‘పెండింగ్‌’పై పట్టు.. పలువురి కేంద్రమంత్రులతో సీఎం జగన్‌ భేటీ | Cm Ys Jagan Mohan Reddy Delhi Tour To Meet Central Ministers | Sakshi
Sakshi News home page

‘పెండింగ్‌’పై పట్టు.. పలువురి కేంద్రమంత్రులతో సీఎం జగన్‌ భేటీ

Published Wed, Jan 5 2022 3:23 AM | Last Updated on Wed, Jan 5 2022 7:35 AM

Cm Ys Jagan Mohan Reddy Delhi Tour To Meet Central Ministers - Sakshi

ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాభివృద్ధికి కీలకమైన పలు పెండింగ్‌ ప్రాజెక్టులపై ఢిల్లీ పర్యటనలో తొలిరోజు ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు మంగళవారం పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని ఆంధ్రప్రదేశ్‌ పురోగతికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, యువత నైపుణ్యాలకు పదునుపెట్టి మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, సమాచార, ప్రసారశాఖతో కలసి రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు వ్యవసాయ రంగంలో విజ్ఞానాన్ని పంచడం, మహా నగరాలుగా విస్తరిస్తున్న విజయవాడ, విశాఖలో రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు.

రాష్ట్రంలో యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను పెంపొందించే నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న విద్యాసంస్థల పనులను వేగవంతం చేయాలని, ఇప్పటికీ చాలా చోట్ల తాత్కాలిక ఏర్పాట్లతోనే కొనసాగుతున్నాయని ఆయన దృష్టికి తెచ్చారు. గిరిజన విశ్వవిద్యాలయం పనులను వెంటనే ప్రారంభించి నిధులివ్వాలన్నారు.


గడ్కరీకి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ
రెండో రోజు పర్యటనలో భాగంగా జాతీయ రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ, సమాచార, ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశమయ్యారు. ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించి రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర మంత్రులకు తిరుమల శ్రీవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు.  

విశాఖ పోర్టు – భోగాపురం జాతీయ రహదారి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9.30 గంటలకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీని కలుసుకుని సుమారు గంట సేపు సమావేశమయ్యారు. రాష్ట్రానికి పలు జాతీయ రహదారులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ నగరంలో వాహనాల రద్దీ, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారి నిర్మించాలని కోరారు. విశాఖ పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి నిర్మాణానికి డీపీఆర్‌ తయారీపై చర్చించారు. విశాఖపట్నానికి ఈ రహదారి ఎంతో ప్రయోజనమని, విశాఖ పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వెళ్లే సరకు రవాణా వాహనాలకు దూరాభారం తగ్గుతుందని తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలోని బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్టుల సమీపం నుంచి ఈ రహదారి వెళ్తుందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకోవడానికి, పర్యాటక రంగం అభివృద్ధికి ఈ రహదారి ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి జగన్‌ వివరించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనల పట్ల గడ్కారీ సానుకూలంగా స్పందించినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. 

బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి గడ్కారీ
విజయవాడలో బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉందని గడ్కారీకి సీఎం జగన్‌ తెలియచేశారు. జనవరి మూడో వారంలో నితిన్‌ గడ్కారీ రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశం ఉందని, విజయవాడ బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి. భోగాపురం జాతీయ రహదారిపై డీపీఆర్‌ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను గడ్కారీ çఆదేశించినట్లు తెలిసింది.

బెజవాడ బైపాస్‌కు మినహాయింపులు 
విజయవాడ తూర్పు బైపాస్‌కు సంబంధించి సంబంధిత శాఖల సమన్వయంతో భూ సేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, ప్రాజెక్టు ఖర్చు తగ్గించడంలో భాగంగా ఎస్‌జీఎస్టీ, రాయల్టీ మినహాయింపులు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 

బాపట్ల రహదారిని విస్తరించాలి
కత్తిపూడి – ఒంగోలు కారిడార్‌లో భాగంగా ఎన్‌హెచ్‌–216 నిర్మాణానికి సంబంధించి బాపట్లలో రహదారిని విస్తరించాలని సీఎం జగన్‌ కోరారు. విద్యాసంస్థలు, పర్యాటకులు, ఎయిర్‌బేస్‌ కారణంగా ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రస్తుతం బాపట్ల ద్వారా వెళ్తున్న రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని నితిన్‌ గడ్కారీకి విజ్ఞప్తి చేశారు.


అనురాగ్‌ ఠాకూర్‌కు శ్రీవారి ప్రసాదం అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ 
 
 క్రీడా మైదానాలపై
ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలని కేంద్ర సమాచార, ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌కు ముఖ్యమంత్రి జగన్‌ విజ్ఞప్తి చేశారు. సుమారు అరగంట సేపు కేంద్రమంత్రితో పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. అన్నదాతలకు గ్రామాల్లోనే అన్ని సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ విజ్ఞానాన్ని పంచే విషయంలో సమాచార, ప్రసార శాఖ సహాయ సహకారాలు అందించాలని సీఎం కోరారు. 

 నైపుణ్యాభివృద్ధికి సహకరించండి.,.
విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలుసుకుని విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలపై సీఎం జగన్‌ చర్చించారు. గిరిజన విశ్వవిద్యాలయం స్థలం మార్పిడికి అనుమతించినందుకు ధన్యవాదాలు తెలియచేశారు. సాలూరు సమీపంలో నిర్మించనున్న గిరిజన విశ్వవిద్యాలయం పనులను వెంటనే ప్రారంభించి నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వివరాలను ఈ సందర్భంగా తెలియచేశారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా హిమాచల్‌ ప్రదేశ్‌ సంప్రదాయ టోపీని అనురాగ్‌ ఠాకూర్‌ సీఎం జగన్‌కు బహూకరించారు.  

తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్‌
ఢిల్లీలో రెండు రోజుల పాటు సాగిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ముగిసింది. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాల అనంతరం సీఎం జగన్‌ మంగళవారం సాయంత్రం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement