డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ఇక లేరు | CM YS Jagan Mohan Reddy Father In Law Dr EC Gangi Reddy Passes Away | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ఇక లేరు

Published Sun, Oct 4 2020 3:34 AM | Last Updated on Sun, Oct 4 2020 2:44 PM

CM YS Jagan Mohan Reddy Father In Law Dr EC Gangi Reddy Passes Away - Sakshi

ఈసీ గంగిరెడ్డి భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం జగన్, వైఎస్‌ భారతిరెడ్డి

సాక్షి ప్రతినిధి కడప/ అమరావతి/ హైదరాబాద్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మామ, పిల్లల దేవుడుగా గుర్తింపు పొందిన ప్రముఖ వైద్యుడు, పులివెందుల మాజీ ఎంపీపీ డాక్టర్‌ ఎద్దుల చెంగల్‌రెడ్డి గారి గంగిరెడ్డి (ఈసీ గంగిరెడ్డి) శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్ను మూశారు. వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను రెండు వారాల క్రితం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారు జామున ఆయన మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈసీ గంగిరెడ్డికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.

ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమారుడు దినేశ్‌ రెడ్డి కూడా వైద్యులే. ఆయన కుమార్తె వైఎస్‌ భారతి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి. ఈసీ గంగిరెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్‌ నుంచి పులివెందులకు తీసుకువచ్చారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో సహా శనివారం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని ఈసీ గంగిరెడ్డి భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. సీఎం సతీమణి వైఎస్‌ భారతి, వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు.  
 
ప్రముఖుల నివాళి
► ఈసీ గంగిరెడ్డి భౌతికకాయాన్ని పులివెందులలోని ఆయన స్వగృహానికి తీసుకువస్తున్నారన్న విషయం తెలుసుకుని అప్పటికే రాయలసీమతో పాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. 
► నేరుగా ఈసీ గంగిరెడ్డి నివాసానికి చేరుకున్న సీఎం జగన్‌.. మామ భౌతిక కాయాన్ని చూసి చలించిపోయారు. బాధాతప్త హృదయంతో కొద్దిసేపు మౌనంగా నిలుచుండిపోయారు.  కన్నీటి పర్యంతమైన సతీమణి వైఎస్‌ భారతిని ఊరడించారు. ఆయనతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గంగిరెడ్డి కుమారుడు దినేశ్‌ ‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. 
► వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ గంగిరెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గంటన్నరపాటు అక్కడే ఉండి అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు.  పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పెద్ద సంఖ్యలో అభిమానులు గంగిరెడ్డికి నివాళులు అర్పించారు. పలువురు అభిమానులు, స్థానికులు కొందరు బోరున విలపించారు. 
 
అశ్రు నయనాల మధ్య అంతిమ యాత్ర
► ఈసీ గంగిరెడ్డి అంతిమ యాత్ర శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన నివాసం వద్ద ప్రారంభమైంది. ఆ సమయంలో కుమార్తె భారతి కన్నీటి పర్యంతమయ్యారు. కిలోమీటరుకుపైగా దూరంలోని సమాధుల తోట వరకు అంతిమ యాత్ర సాగింది.
► సీఎం వైఎస్‌ జగన్, కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, పెద్ద సంఖ్యలో అభిమానులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
► సమాధుల తోటలో సాయంత్రం 4 గంటలకు జగన్‌తోపాటు ఇతర ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. 
► ఈసీ గంగిరెడ్డికి నివాళులర్పించిన వారిలో ఉప ముఖ్యమంత్రి అంజద్‌ బాష, మంత్రులు ఆదిమూలపు సురేశ్, శంకర్‌ నారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌.రఘురామిరెడ్డి, డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, సిద్దారెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
► అంత్యక్రియలు ముగిసిన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ తిరుగు ప్రయాణమై సాయంత్రం 6.15 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. 

పిల్లల దేవుడు 
► పులివెందులలో 44 ఏళ్ల పాటు వైద్యుడిగా గంగిరెడ్డి విస్తృతంగా వైద్య సేవలు అందించారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన ఆయన పిల్లల దేవుడిగా పేరు పొందారు. వేముల మండలం గొల్లెల గూడూరుకు చెందిన ఈసీ సిద్దారెడ్డి, తులసమ్మ దంపతులకు 1949, ఏప్రిల్‌ 20న ఈసీ గంగిరెడ్డి జన్మించారు.
► 1 నుంచి 5వ తరగతి వరకు గొల్లెలగూడూరులోని ఆర్‌సీఎం స్కూలులో.. 6, 7, 8 తరగతులు పులివెందుల జిల్లా పరిషత్‌ హైస్కూలులో చదివారు. 9, 10, 11 తరగతులు వేముల జెడ్పీ పాఠశాలలో, పీయూసీ తిరుపతి ఆర్ట్స్‌ కళాశాలలో చదివారు. 
► బెనారస్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఆయన పిల్లల వైద్యంలో స్పెషలైజేషన్‌ చేశారు. తొలుత వైఎస్‌ రాజారెడ్డి ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేశారు. ఆ తర్వాత సొంతంగా పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. 
► పిల్లల వైద్యుడిగా ఆయన చేయి పట్టుకుంటే చాలు.. ఎంతటి వ్యాధి అయినా నయమవుతుందన్న పేరు గడించారు. పేద వారికి ఉచిత వైద్య సేవలు అందించారు. దీంతో పులివెందుల నియోజకవర్గంతోపాటు రాయలసీమ వ్యాప్తంగా ఆయనకు పిల్లల దేవుడిగా పేరొచ్చింది. 

రాజకీయ ప్రస్థానం..
► ఈసీ గంగిరెడ్డి రాజకీయాల్లో కూడా రాణించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేశారు.  2001లో పులివెందులలో ఎంపీటీసీ–1 స్థానం నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన గంగిరెడ్డి పులివెందుల మండల పరిషత్‌ అధ్యక్షుడిగా చేశారు. పులివెందుల రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 
► 2003 రబీలో ప్రభుత్వం తమకు విత్తనాలు ఇవ్వడం లేదంటూ రైతులు గంగిరెడ్డికి వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఆయన వేలాది మంది రైతులతో కలిసి పులివెందుల నుంచి కడప కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర చేశారు. కలెక్టర్‌ హామీతో ఆ తర్వాత ఆందోళన విరమించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement