
సాక్షి, అమరావతి: ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ మాసంలో.. నెల రోజులపాటు నియమ నిష్టలతో ముస్లింలు కఠిన ఉపవాస వ్రతం ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రులవుతారని అన్నారు.
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్ మాసం గొప్ప సందేశం ఇస్తోందని చెప్పారు. ‘కఠిన ఉపవాస దీక్ష (రోజా) ఆచరిస్తూ, దైవ చింతనతో గడిపే ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దాన ధర్మాల ద్వారా ఖర్చు చేస్తారు.
మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్. ఈ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు’ అని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంవో గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.