Time: 11:41 AM
రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకంలో భాగంగా రీసర్వే పూర్తయిన భూములకు సంబంధించిన సమగ్ర భూసర్వే రికార్డులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రజలకు అంకితం చేశారు. అలాగే 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు.
Time: 11:27 AM
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా మంచి కార్యక్రమానికి మళ్లీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ, దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ పద్దతిలో సమగ్ర భూసర్వే తొలి దశలో 51 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామన్నారు. 11,501 గ్రామాల్లో డిసెంబర్ 2022 నాటికి రీసర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో వివాదాలకు తావు లేకుండా సమగ్ర సర్వే చేపట్టామన్నారు. మీ ఆస్తులు లావాదేవీలు మీ గ్రామంలో కనిపించే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఇటువంటి మంచి సంస్కరణ నేటి నుంచి అమల్లోకి తెస్తున్నామని సీఎం అన్నారు.
భూములకు సంబంధించి ట్యాంపరింగ్ జరుగుతోందన్న ఫిర్యాదులు వచ్చాయి. పట్టాదారు పాస్ బుక్‌లకు ఆశించినంత లాభం జరగలేదు. భూమికి చెందిన నిర్ధిష్టమైన హద్దులు, హక్కులు ఇప్పటివరకు లేవు. కేవలం 90 శాతం కేసులు సివిల్ వివాదాలకు సంబంధించినవే.. శాస్త్రీయ పద్దతుల్లో భూములకు నిర్థిష్టంగా మార్కింగ్ చేసి ప్రతి ఒక్కరికీ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తే ల్యాండ్ వివాదాలకు చెక్ పెట్టొచ్చు.
చదవండి: టీడీపీ కుట్ర బట్టబయలు.. చంద్రబాబు ఆడియో లీక్..
సాక్షి, అమరావతి: వందేళ్ల తర్వాత దాదాపు రూ.1,000 కోట్ల ఖర్చుతో 4,500 సర్వే బృందాలు, 70 కార్స్ బేస్ స్టేషన్లు, 2 వేల రోవర్లతో అత్యాధునిక సాంకేతికతను వినియోగించి దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూసర్వేను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి దశలో 51 గ్రామాల్లోని 12,776 మంది భూ యజమానులకు చెందిన 21,404 భూ కమతాలను అధికారులు రీసర్వే చేశారు. ఇందులో భాగంగా వారికి చెందిన 29,563 ఎకరాల భూములను రీసర్వే చేసి.. 3,304 అభ్యంతరాలను పరిష్కరించారు. ఈ భూమి రికార్డులను సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తారు. జూన్ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలో మిగిలిన భూముల రీసర్వేను కూడా పూర్తి చేయనున్నారు. తర్వాత రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి ఆయా గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేస్తారు.
భూ రికార్డుల ప్రక్షాళన
భూకమతం ఒక సర్వే నంబర్ కింద ఉండి, కాలక్రమేణా విభజన జరిగి.. చేతులు మారినా సర్వే రికార్డులు అప్‌డేట్ కాకపోవడంతో వస్తున్న భూవివాదాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులకు ప్రభుత్వం ఇక చెక్ పెట్టనుంది. భూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రతి భూ కమతానికి (సబ్ డివిజన్‌కు కూడా) విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించనుంది. ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు తెలిపే క్యూఆర్ కోడ్‌తో కూడిన భూపటాన్ని యజమానులకు జారీ చేస్తుంది. గ్రామ స్థాయిలోనే భూరికార్డులను క్రోడీకరించడం వల్ల మ్యాపులు (భూ కమతాలతో కూడిన గ్రామ పటం), ఇతర భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే అందుబాటులో ఉంటాయి.
శాశ్వత భూ హక్కు
సర్వే ప్రతి అడుగులో భూ యజమానులను భాగస్వాములను చేశారు. మండల మొబైల్ మెజిస్ట్రేట్ బృందాల ద్వారా అభ్యంతరాలను పరిష్కరించారు. ప్రతి భూకమతానికి ఉచితంగా భూరక్ష హద్దు రాళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సమగ్ర భూసర్వే పూర్తయిన వాటికి సంబంధించి సింగిల్ విండో పద్ధతిలో ప్రతి ఆస్తికీ ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూహక్కు పత్రం జారీ దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. శాశ్వత భూహక్కు పత్రం ఉండటం వల్ల ఇకపై భూలావాదేవీలు పారదర్శకంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో నకిలీ రిజిస్ట్రేషన్లకు చెక్ పడుతుంది.
దళారీ వ్యవస్థ రద్దవడంతోపాటు లంచాలకు చోటు ఉండదు. భూ యజమానులకు తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు వీలుపడవు. ఇకపై గ్రామ సర్వేయర్ల ద్వారానే ఎఫ్ లైన్ దరఖాస్తులను 15 రోజుల్లో, పట్టా సబ్ డివిజన్ దరఖాస్తులను 30 రోజుల్లో పరిష్కరిస్తారు. భూ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా పొందొచ్చు. ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూమి హక్కు పత్రం అందడం వల్ల భూములు, ఆస్తులు సురక్షితంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భూవివాదాలు తలెత్తవు. భూ లావాదేవీల ఆధారంగానే భూ రికార్డుల్లో మార్పులుంటాయి. పారదర్శకంగా ఉండటం వల్ల భూ యజమానులు రుణాలు పొందడం కూడా సులభం కానుంది.
ఇక గ్రామ సచివాలయాలే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని గ్రామ సచివాలయాల్లోనే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులనే సబ్ రిజిస్ట్రార్లుగా నియమించింది. రెవెన్యూ శాఖ(స్టాంపులు, రిజిస్ట్రేషన్లు) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఈ మేరకు సోమవారం రెండు నోటిఫికేషన్లు ఇచ్చారు. భూరికార్డులను సులభంగా తనిఖీ చేసుకునేలా రిజిస్ట్రేషన్ సేవలను గ్రామ సచివాలయాల స్థాయిలో వికేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలోనే రిజి స్ట్రేషన్ సేవలందించేందుకు సచివాలయాల్లో సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాలను ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి వేరు చేసి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో సబ్ డిస్ట్రిక్టులుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కొత్త సబ్ డిస్ట్రిక్టులు ఇవే..
శ్రీకాకుళం జిల్లా.. శింగన్నవలస, డోల, విజయనగరం జిల్లా.. సోంపురం, పెదమనపురం, విశాఖపట్నం జిల్లా.. నునపర్తి, చింతపల్లి–1, తూర్పుగోదావరి జిల్లా.. పాలగుమ్మి, మాధవపురం, గుడివాడ, భూపాలపట్నం–2, తాళ్లపొలం, బండపల్లి, రంగాపురం, తోగుమ్మి, పెదపుల్లేరు, కృష్ణా జిల్లా.. పోతిరెడ్డిపాలెం, లింగవరం, మర్రిబంధం, షేర్ మహ్మద్‌పేట, గుంటూరు జిల్లా.. తుమ్మలపాలెం, నడికుడి–3, ఉన్నవ, దుగ్గిరాల–1, ప్రకాశం జిల్లా.. శివరామపురం, కొప్పోలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.. నువ్వూరుపాడు, దుండిగం, భీమవరం, మొగల్లూరు, చిత్తూరు జిల్లా.. అగరమండళం, రామభద్రాపురం, విట్టలం, నర్సింగపురం, వైఎస్సార్ జిల్లా.. రేగిమానుపల్లె, మొయిళ్లకాల్వ, కర్నూలు జిల్లా.. ముసనహల్లి, పందిపాడు గ్రామ సచివాలయాల్లోనే కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలోకొస్తాయన్నారు. పంచాయతీ, వార్డు పరిపాలన కార్యదర్శులను కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లకు సబ్ రిజిస్ట్రార్లుగా నియమిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆయా సచివాలయాల పరిధిలోని ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను వీరే నిర్వహిస్తారని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment