
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరోమారు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జామ్ నగర్ నుంచి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి గతంలో కంటే ఇప్పుడు ఆక్సిజన్ సరఫరా పెంచినందుకు, 7 కంటైనర్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలను తెలిపారు. రాష్ట్రంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్స్ 30 వేలకు పెంచామని, రోజూ 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవసరం ఉందని పేర్కొన్నారు. విశాఖ ఆర్‌ఐఎన్‌ఎల్ నుంచి కేటాయించిన 170 మెట్రిక్ టన్నులకు బదులు 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే వస్తోందని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక నుంచి రాష్ట్రానికి కేటాయించిన మేర ఆక్సిజన్ రావడం లేదని సీఎం గుర్తుచేశారు.
దీంతో రాయలసీమలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరాకు ఇబ్బంది కలుగుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. జామ్ నగర్ నుంచి పంపిన 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మరో రెండు రోజులు రాయలసీమలో ఉపయోగపడుతుందనే విషయాన్ని లేఖలో తెలిపారు. ఒరిస్సా నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ తెచ్చుకునేందుకు పూర్తిగా కృషి చేస్తున్నామని సీఎం జగన్ లేఖలో వివరించారు. రాయలసీమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జామ్ నగర్ నుంచి ప్రతి రోజూ 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపాలని విన్నవించారు. రాష్ట్రానికి కావాల్సిన 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ డిమాండ్‌ను అందుకునేందుకు అధికారులకు ఆదేశాలివ్వాలని సీఎం వైఎస్ జగన్ లేఖలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment