సాక్షి, చిత్తూరు: శ్రీకాళహస్తి(మం) ఊరందూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పథకం ప్రారంభించారు. ఊరందూరులో 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పైలాన్‌ని ఆవిష్కరించారు. తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల పనులను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా నేడు పండుగ జరుగుతోంది. సొంతిళ్లు లేని నిరుపేదల్లో చిరునవ్వు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 30.75లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నాం. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నాం. శ్రీకాళహస్తిలో 7 లక్షల రూపాయల విలువైన ప్లాట్‌ను అక్కాచెల్లెమ్మలకు ఇస్తున్నాం’ అన్నారు.
అమ్మ ఒడి, చేయూత, వసతి దీవెన వంటి పథకాల ద్వారా నేరుగా మహిళలకే నగదు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అవినీతికి తావు లేకుండా నేరుగా అక్కాచెల్లెమ్మల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం అన్నారు సీఎం జగన్. అలానే ఇళ్ల పట్టాలను నిరంతర ప్రక్రియగా మార్చామని.. అర్హులైనవారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో.. ఇంటి స్థలం కేటాయించేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. లే అవుట్ విస్తీర్ణం బట్టి పార్క్‌లు, అంగన్‌వాడీలు, విలేజ్ క్లీనిక్‌లు, ఆర్‌బీకేలు ఏర్పాటు చేస్తాం. 224 చదరపు అడుగుల నుంచి 340 చదరపు అడుగులకు విస్తీర్ణం పెంచాం. 300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఇళ్లను ఒక రూపాయికే అందిస్తున్నాం. టిడ్కో ఇళ్లను పూర్తి చేసేందుకు 9వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాం’ అన్నారు. (చదవండి: ఇళ్లు.. పుష్కలంగా నీళ్లు)
‘లక్షా 43వేల మంది టిడ్కో లబ్ధిదారుల్లో ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీం కావాలన్నారు. 365, 430 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లల్లో.. 50శాతం లబ్ధిదారుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనివల్ల ప్రభుత్వంపై 4,250 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది’ అన్నారు సీఎం జగన్. ఇక ‘ఇళ్ల స్థలాల పంపిణీలో కులం, మతం, పార్టీ వంటి బేధాలు చూడలేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిని అందిస్తున్నాం. పారదర్శకతలో భాగంగా లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయంలో పెడుతున్నాం’ అని తెలిపారు.
ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చాం
ఇక ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చామన్నారు సీఎం జగన్. మొదటి ఆప్షన్‌లో నిర్మాణ సామాగ్రి, లేబర్ ఛార్జీలను లబ్ధిదారులకు ఇస్తాం. రెండో ఆప్షన్‌లో నిర్మాణ ఖర్చులను పురోగతి వారీగా డబ్బులు చెల్లిస్తాం. మూడో ఆప్షన్‌లో పూర్తిగా ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందిస్తాం అని తెలిపారు. లబ్ధిదారుల పేరుతోనే ఇంటి రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం అన్నారు. చంద్రబాబు అండ్ కో కుట్రలతో రిజిస్ట్రేషన్‌లు జరగలేదని తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారులకు కేవలం 'డి' పట్టాలు మాత్రమే ఇస్తున్నామని.. న్యాయపరమైన చిక్కులు తొలగిపోగానే లబ్ధిదారులకు అన్ని హక్కులు కల్పిస్తామన్నారు. డిసెంబర్ 25న ఇళ్ల పట్టాలు పంచుతామని తెలిసి 24న కోర్టుకు వెళ్లారు.. చంద్రబాబు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టే తెలుస్తుందని జగన్ మండి పడ్డారు. (చదవండి: ఒక అద్భుతం... ఓ ఆశ్చర్యం!)
పులివెందులలో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టు ద్వారా స్టే తెచ్చారు. అమరావతిలో 54వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. విశాఖలో 1.84లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇద్దామనుకుంటే.. ఇళ్ల పట్టాల కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తే భూమి ఇచ్చినవారికి.. లబ్ధిదారులకి సంబంధం లేని వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. రాజమండ్రిలో ఆవా భూముల పేరుతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ప్రభుత్వ భూములను కూడా పేదలకు కేటాయించకుండా అడ్డుకుంటున్నారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కాగానే మిగిలిన వారందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment