబరుస్తూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో మూడో స్థానాన్ని సాధించిందని సమావేశం ముగిసిన అనంతరం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ట్వీట్ చేశారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రగతి, అభివృద్ధిని అర్థం చేసుకునేందుకు ముఖ్యమంత్రితో సమావేశం ఉపయోగపడిందని పేర్కొన్నారు.
► సీఎం వైఎస్ జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, అవినాశ్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బాలశౌరి, మార్గాని భరత్, గురుమూర్తి, రెడ్డెప్ప, ఎంవీవీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. కాగా, శుక్రవారం ఉదయం కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌లతో ముఖ్యమంత్రితో సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment