పాఠశాలలకు హెడ్‌మాస్టర్లే కుటుంబ పెద్దలు.. అన్ని బాధ్యతలు వారివే: సీఎం జగన్‌ | CM YS Jagan Mohan Reddy Review Meeting On Education Department | Sakshi
Sakshi News home page

CM YS Jagan: స్కూళ్లల్లో సదుపాయాలపై సమస్యలకు ఒక నెంబర్‌ ఉండాలి: సీఎం జగన్‌

Published Wed, Nov 17 2021 12:40 PM | Last Updated on Wed, Nov 17 2021 6:06 PM

CM YS Jagan Mohan Reddy Review Meeting On Education Department - Sakshi

సాక్షి, తాడేపల్లి : విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో నూతన విద్యా విధానం అమలు, తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆరాతీశారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లను నియమించడంతోపాటు, సబ్జెక్టుల వారీగా టీచర్లు, వారితో బోధనే లక్ష్యంగా నూతన విద్యా విధానం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాటిలైట్‌ ఫౌండేషనల్‌ స్కూల్స్, ఫౌండేషనల్‌ స్కూల్స్, ఫౌండేషనల్‌ ప్లస్‌స్కూల్స్, ప్రీ హైస్కూల్స్, హైస్కూల్స్, హైస్కూల్‌ ప్లస్‌ స్కూల్స్‌పై సీఎం జగన్‌కు అధికారులు వివరాలు అందించారు.
చదవండి: వైఎస్సార్‌సీపీ ప్రభంజనం.. నెల్లూరు కార్పొరేషన్‌లో క్లీన్‌స్వీప్

2021–22 నుంచి 2022–23, 2023–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో నూతన విద్యా విధానం మూడు దశలుగా పూర్తిగా అమలు కానున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు. దీనిలో భాగంగా 25,396 ప్రైమరీ పాఠశాలలను యూపీ(అప్పర్ ప్రైమరీ) స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం చేయనున్నట్లు తెలిపారు. తొలిదశలో భాగంగా ఈ విద్యా సంవత్సరం 2,663 స్కూళ్లు  విలీనం చేశామని, 2,05,071 మంది విద్యార్థులు నూతన విద్యావిధానం అనుసరించి విలీనం అయ్యారని పేర్కొన్నారు. మొత్తంగా ఈ ప్రక్రియలో 9.5 లక్షల మంది విద్యార్థులకు నూతన విద్యావిధానం ఈ సంవత్సరమే అందుబాటులోకి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు.
చదవండి: కుప్పం మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం

ఈ సందర్భంగా  సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధానం అమలు చేయడానికి అవసరమైన చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తిచేసి వెంటనే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనాటికి అవసరమైన టీచర్ల సంఖ్యను కూడా గుర్తించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ మీద సీఎం సమీక్ష
► 1092 స్కూల్స్‌ 2021–22 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ జరిగాయని అధికారులు వివరించారు.
► ఈ విద్యార్థులు 2024–25 నాటికి పదోతరగతి పరీక్షలు రాస్తారని తెలిపారు.
► అంతర్జాతీయంగా 24వేల స్కూళ్లకు మాత్రమే సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉందని పేర్కొన్నారు.
► ఒక దేశంలో ఒక ఏడాది, అదికూడా ఒక రాష్ట్రంలో 1092 స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఇవ్వడం రికార్డని అధికారులు తెలిపారు.

► టీచర్‌ ట్రైనింగ్‌ ఇస్తున్న డైట్‌ సంస్థల సమర్థత పెంచాలని సీఎం ఆదేశించారు.
► టీచర్లకు అత్యంత నాణ్యమైన శిక్షణ అందాలని అన్నారు.
► టీచర్లకు శిక్షణకార్యక్రమాలపై వచ్చే సమావేశంలో వివరాలు అందించాలని సూచించారు.
►స్కూళ్లో సదుపాయాలపై ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే కాల్‌చేసేలా ఒక నంబర్‌ పెట్టాలని ఆదేశించారు.
►ప్రతి స్కూళ్లో అందరికీ కనిపించేలా ఈ నంబర్‌ను ప్రదర్శించాలని, ఈ కాల్‌సెంటర్‌ను అధికారులు పర్యవేక్షణ చేసిన వారినుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని, తగిన చర్యలు    తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

ఇంగ్లీష్‌పై ప్రత్యేక శ్రద్ధ
►ఇంగ్లిషు ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం పేర్కొన్నారు.
►దీనికోసం పాఠ్యప్రణాళికలో దృష్టిపెట్టాలన్నారు.
►పిల్లలకు ఇదివరకే డిక్షరీలు ఇచ్చామని, వాటిని వినియోగించుకోవాలని తెలిపారు.
►ప్రతిరోజూ కనీసం మూడు పదాలు నేర్పించాలని, ఆ పదాలను వినియోగించడంపై పిల్లలకు నేర్పించాలని ఆదేశించారు.

మరుగుదొడ్లు నిర్వహణ
►మన ఇంట్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని ఎలా అనుకుంటామో.. పిల్లలు చదివే పాఠశాలల్లో కూడా మరుగుదొడ్లు అలాగే ఉండాలని అధికారులకు సూచించారు.
►నాణ్యమైన సదుపాయాలు అన్నది అందరి లక్ష్యం కావాన్నారు.
►అందుకనే పాఠశాలల్లో మరుగుదొడ్ల స్థితిగతులపై తనిఖీలు చేయాలని ఆదేశించారు.
►టాయిలెట్స్‌లో ట్యాప్‌లు పనిచేయక, నీళ్లు రాక... అవి చివరకు దుర్గంధంతో నిండిపోయి ఎవరూ వినియోగించని పరిస్థితులు చూశామని, అలాంటి పరిస్థితులను నాడు-నేడు ద్వారా మార్చామని గుర్తు చేశారు
►ఇప్పడు వాటిని సరిగ్గా పర్యవేక్షించి పిల్లలకు మంచి వాతావరణం అందుబాటులో ఉండాలని తెలిపారు.
►పాఠశాలలకు హెడ్‌మాస్టర్లు కుటుంబ పెద్దలు అని, ఆ పాఠశాలల్లో నాణ్యమైనరీతిలో బోధన దగ్గరనుంచి మొదలు భోజనం నుంచి ఇతర సదుపాయాలు, మౌలిక వసతులపై  తనిఖీలు చేసి  వాటిని సవ్యంగా ఉండేలా వారుచూడాలన్నారు.
►ఆవిధంగా హెడ్‌ మాస్టర్లను చైతన్యం చేయాలని, ప్రతిరోజూ మానిటరింగ్‌ జరగాలని పేర్కొన్నారు.

గోరుముద్దపై ఫీడ్‌ బ్యాక్‌
►గోరుముద్దపై క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
►పిల్లల నుంచి, తల్లుల నుంచి తప్పకుండా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని తెలిపారు.
►ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
►కలెక్టర్లు, జేసీలు, అధికారులు తప్పనిసరిగా గోరుముద్ద అమలును పర్యవేక్షించాలని, స్వయంగా వారు భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలన్న సీఎం జగన్‌ ఆదేశించారు.

లెర్న్‌ టు లెర్న్‌ కాన్సెప్ట్‌
ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా వివిధ అంశాలను నేర్చుకోవడం, వాటిని ఇతరులకు నేర్పించడం లాంటి కాన్సెప్ట్‌ను పిల్లలకు నేర్పించాలని అధికారులకు సీఎం నిర్దేశం చేశారు.

ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ (ఎండీఎం అండ్‌ శానిటేషన్‌) బీఎం దివాన్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, సర్వశిక్షా అభయాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి చినవీరభద్రుడు, ఏపీఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీ వి రాములు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement