సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా వైరస్, బ్లాక్‌ఫంగస్, బాధితులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్ సరఫరా, నిల్వలపైన సోమవారం సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌పై ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా.. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు.అర్బన్‌లో ప్రతి పదిలక్షల జనాభాకు కేసులు 2632.. రూరల్‌లో ప్రతి పదిలక్షల జనాభాకు కేసులు 1859 ఉన్నాయని అధికారులు తెలిపారు. పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, మే 16న పాజిటివిట్ రేటు 25.56 శాతం ఉండగా, మే 30 నాటికి 15.91 శాతంగా నమోదైందని వెల్లడించారు.
అలాగే 2 లక్షలకుపైగా ఉన్న యాక్టివ్ కేసులు 1.6 లక్షలకు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. రికవరీ రేటుకూడా గణనీయంగా మెరుగుపడిందని, మే 7న 84.32శాతంగా ఉన్న రికవరీ రేటు, ప్రస్తుతం దాదాపు 90శాతానికి చేరిందని వెల్లడించారు. మే 3న 19,175 కాల్స్ 104కు రాగా, మే 29న 3,803 కాల్స్ నమోదయ్యాయని, కేసుల సంఖ్య తగ్గిందనడానికి ఇదొక సంకేతమని అన్నారు. అన్ని జిల్లాల్లో కూడా కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు.
బ్లాక్‌ఫంగస్, బాధితులకు అందుతున్న వైద్యంపై సీఎం సమీక్ష
ప్రస్తుతం రాష్ట్రంలో 1179 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని, ఇందులో 1068 మందికి వైద్యం అందుతోందని, 97 మందికి నయం అయ్యిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 14 మంది మరణించారని, కోవిడ్ లేకున్నా.. బ్లాక్ ఫంగస్ వస్తుందన్న విషయం తమ పరిశీలనలో తేలిందని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో 1139 మంది కోవిడ్ సోకినవారు కాగా, 40 మందికి కోవిడ్‌రాకపోయినా బ్లాక్ ఫంగస్ వచ్చిందన్నారు.
డయాబెటిస్ ఉన్నవారికి అధికంగా వస్తోందని తెలిపారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి అవసరమైన ఇంజక్షన్లు, మాత్రలు అందుబాటులోకి తెచ్చుకునేలా ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కేంద్రం కేటాయింపులు ప్రకారమే ఇంజక్షన్లు వస్తున్నాయని, మాత్రలను అవసరమైనంత మేర సిద్ధంచేసుకుంటున్నామని, అలాగే ప్రత్యామ్నాయ ఇంజక్షన్లుకోసం కూడా కృషిచేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఆక్సిజన్ సరఫరా, నిల్వలపైనా ముఖ్యమంత్రి సమీక్ష
ఆక్సిజన్ వినియోగం 490 టన్నులకు తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 29న 654 టన్నులను సేకరించామని, స్థానికంగా 230 టన్నుల ఉత్పత్తి ఉందని వెల్లడించారు. వినియోగం ఆస్థాయికి వచ్చేంతవరకూ కూడా అధికారులు ఆక్సిజన్ సేకరణ, నిల్వలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వచేసే ట్యాంకులు ఉండాలని సీఎం ఆదేశించారు.
కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 92 మంది పిల్లలను ఇప్పటివరకూ గుర్తించామని, వీరిలో 43 మందికి రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేశామని అధికారులు వెల్లడించారు. సరైన పథకాల్లో ఈ డబ్బు మదుపు చేయడం ద్వారా భద్రత, నెలనెలా వారి మెయింటినెన్స్ కోసం మంచి వడ్డీ వచ్చేలా చూడాలని.. చదువులకోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని.. అలాగే ఉద్యోగాలకోసం వీసాలపై విదేశాలకు వెళ్లేవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని.. వారికి వ్యాక్సిన్ ఇచ్చినట్టుగా ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment