అదే మా లక్ష్యం: సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan Review on Food Processing Clusters | Sakshi
Sakshi News home page

రైతులకు మంచి ధరలు అందించాలన్నదే లక్ష్యం..

Published Mon, Nov 23 2020 6:23 PM | Last Updated on Mon, Nov 23 2020 6:34 PM

CM YS Jagan Review on Food Processing Clusters - Sakshi

సాక్షి, అమరావతి: రైతులకు మంచి ధరలు అందించాలన్నదే లక్ష్యమని.. దీని కోసం అనేక చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.‌ సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఫుడ్‌ ప్రాససింగ్‌ క్లస్టర్లపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, మార్కెటింగ్, ఆర్థిక శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రైతులు అధికంగా పండిస్తున్న పంటల వివరాలను సేకరించి, ఆ మేరకు ప్రాససింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఫుడ్‌ ప్రాససింగ్‌ రంగంలో అనుసరిస్తున్న కొత్త సాంకేతిక విధానాలు, వాటి వల్ల ఉపయోగాలపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రాసెసింగ్‌ చేసిన తర్వాత మార్కెటింగ్‌ కోసం పెద్ద పెద్ద సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటామని అధికారులు తెలిపారు. (చదవండి: ఆ విషయంలో ఏమాత్రం రాజీపడం: సీఎం జగన్‌)

మొక్కజొన్న, చిరుధాన్యాలు (మిల్లెట్స్‌), కందులు, అరటి, టమోటా, మామిడి, చీనీ, ఉల్లి, మిర్చి, పసుపు తదితర పంటల దిగుబడి, అవసరమైన ప్రాససింగ్‌ ప్లాంట్లపై అధికారులు ప్రతిపాదనలు వివరించారు. ప్రాససింగ్‌ యూనిట్లకు దాదాపు రూ.2900 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 ప్రాససింగ్‌ యూనిట్ల ఏర్పాటును అధికారులు ప్రతిపాదించారు.

సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ఈ ధరలకు పంటలను కొనుగోలు చేస్తామని ముందుగానే మనం రైతులకు చెప్తున్నామని పేర్కొన్నారు. కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతుల నుంచి ప్రభుత్వం పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందన్నారు. అలా కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ (వాల్యూ ఎడిషన్‌) జోడించడం చాలా ముఖ్యమని, దీని కోసం ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లు, క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. వ్యవసాయ మార్కెటింగ్‌ విభాగం, ప్రాససింగ్‌ యూనిట్లకు ముడి పదార్థాలను అందించేలా ఉండాలని, ప్రాసస్‌ చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్‌లో వివిధ సంస్థలకు అప్పగించాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం? దానికి సరిపడా ఎక్కడెక్కడ ప్రాససింగ్‌ ప్లాంట్లను పెట్టాలన్న దానిపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. (చదవండి: పచ్చి అబద్ధాలే ‘పచ్చ’ రాతలు!)

‘‘రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు సరి పడే సామర్థ్యంతో ఈ ప్రాససింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. రైతులు సమస్యలు ఎదుర్కొంటున్న అరటి, చీనీ తదితర ఉత్పత్తుల ప్రాససింగ్, వాల్యూ యాడ్‌తో ఉత్పత్తుల తయారీ అంశాలపై దృష్టి పెట్టాలి. దీనిపై మరింతగా పరిశీలన, అధ్యయనం చేయాలి. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాససింగ్, ప్యాకేజింగ్‌ తదితర అంశాల్లో కొత్త సాంకేతిక విధానాలపై ఒక వింగ్‌ పని చేయాలి. ఫుడ్‌ ప్రాససింగ్‌ రంగంలో ఒక మెగా ప్లాంట్‌ అవసరం ఉందన్న అధికారులు, ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.

ఆర్బీకేల పరిధిలో గోడౌన్ల నిర్మాణం, జనతా బజార్లు, ప్రాథమిక ఆహార ఉత్పత్తుల శుద్ధి. అలాగే రెండో దశ ప్రాససింగ్, మొత్తం ఈ కార్యక్రమాల కోసం దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లపై పెద్ద ఉత్తున డబ్బు వెచ్చిస్తున్నందున యూనిట్లన్నీ కూడా అత్యంత ప్రొఫెషనల్‌ విధానంలో నడవాలని, రైతులకు అండగా నిలవాలి. వాటి నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలి. ఈ ప్రాససింగ్‌ యూనిట్లు బలోపేతంగా, సమర్థవంతంగా నడపడం వల్ల రైతులకు అండగా నిలిచినట్టు అవుతుంది. ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు విశ్వసనీయత ఉన్న సంస్థలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement