ముగిసిన సీఎం జగన్‌ నెల్లూరు పర్యటన | CM YS Jagan Nellore District Tour Live Updates | Sakshi
Sakshi News home page

CM Jagan Nellore Tour: ముగిసిన సీఎం జగన్‌ నెల్లూరు పర్యటన

Published Thu, Oct 27 2022 9:45 AM | Last Updated on Thu, Oct 27 2022 4:02 PM

CM YS Jagan Nellore District Tour Live Updates - Sakshi

Live Updates

కృష్ణా: నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. గన్నవరం నుండి తాడేపల్లి నివాసానికి బయల్దేదారు.

► రేణిగుంట విమనాశ్రయం  నుండి విజయవాడ గన్నవరం విమానాశ్రయంకు  విమానం లో బయలుదేరిన సీఎం జగన్

అదృష్టంగా భావిస్తున్నా.. సీఎం జగన్‌
రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తిలో నేడు మరో ముందడుగు పడిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జెన్‌కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేస్తున్నామన్నారు. తన తండ్రి వైఎస్సార్‌  శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం అన్నారు.

కృష్ణపట్నం పోర్టు పరిధిలోని మత్స్యకారులు, మత్స్యకారేతరుల స్వప్నాన్ని సీఎం సాకారం చేస్తున్నారు. చేపల వేటకు అనువుగా రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్‌ జెట్టి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఫిషింగ్‌ జెట్టికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు.

జెన్‌కో మూడో యూనిట్‌ ప్రారంభించనున్న సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లా చేరుకున్నారు. కాసేపట్లో ముత్తుకూరు మండలం నేలటూరులో జెన్‌కో మూడో యూనిట్‌ ప్రారంభించనున్నారు. జెన్‌కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేయనున్నారు.

రేణిగుంట నుంచి నెల్లూరుకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరిన సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసుదన్‌ రెడ్డి, కలెక్టర్ వెంకట రమణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో  సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుకు బయలుదేరారు.


సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎస్‌డీఎస్‌టీపీఎస్‌)లో 800 మెగావాట్ల యూనిట్‌ను యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.  ప్రభుత్వ రంగంలో దేశంలోనే మొదటిదైన ఈ సూపర్‌ క్రిటికల్‌ యూనిట్‌ రోజుకు 19 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంట్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. సాధారణ థర్మల్‌ పవర్‌ ప్లాంట్లతో పోలిస్తే ఈ ప్లాంట్‌లో తక్కువ బొగ్గును వినియోగిస్తారు. దీనివల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం కొంత మేర తగ్గుతుంది. రోజుకు 9,312 టన్నుల బొగ్గుతో నడిచేలా ఈ యూనిట్‌ను రూపొందించారు.

పూర్తి స్థాయిలో సన్నద్ధం
కృష్ణపట్నం ప్లాంట్‌ మొత్తం సామర్థ్యం నాలుగు యూనిట్లు కాగా, స్టేజ్‌–1లో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు ఇప్పటికే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. మూడవ యూనిట్‌గా స్టేజ్‌–2లోని  800 మెగావాట్ల ప్లాంట్‌ను రూ.5,082 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టారు. అయితే జీఎస్టీ అమలు, చట్టంలో మార్పు, ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తంపై వడ్డీ కారణంగా అంచనా వ్యయంతో పోలిస్తే ప్రాజెక్ట్‌ వ్యయం కొంత పెరిగింది. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.5,935.87 కోట్లు, రాష్ట్ర విద్యుత్‌ ఆర్థిక సంఘం ద్వారా రూ 1,000 కోట్ల రుణ సాయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు.

ఈ ఏడాది ఆగస్టు నుంచి రెండవసారి ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. తాల్చేర్‌ నుంచి కృష్ణపట్నం పోర్టు ద్వారా బొగ్గు రవాణా జరుగుతుంది. బంగాళాఖాతం నుంచి సముద్రపు నీటిని గ్రహించి, ఆర్వో ప్లాంట్ల ద్వారా మంచినీటిగా మార్చి వినియోగిస్తారు. కాగా, ఈ ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008 జూలై 17న శంకుస్థాపన చేయగా, ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేయడం విశేషం. కాగా, నేడు 3వ యూనిట్‌ ప్రారంభోత్సవం చేయనున్నారు.

స్వప్నం సాకారం..
కృష్ణపట్నం పోర్టు పరిధిలోని మత్స్యకారులు, మత్స్యకారేతరుల స్వప్నాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేస్తున్నారు. చేపల వేటకు అనువుగా రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్‌ జెట్టి నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేయనున్నారు. పుష్కర కాలంగా ఎదురు చూస్తున్న కృష్ణపట్నం పోర్టు నిర్వాసితులకు మత్స్యకారేతర ప్యాకేజీ సైతం పంపిణీ చేయనున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన పాదయాత్రలో కోరిన విన్నపాన్ని సీఎం హోదాలో ఆచరణలో అమలు చేస్తున్నారు.

సర్వేపల్లి నియోజకవర్గంలోని కృష్ణపట్నంలో పోర్టు నిర్మాణంతో సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇబ్బందిగా మారింది. ఫిషింగ్‌ జెట్టి ఏర్పాటు చేయాలన్న ఈ ప్రతిపాదన 16 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. హార్బర్‌ నిర్మించాలని కూడా గతంలో పలు సర్వేలు, పరిశీలనలు చేపట్టారు. అందుకోసం పాలకులు అంచనాలు కూడా రూపొందించారు. అవేవీ కార్యరూపం దాల్చలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడి మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని భావించారు. ఎన్నో ఏళ్లుగా మత్స్యకారుల కలగా మిగిలిపోయిన ఫిషింగ్‌ జెట్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నేలటూరు జెన్‌కో మూడో యూనిట్‌ ప్రారంభోత్సవానికి గురువారం రానున్న సీఎం  శంకుస్థాపన చేయనున్నారు.

రూ.25 కోట్లతో ఫిషింగ్‌ జెట్టి
ముత్తుకూరు మండలంలోని నేలటూరు పట్టపుపాళెం వద్ద రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్‌ జెట్టి నిర్మాణం చేపట్టనున్నారు. జెట్టి అందుబాటులోకి వస్తే ఉప్పు కాలువల్లో, క్రీక్‌ల్లో బోట్లు, వలలను భద్రపరుచుకునే బాధ మత్స్యకారులకు తప్పుతోంది. ఫిషింగ్‌ జెట్టీ వద్ద భద్రపరుచుకొనే అవకాశం  ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి బోట్లు, వలలను కాపాడుకోవచ్చు. సముద్రంలో వేట చేసిన మత్స్య సంపదను ఈ జెట్టి వద్ద ఎండబెట్టుకొని, భద్రపరుచుకోవచ్చు. పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు.

పైగా వలలు అల్లుకొనే వెసులుబాటు లభిస్తుంది. రోడ్డు సదుపాయం ఏర్పడుతుంది. కొనుగోలుదారులు నేరుగా ఈ జెట్టిల వద్దకు వచ్చి మత్స్యసంపదను కొనుగోలు చేసుకొనే వెసులుబాటు లభిస్తోంది. క్రమంగా ఈ జెట్టిల వద్ద కోల్డ్‌ స్టోరేజీలు అందుబాటులోకి రానున్నాయి. చేపలు, రొయ్యలు చెడిపోకుండా ఈ కోల్డ్‌ స్టోరేజ్‌లో భద్రపరుచుకోవచ్చు. భవిష్యత్‌లో ఈ ఫిషింగ్‌ జెట్టి క్రమంగా మినీ ఫిషింగ్‌ హార్బర్‌గా రూపాంతరం చెందే అవకాశం లేకపోలేదని పలువురు వివరిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement