Andhra Pradesh: ఉపాధితో అభివృద్ధి | CM YS Jagan Released Second Tranche Industries Incentives | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఉపాధితో అభివృద్ధి

Published Fri, Sep 3 2021 11:44 AM | Last Updated on Sat, Sep 4 2021 10:11 AM

CM YS Jagan Released Second Tranche Industries Incentives - Sakshi

ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్‌/స్పిన్నింగ్‌ మిల్స్‌కు విడుదల చేసిన ప్రోత్సాహకాల చెక్కుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, లబ్ధిదారులు, అధికారులు

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కష్ట కాలంలో అప్పో, సప్పో చేసి ప్రజల కొనుగోలు శక్తిని పెంచామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 25 సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పేదల ఖాతాలకు నేరుగా డబ్బులు అందించడం ద్వారా పరిశ్రమలు, ఉపాధిని నిలబెట్టామని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మన ఖర్మ కొద్దీ ఒక ఎల్లో మీడియా.. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ–5 ఉన్నాయని.. వీళ్లంతా ఒకవైపున ఉంటే, వీళ్లకు కొమ్ము కాస్తూ తెలుగుదేశమనే అన్యాయమైన పార్టీ కూడా నిందలు వేస్తోందన్నారు. ప్రజలను కాపాడుకునే కార్యక్రమాన్ని వక్రీకరించి, పెడదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వీటన్నింటినీ నెగెటివ్‌ లైన్లో చూపించే అధ్వాన పరిస్థితులు మన రాష్ట్రంలో మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పారు. పళ్లు పండే చెట్టు మీదే రాళ్లు పడతాయన్న సామెతను తాను గట్టిగా నమ్ముతానని, వీళ్లు ఎంత నిరుత్సాహ పరిచే కార్యక్రమాలు చేసినా సరే.. దేవుడి దయతో మంచి చేయాలనుకున్నది చేస్తామని స్పష్టం చేశారు. ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ప్రోత్సాహకాలు పొందిన లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

విశ్వాసం కల్పించాం
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 97,423 మంది ఎంఎస్‌ఎంఈలు నడుపుతున్నారు. వీరు చిన్న చిన్న పరిశ్రమలను పెట్టడమే కాకుండా, మరో 12 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలాంటి రంగాన్ని ఆదుకోవడం అంటే.. ఇలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెబితే చేస్తుందని నమ్మకం కల్పించడం. అంటే, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టానికి విశ్వాసం కల్పించమే అవుతుంది. ఎంఎస్‌ఎంఈలతోపాటు మధ్యతరహా పారిశ్రామిక వేత్తలనూ కాపాడ గలిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడగలుగుతుంది. వ్యవయసాయం ఏ రకంగా జీడీపీకి దోహదకారి అవుతుందో, పరిశ్రమలు కూడా అదేరకంగా తోడ్పాటును అందిస్తాయి.

చిత్తశుద్ధి, అంకిత భావంతో చర్యలు
గతంలో హడావిడి ఎక్కువగా ఉండేది. పెద్ద పెద్ద సదస్సులు పెట్టేవారు. కాగితాల మీద అగ్రిమెంట్లు రాసుకునే వారు. ఆ రోజుల్లో మీడియా కూడా పోలరైజ్డ్‌గా ప్రచారం చేసేది. ఇవాళ కూడా మీడియా అదే పోలరైజ్డ్‌గానే ఉంది. అప్పట్లో అక్కడ ఏమీ జరక్కముందే.. మైక్రోసాఫ్ట్‌ వచ్చేసిందని ఒకరోజు రాసేవారు. ఎయిర్‌ బస్‌ వచ్చేసిందని మరో రోజు రాసేవారు. బుల్లెట్‌ రైలు వచ్చేసిందని ఇంకోసారి హెడ్‌లైన్స్‌లో వార్తలు చూశాం. ఏమీ జరక్కపోయినా, ఏమీ రాకపోయినా మీడియా హడావిడిని బాగా చూశాం. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కనపెట్టి, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయకుండా.. నిజంగానే పరిశ్రమలను తీసుకురావడానికి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న ప్రభుత్వం మనది. వచ్చిన పరిశ్రమలు ఏంటో.. మన కళ్లముందే కనిపిస్తున్నాయి. స్థానికులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కళ్లముందే కనిపిస్తున్నాయి. ఒక పరిశ్రమ పెట్టాలంటే రాష్ట్రంలో వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. ఇన్సెంటివ్‌లు ఇస్తామని చెప్తే, ఆ ఇన్సెంటివ్‌లను ఇస్తారన్న నమ్మకం, విశ్వాసం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలమీద ఉండాలి. అప్పుడే  పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తారు.

పరిశ్రమలను నిలబెట్టే చర్యలు
ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను గమనిస్తే.. ఆర్థిక వ్యవస్థ మందగమనం కనిపిస్తోంది. వస్తువులకు, సేవలకు డిమాండ్‌ తగ్గినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి అనుకూలతలేని పరిస్థితుల్లో ఒక వైపున ప్రజలను కాపాడుకోవాలి. ఇంకోవైపున వస్తువులకున్న డిమాండ్‌ తగ్గకుండా చూడాలి. మరోవైపున పరిశ్రమలను నిలబెట్టే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇదే దిశగా అడుగులు వేస్తూనే ముందుకు పోతున్నాం. ఈ 27 నెలల కాలంలో మనందరి ప్రభుత్వం అందించిన డబ్బుతో ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా రాష్ట్రంలోని కుటీర, మధ్యతరహా పరిశ్రమలను, ఉపాధి రంగాన్ని నిలబెట్టగలిగాం. 

డీబీటీ ద్వారా ప్రతి కుటుంబాన్ని నిలబెట్టగలిగాం
– కోవిడ్‌ విపత్తు నెలకొన్న ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన.. ఇలా దాదాపు 25 సంక్షేమ, అభివృద్ధి పథకాలు తీసుకొచ్చాం. 
– ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేకుండా ప్రతి పేద లబ్ధిదారుడి చేతికి డబ్బు అందించాం. ఒక బటన్‌ నొక్కగానే ఎలాంటి అవినీతికి తావులేకుండా డీబీటీ పద్ధతిలో నేరుగా వాళ్ల ఖాతాల్లోకి వేయడం ద్వారా దేవుడి దయతో మన రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని నిలబెట్టగలిగాం. 
– ఇలాంటి కష్టకాలంలో పేదల చేతికి ప్రభుత్వం అప్పో, సప్పో చేసైనా సరే అందించిన డబ్బే ఒక రాష్ట్రానికైనా, దేశానికైనా సంజీవని అవుతుందని అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక వేత్తలు గట్టిగా చెబుతున్నారన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడి ఎల్లో మీడియా, టీడీపీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా వారి స్వార్థం కోసం వక్రీకరిస్తుండటం దురదృష్టకరం.   

ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు మైనస్‌ 5.2 శాతం ఉన్న ఈ సమయంలో కూడా, మన రాష్ట్రంలో అలాంటి వెనుకబాటుకు ఆస్కారం ఇవ్వలేదు. మన రైతును, మన పరిశ్రమను, మన పేద సామాజిక వర్గాలను మనం నిలబెట్టుకోగలిగాం. చిన్న గ్రోత్‌ రేటు అయినప్పటికీ, మిగతా వాళ్లంతా మైనస్‌లో ఉన్నా, మనం మాత్రం ఎంతో కొంత పాజిటివ్‌గానే అడుగులు ముందుకు వేశాం.

పరిశ్రమలను రప్పించడమే కాకుండా, అవి ఉత్పత్తి చేస్తున్న వస్తువులను కొనుగోలు చేసే శక్తి ప్రజలకు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. దానివల్ల పరిశ్రమలు నిలబడతాయి. ఉపాధికి ఊతం లభిస్తుంది. అట్టడుగు వర్గాల్లోని ప్రజలకు ఆ కొనుగోలు శక్తి లేకపోతే ఆర్థిక సైకిల్‌తో పాటు, అందులో ఉన్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా దెబ్బ తింటారు. పరిశ్రమలు మూతబడే పరిస్థితి వస్తుంది.
– సీఎం వైఎస్‌ జగన్‌ 

ఇవీ చదవండి:
గతంలో హడావుడి ఎక్కువ.. పని తక్కువ: సీఎం జగన్‌ 
ఏపీ పోలీస్‌ శాఖకు 5 జాతీయ అవార్డులు: డీజీపీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement