సీఎం వైఎస్ జగన్‌ను సత్కరిస్తున్న కోనసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు, సామాజికవర్గాల నేతలు
సాక్షి, అమరావతి: అమలాపురం ఘటనలో నమోదైన కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విభేదాలను రూపుమాపి సామాజిక వర్గాల మధ్య శాంతి, సామరస్యపూర్వక వాతావరణాన్ని పెంపొందించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. ఈమేరకు అమలాపురం ఘటనలో నమోదైన కేసులను ఉపసంహరించాలని నిర్ణయించారు. సామాజికవర్గాల మధ్య సామరస్యాన్ని సాధించి ఐకమత్యాన్ని పెంపొందించేలా సీఎం జగన్ తీసుకున్న చొరవ పట్ల కోనసీమ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. కోనసీమ ప్రాంత నేతలు, సామాజికవర్గాల నాయకులతో క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడిపూడి సూర్యనారాయణ తదితరులు ఇందులో పాల్గొన్నారు. అన్నదమ్ముల్లా అంతా కలసిమెలసి జీవిస్తూ ఒక్కటవుదామని సీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
రేపటి తరాలు కూడా..
తరతరాలుగా మీరంతా అదే ప్రాంతంలో కలసిమెలసి జీవిస్తున్నారు. అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, జీవిత చరమాంకం వరకూ అక్కడే ఉంటున్నారు. రేపటి తరాలు కూడా అక్కడే జీవించాలి. భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినప్పుడు వాటిని మరిచిపోయి మీరంతా మునుపటిలా కలిసి మెలిసి జీవించాలి. లేదంటే భవిష్యత్తు దెబ్బతింటుంది. దీన్ని లాగుతూ పోతే మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. దీనివల్ల నష్టపోయేది మనమే. అందుకే అందరం కలిసి ఉండాలి. ఆప్యాయతతో ఉండాలి. చిన్న చిన్న గొడవలు, మనçÜ్పర్ధలు, అపోహలున్నా పక్కనపెట్టి ఆప్యాయంగా మాట్లాడుకుందాం. తప్పులు భూతద్దంలో చూసుకోకుండా కలిసిపోదాం. అందరం కలిసికట్టుగా ఒక్కటవుదాం. మిమ్మల్ని ఏకం చేయడం కోసం ఈ ప్రయత్నమంతా చేస్తున్నాం.
పారదర్శకంగా స్వచ్ఛమైన వ్యవస్థ
పార్టీలను చూడకుండా సంతృప్త స్థాయిలో పథకాలు అందచేస్తున్నాం. వలంటీర్‌లకు తోడుగా గృహ సారథులు ఉంటారు. వ్యవస్ధలో పారదర్శకత ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రూపాయి కూడా లంచం లేకుండా రూ.2 లక్షల కోట్ల మేర లబ్ధిదారులకు నేరుగా (డీబీటీ) అందించడం దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. టీడీపీ హయాంలో ఏది కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఇప్పుడు ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందిస్తున్నాం. లంచాలకు తావులేని మంచి వ్యవస్ధను తీసుకొచ్చాం. ఇలాంటి వ్యవస్థ ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది.
భావోద్వేగాలతో ఊహించని ఘటన : పినిపే విశ్వరూప్, పొన్నాడ వెంకట సతీష్‌కుమార్
అమలాపురంలో జరిగిన ఘటన దురదృష్టకరం. భావోద్వేగాలతో మేం ఊహించని ఘటన జరిగింది. దీన్ని మేం వ్యక్తిగతంగా తీసుకోలేదు. కోనసీమలో మళ్లీ గొడవలు రాకుండా మీరు (సీఎం జగన్) తీసుకున్న చొరవకు ధన్యవాదాలు. మేం మనçస్ఫూర్తిగా కేసులన్నీ ఉపసంహరించుకుంటున్నాం. మా పట్ల మీరు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు. అందరం సమన్వయంతో ముందుకెళతాం.
పూర్తిగా సహకరిస్తాం: కాపు నాయకులు
నాడు జరిగిన ఘటనలు దురదృష్టకరం. అవి ఏమాత్రం మంచిది కాదు. సామరస్య వాతావరణం కోసం పూర్తిగా సహకరిస్తాం. దీనికోసం ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడం హర్షణీయం. యువకుల భవిష్యత్తు, వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి పెద్ద మనసుతో తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.
ఐకమత్యంగా ఉంటాం: శెట్టిబలిజ నాయకులు
శెట్టి బలిజ సామాజిక వర్గానికి గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనన్ని పదవులు ఇచ్చి సీఎం జగన్ గౌరవించారు. పెద్ద మనసుతో కేసులు ఉపసంహరించి మరింత సాయం చేశారు. మీకు రుణపడి ఉంటాం. సమాజ శ్రేయస్సు కోసం మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గాలు ఐకమత్యంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment