జన నేతను కళ్లారా చూడాలని తాపత్రయం
కేసరపల్లిలో బస చేసిన ప్రాంతానికి వెల్లువెత్తిన నేతలు, అభిమానులు
గాయం బాధతో విశ్రాంతి తీసుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి/గన్నవరం: ప్రతి ఇంటికీ పెద్ద కొడుకయ్యాడు.. కష్టం వచ్చిన ప్రతిసారి అన్నగా తోడయ్యాడు.. అడగకుండానే ప్రజల అవసరాలు తెలుసుకుని మరీ తీరుస్తున్నాడు.. కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం అంటూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు.. అలాంటి సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగిందని తెలిసి రాష్ట్ర ప్రజల్లో ఆందోళన మొదలైంది. అభిమానుల హృదయం తల్లడిల్లిపోతోంది. బిడ్డ ఎలా ఉన్నాడోనని ఓ తల్లి.. కొడుకు ఏం చేస్తున్నాడోనని ఓ తండ్రి.. అన్నకేమైందోనని ఓ చెల్లి, తమ్ముడు.. ఇలా జగన్‌ను తమ కుటుంబ సభ్యుడిగా సమాదరించే వందలాది మంది ఒకసారి తమ నేతను చూడాలని తాపత్రయపడ్డారు.
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్‌పై విజయవాడలోని సింగ్‌నగర్ వద్ద హత్యాయత్నం జరగడంతో ఆయన తీవ్రంగా గాయపడి ఆదివారం యాత్రకు విరామం ఇచ్చారు. అయినా ఇంటికి వెళ్లిపోకుండా కృష్ణా జిల్లా కేసరపల్లి వద్ద రాత్రి బస చేసిన ప్రాంతంలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ను చూడాలని, పలకరించి యోగక్షేమాలు తెలుసుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
ఉదయం నుంచీ వస్తున్న జన ప్రవాహాన్ని పోలీసులు నిలువరించారు. గాయం తీవ్రత కారణంగా జగన్ ఎవరినీ కలిసే పరిస్థితుల్లో లేరని, ఈ ఒక్కరోజు ఆగితే బస్సుయాత్రలో మరలా ఆయన మీ ముందుకు వస్తారని నచ్చజెప్పి అందరినీ వెనక్కు పంపించారు. ‘జగనన్నా. నీకేం కాదన్నా. మేమంతా నీవెంటే ఉంటామన్నా. మీరు క్షేమంగా మా మధ్యకు రావాలన్నా. మిమ్మల్ని మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామన్నా’ అని నినాదాలు చేస్తూ.. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రారి్థస్తూ వారంతా అక్కడి నుంచి తరలివెళ్లారు.
బస ప్రాంతానికి వచ్చిన మంత్రులు, ఎంపీలు
గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో బస చేసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పరామర్శించేందుకు ఆదివారం పలువురు ప్రముఖులు విచ్చేశారు. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, జోగి రమేష్, విడదల రజని, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్ప, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ తదితరులు ఇక్కడకు వచ్చిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment