సాక్షి, అమరావతి: నాడు–నేడు కార్యక్రమం వల్ల ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన పిల్లల సంఖ్యకు తగినట్టుగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పిల్లల సామర్థ్యానికి తగినట్టుగా వసతులు, బోధన సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యా శాఖ కార్యకలాపాలైన స్కూళ్ల మ్యాపింగ్, జగనన్న విద్యా కానుక, నాడు–నేడు రెండో దశ, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, టాయిలెట్ల నిర్వహణ, స్వేచ్ఛ తదితర అంశాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాడు–నేడు మొదటి దశ, రెండో దశ తర్వాత పెరిగే పిల్లల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అదనపు తరగతి గదులు, అదనంగా ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతులు, నియమించాల్సిన బోధన సిబ్బందిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్, సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. వీటిపై ఎప్పటికప్పుడు యాక్షన్ టేకెన్ రిపోర్టును తనకు నివేదించాలని చెప్పారు. ఈ సందర్భంగా స్కూళ్ల నిర్వహణపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
విద్యాశాఖపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రి ఆదిమూలపు సురేష్, వివిధ శాఖల ముఖ్య అధికారులు
మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలి
– నూతన విద్యా విధానం ప్రకారం ఆరు రకాల స్కూళ్లను ఏర్పాటు చేశాం. ఈ కొత్త విధానం ప్రకారం ఇప్పటికే కొన్ని ఏర్పాటయ్యాయి. మిగిలిన స్కూళ్ల మ్యాపింగ్‌పై దృష్టి పెట్టాలి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.
– వసతుల నిర్వహణ గురించి పట్టించుకోకపోతే నాడు–నేడు కింద చేపట్టిన పనులకు అర్థం లేదు. దీనిపై ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బంది ఉండేలా చేయడంలో ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు తీసుకుని సమర్థవంతంగా అమలు చేయాలి.
– పిల్లలకు మంచి చేసేందుకు తీసుకున్న నిర్ణయాలను వారికి వివరించి వారి భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వారిని కూడా పరిగణలోకి తీసుకుని వారి సూచనలతో ముందుకెళ్లాలి. టీచర్లకు ఇంగ్లిష్ బోధనపై శిక్షణకు సంబంధించి ఉద్దేశించిన యాప్స్‌ను బాగా వినియోగించుకునేలా చూడాలి.
మరింత రుచిగా గోరుముద్ద
– జిల్లా అధికారులు నిరంతరం స్కూళ్లను పర్యవేక్షించాలి. గోరుముద్ద నాణ్యత పరిశీలన కొనసాగాలి. వసతుల్లో, నిర్వహణలో లోపాలు ఉంటే వెంటనే నమోదు చేసి వాటిని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలి. గోరుముద్ద కింద ఇంకా కొత్త వంటకాలను అందించడంపై దృష్టి పెట్టాలి.
– మన ఇంట్లో మనం తినే తిండి ఎంత శుచిగా ఉండాలనుకుంటామో, అలాగే టాయిలెట్లు ఎంత పరిశుభ్రంగా ఉండాలనుకుంటామో.. స్కూళ్లలో వండే ఆహారం అంతే నాణ్యతగా ఉండాలి. టాయిలెట్లు కూడా అంతే పరిశుభ్రతతో ఉండాలి. ప్రభుత్వ పాఠశాల అనేది అందరిదీ అనే భావన తీసుకు రావాలి.
– అంగన్‌వాడీలు, స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్ క్లినిక్స్ దృష్టి పెట్టాలి. ఎప్పటికప్పుడు వారికి పరీక్షలు నిర్వహించాలి. రక్తహీనత లాంటి సమస్యల నివారణకు ఇది ఉపయోగపడుతుంది. పీహెచ్‌సీ డాక్టర్లకు అనుసంధానం చేస్తే వారు తగిన చికిత్స అందిస్తారు.
– ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదివరకెన్నడూ లేని విధంగా, విప్లవాత్మక రీతిలో నాడు–నేడు ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. నూతన విద్యా విధానానికి అనుగుణంగా సకల వసతుల మధ్య విద్యార్థులు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకున్నాం. ఇన్ని సౌకర్యాలను కల్పించడం ఒక ఎత్తు అయితే.. వీటి నిర్వహణ, సరిపడా.. సబ్జెక్టుల వారీగా బోధన సిబ్బంది మరో ఎత్తు. ఇవన్నీ సక్రమంగా ఉండేలా చూస్తేనే అనుకున్న ఫలితం త్వరగా వస్తుంది. ఇందుకోసం నిర్ధిష్ట ప్రణాళిక ప్రకారం వీటన్నింటిపై దృష్టి పెట్టాలి.
ప్రభుత్వ పాఠశాలలు మనందరి ఆస్తి అనే భావన రావాలి. ఉపాధ్యాయులందరూ వీటిని ఓన్ చేసుకోవాలి. అప్పుడే ఇక్కడ అన్ని సమస్యలకు పరిష్కారం సులువవుతుంది.
ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, అందరూ కలసి చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు. నాణ్యమైన విద్యకు బాటలు వేయొచ్చు. –సీఎం వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment